గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 28, 2020 , 23:13:30

సోనియాకు ఇన్నేండ్లు ఎందుకు పట్టింది?

సోనియాకు ఇన్నేండ్లు ఎందుకు పట్టింది?

‘పీవీ ఘనతల్ని పార్టీ ఘనతలుగా ప్రకటించిన కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఏనాడూ ఆయన్ను సరిగా గుర్తించలేదు. ఆయన నాయకత్వ పటిమను శ్లాఘించలేదు. దేశానికి ఆయన చేసిన సేవనూ కొనియాడలేదు. చివరికి పీవీ పార్థివ దేహాన్ని కూడా పార్టీ ప్రధానకార్యాలయంలోకి తీసుకెళ్లడానికి ఒప్పుకోలేదు. 1996లో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయాక కొద్దికొద్దిగా పీవీ ఘనతలు కనుమరుగైపోయాయి. సోనియా, రాహుల్‌ నాయకత్వంలో ఆయన ఊసెత్తడానికి కూడా ఇష్టపడలేదు’ ఇవీ రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలు. 

పీవీ శతజయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంగా, తేరుకున్న టీపీసీసీ శతజయంతి వేడుకలు అంటూ సందడి మొదలుపెట్టింది. ఈ సందర్భంగా సోనియాగాంధీ పీవీ సేవలను కొనియాడారు. ఆయన గొప్ప నేత అని, కాంగ్రెస్‌ వాది అని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆయన హయాంలో గొప్ప విజయాలు సాధించిందని గుర్తు చేశారు. ‘విపత్కర సమయంలో ప్రభుత్వ పగ్గాలు చేపట్టి ఆర్థిక, విదేశాంగ, సామాజిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఎన్నో సవాళ్లను పరిష్కరించారు’ అని పేర్కొన్నారు. మరి ఇప్పుడు కొనియాడారుగా! అని అడిగితే.. పీవీ గొప్పతనాన్ని గుర్తించడానికి సోనియాకు ఇన్నేండ్లు ఎందుకు పట్టిందని ఎదురు ప్రశ్నిస్తూనే లోతైన వివరణ ఇచ్చారు విశ్లేషకులు. సోనియాకు, పీవీకి అభిప్రాయభేదాలు ఎలా వచ్చాయో తెలుసా! అంటూ గతంలోకి వెళ్లిపోయారు. ‘అది 1991. రాజీవ్‌ హత్య తర్వాత.. కాంగ్రెస్‌ పగ్గాలు, అధికారాన్ని ఎవరు చేపట్టాలన్న దానిపై చర్చ జరగ్గా ఎన్డీ తివారీ, అర్జున్‌ సింగ్‌, శరద్‌ పవార్‌ పేర్లు వినిపించాయి. అప్పటికి సోనియా రాజకీయాలపై ఆసక్తి చూపలేదు. 


చివరికి గొప్ప అనుభవం, వివాదాలకు అతీతుడిగా ఉన్న పీవీ నరసింహారావువైపు అంతా మొగ్గు చూపారు. సోనియాతో పీవీ భేటీ అయ్యి నమ్మకస్తుడిగా ఉంటానని చెప్పారు. కానీ, ఆ తర్వాత సమీకరణాలు మారిపోయాయి.’ అని వివరించారు. తొలిసారిగా 1992లో విన్సెంట్‌ జార్జ్‌ రాజ్యసభ సీటు వ్యవహారంలో, రెండోసారి బాబ్రీ మసీదు కూల్చివేత, తర్వాత రాజీవ్‌ హత్యకేసు విచారణ.. ఇలా చాలా వ్యవహారాల్లో పీవీకి, సోనియాకు మధ్య ఎడం పెరిగిందని వెల్లడించారు. కొందరు పార్టీ సీనియర్‌ నేతలు కూడా సోనియాకు పీవీపై వ్యతిరేకంగా చెప్పటం కూడా ఆమె ఆగ్రహానికి కారణమై ఉంటుందని విశ్లేషకులు తెలిపారు. అయితే, దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త జీవం పోసిన పీవీ శతజయంతి ఉత్సవాలు నిర్వహించకపోతే రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె పీవీని ఇన్నేండ్లకు కొనియాడారని విశ్లేషకుల అభిప్రాయం.


logo