సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 24, 2020 , 00:46:16

ప్రాజెక్టులతో కాంగ్రెస్‌ నేతలకు కన్నీళ్లు

ప్రాజెక్టులతో కాంగ్రెస్‌ నేతలకు కన్నీళ్లు

  • ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
  • టీఆర్‌ఎస్‌లో చేరిన సంగారెడ్డి కౌన్సిలర్లు

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తేతెలంగాణ: సీఎం కేసీఆర్‌ కృషితో ప్రాజెక్టుల్లోకి నీళ్లు వస్తుంటే కాంగ్రెస్‌ నాయకులకు కన్నీళ్లు వస్తున్నాయని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. మంగళవారం సంగారెడ్డి పట్టణంలోని బాలాజీ గార్డెన్స్‌లో  కాంగ్రెస్‌ కౌన్సిలర్లు, సీనియర్‌ నాయకులు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ..  సీఎం చేపడుతున్న కార్యక్రమాలను ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నారన్నారు.

కర్నల్‌ సంతోష్‌బాబు కుటుంబాన్ని సీఎం ఆదుకున్న తీరును చూసి కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్‌ సింఘ్వీ అభినందించారని మంత్రి గుర్తుచేశారు. రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు మాత్రం ప్రతి విషయాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఆపత్కాలంలోనూ రూ.7 వేల కోట్లు రైతుబంధు కింద అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమచేస్తున్నామని, 40 లక్షల ఆసరా పింఛన్లు అందిస్తున్నామని, పభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసే ఇతర పార్టీల నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని పేర్కొన్నారు. 

సంగారెడ్డి మున్సిపల్‌ కౌన్సిలర్లు షేక్‌సాబేర్‌, విజయలక్ష్మి, ముంతాజ్‌బేగంలతోపాటు సీనియర్‌ నాయకులు, మాజీ కౌన్సిలర్లు టీఆర్‌ఎస్‌లో చేరినట్లు  తెలిపారు. తెలంగాణలో ఇక కాంగ్రెస్‌ ఖతమేనని మంత్రి హరీశ్‌రావు జోస్యం చెప్పారు. సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.


logo