మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 19, 2020 , 02:35:08

పింఛన్‌ బీజేపోళ్లు ఇస్తున్నారా?

పింఛన్‌ బీజేపోళ్లు ఇస్తున్నారా?

  • అబద్ధాలు చెప్పి ఓట్లడగడం సిగ్గుచేటు
  • టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత కాంగ్రెస్‌, బీజేపీకి లేదు 
  • ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

సిద్దిపేట, నమస్తే తెలంగాణ: రాజకీయ లబ్ధి పొందేందుకే బీజేపీ గోబెల్స్‌ ప్రచారానికి దిగిందనీ, అందుకోసమే సోషల్‌ మీడియాలో తెలంగాణ ప్రభుత్వంపై తప్పుడు విషయాలను ప్రచారం చేస్తున్నారని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్రంలో లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న పింఛన్‌లో మొత్తం డబ్బులు కేంద్రమే ఇస్తుందని బీజేపీ నాయకులు ప్రచారం చేస్తూ ఓట్లు అడుగడం సిగ్గు చేటన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా దుబ్బాక రెడ్డి సంక్షేమ భవన్‌లో మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజిపేట, హబ్సిపూర్‌ గ్రామాలకు చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు 200 మందికిపైగా టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు వెంకటనర్సింహారెడ్డి, రొట్టె రాజమౌళితో కలిసి మంత్రి హరీశ్‌రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అంతకుముందు సిద్దిపేటలో ఎమ్మెల్యే చంటి క్రాంతికుమార్‌ ఆధ్వర్యంలో మంత్రి హరీశ్‌రావుతో తొగుట మండలం పల్లెపహాడ్‌ ప్రజలు, మహిళలు సమావేశమయ్యారు. ఆయా సమావేశాల్లో హరీశ్‌రావు మాట్లాడుతూ.. దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ రోజురోజుకు ఖాళీ అవుతుందన్నారు. ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులంతా సైలెంట్‌ అయ్యారని చెప్పారు. ‘బీడీ కార్మికులకు రూ.1,600 పింఛన్‌ ఇస్తున్నట్లు బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. మీ వద్ద ఆధారాలు ఉంటే చూపాలి’ అని బీజేపీ నాయకులను మంత్రి డిమాండ్‌ చేశారు. గుజరాత్‌ సహా బీజేపీ పాలిత రాష్ర్టాల్లో బీడీ కార్మికులకు ఎందుకు పింఛన్లు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో వృద్ధులకు, వితంతువులకు రూ. 500, కర్ణాటకలో రూ.400 పెన్షన్‌ ఇస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాజస్థాన్‌లో రూ.500 పెన్షన్‌ ఇస్తున్నారని, తెలంగాణలో మన సీఎం కేసీఆర్‌ రూ.2 వేల పెన్షన్‌ ఇస్తున్నారని చెప్పారు. రూ.200 నుంచి రూ. 2 వేల పింఛన్‌కు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏడాదికి పింఛన్ల కోసం రూ.11,720 కోట్లు ఇస్తున్నదని, ఢిల్లీ నుంచి వచ్చేది రూ.210 కోట్లు మాత్రమేనన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత కాంగ్రెస్‌, బీజేపీకి లేదని చెప్పారు. 

కేంద్రానివి రైతు వ్యతిరేక విధానాలు  

కేంద్రం చేపడుతున్న రైతు వ్యతిరేక విధానాల వల్లే ఓ కేంద్ర మంత్రి రాజీనామా చేశారని హరీశ్‌రావు అన్నారు. ప్రజల సంక్షేమం కోసం బీజేపీ ఒక్క మంచి పనైనా చేసిందా? అని ప్రశ్నించారు. బీజేపీకి ఓట్లు వేయడం అంటే మోటర్లకు మీటర్లు పెట్టడానికి మనం సమ్మతం చెప్పినట్లేనని అన్నారు. విదేశాల నుంచి మక్కజొన్న దిగుమతి చేసుకుంటే మన దేశంలో ఉత్పత్తి అవుతున్న మక్కజొన్నలను ఎవరు కొంటారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇక్కడి రైతుల జీవితాలు మారిపోయాయన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో పరిశ్రమలు రాబోతున్నాయనీ, కొద్దిరోజుల్లోనే రైలు మార్గం వస్తుందన్నారు. 

అందరికీ అందుబాటులో ఉంటా: టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాత

‘మీకు అందుబాటులో ఉంటా.. మీ రామలింగారెడ్డి లాగే అభివృద్ధి చేస్తా.. ఆయనపోయి నన్ను ఆగం చేసిండు. సీఎం కేసీఆర్‌ ఆశీర్వాదంతో మీ ముందుకు వచ్చా.. సేవ చేసే అవకాశం కల్పించండి’ అని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత ప్రజలకు విజ్ఞప్తిచేశారు. ఆదివారం చేగుంట మండలంలోని వివిధ గ్రామాల్లో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డితో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డిల సహకారంతో దుబ్బాకను అభివృద్ధి చేస్తానని తెలిపారు. 

వాహనాల తనిఖీల్లో డబ్బులు స్వాధీనం

చేగుంట: ఉపఎన్నికల నేపథ్యంలో నిర్వహిస్తున్న తనిఖీల్లో పెద్ద మొత్తంలో డబ్బులు లభిస్తున్నాయి. నార్సింగి పరిధిలోని కాస్లాపూర్‌ చౌరస్తా వద్ద ఆదివారం వాహనాలను తనిఖీ చేయగా అర్జున్‌రెడ్డి అనే వ్యక్తి రామాయంపేట నుంచి హైదరాబాద్‌కు కారులో రూ.9.49లక్షలను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కామారెడ్డి జిల్లా దేవునిపల్లికి చెందిన కొత్త అరవింద్‌ రూ.7 లక్షలను తరలిస్తుండగా ఆధారాలు చూపకపోవడంతో సీజ్‌ చేశారు.

ప్రలోభాలకు తెరతీసిన కాంగ్రెస్‌  

  • తిమ్మక్కపల్లిలో చీరెల పంపిణీ 

రాయపోల్‌: దుబ్బాక ఉప ఎన్నికలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రలోభాలకు తెరదీసింది. ఆదివారం ఉదయం సిద్దిపేట జిల్లా రాయపోల్‌ మం డలం తిమ్మక్కపల్లిలో ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్‌ నాయకులు చీరెలను పంచారు. గమనించిన గ్రామస్థులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. తొగుట సీఐ రవీందర్‌, రాయపోల్‌ ఎస్సై షేక్‌ మహబూబ్‌ అక్కడికి వెళ్లి చీరెలను స్వాధీనం చేసుకుని, పంచుతున్న వారిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. గ్రామానికి చెందిన ముగ్గురిపై కేసు నమోదు చేశారు.


logo