మంగళవారం 07 ఏప్రిల్ 2020
Telangana - Mar 11, 2020 , 17:35:15

రేవంత్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ

రేవంత్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ

హైదరాబాద్‌ : మల్కాజ్‌గిరి కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ను మియాపూర్‌ కోర్టు తిరస్కరించింది. అనుమతి లేకుండా డ్రోన్‌ వాడిన కేసులో రేవంత్‌ రెడ్డిని ఈ నెల 6వ తేదీన నార్సింగి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రేవంత్‌ రెడ్డి చర్లపల్లి జైల్లో ఉన్నారు.

డ్రోన్‌ చిత్రీకరణ ఆరోపణల కేసుపై రేవంత్‌ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. నార్సింగి పోలీసు స్టేషన్‌లో తమపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ కొట్టివేయాలని కోరుతూ కోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. 

మార్చి 1న ఎంపీ రేవంత్‌రెడ్డి సోదరుడైన అనుముల కృష్ణారెడ్డి (45) సూచనమేరకు ఉప్పర్‌పల్లికి చెందిన అన్నదమ్ములు విజయ్‌పాల్‌రెడ్డి, ప్రవీణ్‌పాల్‌రెడ్డి, వీరి స్నేహితుడైన విజయ్‌సింహారెడ్డి కారులో జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌ ఆఫీస్‌కు వచ్చారు. అక్కడినుంచి డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరణ కోసం ప్రవీణ్‌పాల్‌రెడ్డి, విజయ్‌సింహారెడ్డి కోకాపేటకు వెళ్లి జైపాల్‌రెడ్డి అనే వ్యక్తిని కలిశారు. జైపాల్‌రెడ్డి స్థానిక యువకుడైన ఓం ప్రకాశ్‌రెడ్డిని వీరికి పరిచయం చేసి చిత్రీకరణకు సహకరిస్తారని చెప్పారు. 

వీరంతా డ్రోన్‌ కెమెరాతో అక్కడి క్రికెట్‌ గ్రౌండ్‌వద్ద ఉన్న ఎత్తు ప్రదేశానికి వెళ్లారు. రహస్యంగా వారు అనుకున్న ప్రాంతంతోపాటు పరిసరాలను చిత్రీకరించి వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగించారు. వివరాలను కృష్ణారెడ్డికి వాట్సప్‌ ద్వారా పంపించారు. ఆ తర్వాత రేవంత్‌రెడ్డి కార్యాలయానికి చేరుకొని పూర్తి సమాచారాన్ని కృష్ణారెడ్డికి అందజేశారు. 

ఈ వ్యవహారంపై ఫిర్యాదు రావడంతో దర్యాప్తుచేసిన నార్సింగి పోలీసులు.. బుధవారం ప్రవీణ్‌పాల్‌రెడ్డి, విజయ్‌సింహారెడ్డి, జైపాల్‌రెడ్డి, రాజేశ్‌ (డ్రోన్‌ ఆపరేటర్‌), శివ, ఓం ప్రకాశ్‌రెడ్డిను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. వీరందరీపై 224/2020లో సెక్షన్‌ 184,187 ఐపీసీ, 11ఏ రెడ్‌ విత్‌ 5ఏ ఎయిర్‌ క్రాఫ్ట్‌ కింద అభియోగాలు మోపారు. సైబరాబాద్‌ పరిధిలో డ్రోన్‌ కెమెరా ఉపయోగించడంపై ఇప్పటికే నిషేధం ఉన్నది.


logo