మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 24, 2020 , 19:45:11

ప‌ది ఫ‌లితాల్లో అవిభ‌క్త క‌వ‌ల‌లు వీణ - వాణి టాప్

ప‌ది ఫ‌లితాల్లో అవిభ‌క్త క‌వ‌ల‌లు వీణ - వాణి టాప్

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ కు చెందిన అవిభ‌క్త క‌వ‌ల‌లైన వీణ - వాణిలు ప‌ది ఫ‌లితాల్లో టాప్ లో నిలిచారు. సాధార‌ణ విద్యార్థుల‌కు తీసిపోకుండా.. వీరిద్ద‌రూ మెరుగైన ఫ‌లితాలు సాధించారు. ఇటీవ‌ల విడుద‌లైన టెన్త్ ఫ‌లితాల్లో వీణ 9.3 జీపీఏ స్కోర్ సాధించ‌గా, వాణి 9.2 జీపీఏ స్కోర్ సాధించి.. అంద‌రితో శ‌భాష్ అనిపించుకుంటున్నారు. 

అవిభ‌క్త క‌వ‌ల‌లు వీణ - వాణి.. ఇంట‌ర్ లో చేరేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. ఇంట‌ర్మీడియ‌ట్ లో ఎంఈసీ(మ్యాథ్స్, ఎకాన‌మిక్స్, కామ‌ర్స్) చ‌ద‌వాల‌ని నిర్ణ‌యించుకున్నారు. వీరి త‌ల్లి నాగ‌ల‌క్ష్మి మాట్లాడుతూ.. ఇద్ద‌రు కూడా ఎంఈసీలో చేరాల‌ని అనుకున్నారు. భ‌విష్య‌త్ లో కంప్యూట‌ర్ రిలేటెడ్ జాబ్ చేయాల‌న్న‌ది వారి ఆకాంక్ష అని త‌ల్లి తెలిపారు. 

అవిభక్త కవలలైన వీణ, వాణి మార్చిలో జ‌రిగిన మొద‌టి మూడు ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యారు. హైదరాబాద్ మధురానగర్‌లోని ప్రతిభా హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో వీరిద్దరూ వేర్వేరు హాల్ టికెట్లతో ప‌రీక్ష‌లు రాశారు. యూసఫ్‌గూడలోని స్టేట్ హోం నుంచి సూపరింటెండెంట్ సఫియా ప్రత్యేక అంబులెన్స్‌లో అవిభక్త కవలలిద్దరినీ పరీక్షా కేంద్రానికి తీసుకొచ్చారు.

ఇద్దరూ ఒకేసారి పరీక్ష రాయడానికి వీలులేకపోవడంతో స్టేట్ హోం అధికారులు వీరికి ఇద్దరు సహాయకులను కూడా కేటాయించారు. పరీక్ష రాసేందుకు ఇద్దరికీ తొమ్మిదో తరగతికి చెందిన విద్యార్థులను సహాయకులుగా నియమించారు.


logo