బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 18, 2020 , 13:04:58

అభివృద్ధిని అడ్డుకోవడమే కాంగ్రెస్‌ లక్ష్యం: కర్నె ప్రభాకర్‌

అభివృద్ధిని అడ్డుకోవడమే కాంగ్రెస్‌ లక్ష్యం: కర్నె ప్రభాకర్‌

హైదరాబాద్‌: అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ నేతలు పనిచేస్తున్నారని మండలిలో ప్రభుత్వ విప్‌ కర్నె ప్రభాకర్‌ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి సమావేశాల్లోనే కాంగ్రెస్‌ నేతలు గందరగోళం సృష్టించారని, అభివృద్ధిని అడ్డుకుంటూ వికృతానందం పొందుతున్నారని మండిపడ్డారు. శాసన మండలి ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజల కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తున్నదని చెప్పారు. 

పాలనా సౌలభ్యంకోసమే కొత్త సచివాలయం నిర్మించాలని సీఎం కేసీఆర్‌ సంకల్పించారని వెల్లడించారు. అన్ని కార్యాలయాలను ఒకే గొడుగు కిందికి తేవడానికే కొత్త సచివాలయ నిర్మాణమని చెప్పారు. ప్రస్తుత సెక్రటేరియట్‌లో పార్కింగ్‌ స్థలం, క్యాంటీన్‌ కూడా లేవన్నారు. కాంగ్రెస్‌ నేతలు అడ్డుపడకుంటే కొత్త సచివాలయం ఈపాటికే సగం పూర్తయ్యేదని తెలిపారు. మంత్రిమండలి నిర్ణయాల్లో జోక్యంచేసుకోబోమని హైకోర్టు చెప్పినా కాంగ్రెస్‌ నేతలు సుప్రీంకోర్టుకు వెళ్లారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 

ఉస్మానియా దవాఖానను కొత్తగా నిర్మిస్తామని ముఖ్యమంత్రి అనగానే.. దాన్ని అడ్డుకుంటామని కాంగ్రెస్‌ నేతలు ప్రకటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్‌కు సంబంధించి కొత్త నిర్మాణాలను అడ్డుకున్న చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కడుతున్నప్పుడుకూడా ఆ పార్టీ నేతలు వికృత చర్యలకు పాల్పడ్డారని తెలిపారు. కాంగ్రెస్‌ పాలనలో ప్రజలకు కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదని విమర్శించారు. మిషన్‌ భగీరథకు ఆర్థిక సాయం చేయొద్దని కేంద్రానికి కాంగ్రెస్‌ నేతలు లేఖరు రాశారని వెల్లడించారు.


logo