గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 02, 2020 , 01:45:32

ప్రభుత్వ భూములూ దురాక్రమణ

ప్రభుత్వ భూములూ దురాక్రమణ
 • ఎంపీ రేవంత్‌రెడ్డి అక్రమాలు ఒక్కొక్కటీ వెలుగులోకి
 • సర్వే నం.34లోని 1.11 ఎకరాల ఆక్రమణ
 • వాల్టాచట్టం ఉల్లంఘన, బండ్లబాట కబ్జా
 • అక్రమ నిర్మాణాల కూల్చివేతకు రంగంసిద్ధం!

హైదరాబాద్‌ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి, అతని అనుచరగణం చేసిన భూ దందాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రూ.కోట్ల విలువైన భూములను హస్తగతం చేసుకొనేందుకు చేసిన మరిన్ని కుట్రలు అధికారుల దర్యాప్తులో బయటపడుతున్నాయి. రాజకీయ అండదండలతో ప్రభుత్వ భూములనూ ఆక్రమించుకున్న రేవంతుడు.. చెరువులు, కుంటలనూ వదల్లేదు. బండ్ల బాటలనూ కబ్జాచేసినట్టు తెలుస్తున్నది.  ఇటీవల రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లి రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్‌ 127లో 10.21 ఎకరాలు రేవంత్‌రెడ్డి, టీం కొనుగోలు చేసింది. అదంతా వివాదాల్లోనే ఉండటం విశేషం. పట్టాదారులెవరో తెలియదు. హక్కుదారుల లెక్క తేలలేదు. రెవెన్యూ పరిభాషలో ‘టైటిల్‌' లేనే లేదు. అయినా పలుకుబడే పెట్టుబడిగా అత్యంత ఖరీదైన భూమిని చెరబట్టారు. రెండువర్గాల మధ్య టైటిల్‌ వివాదం నడుస్తూనే ఉన్నా.. ఓ వర్గంనుంచి కొనుగోలు చేశామంటూ కొందరు అధికారుల సహకారంతో అక్రమంగా మ్యుటేషన్‌ చేయించుకున్నారు.


తామెవరికీ విక్రయించలేదని పట్టాదారులుగా, హక్కుదారులుగా చెప్తున్న రెండువర్గాలూ వాదిస్తున్నాయి. బెదిరించి ఆక్రమించుకున్నారని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ హరీశ్‌, రాజేంద్రనగర్‌ ఆర్డీవో కే చంద్రకళతో మొరపెట్టుకున్నారు. నాలుగురోజులుగా రెవెన్యూ అధికారుల దర్యాప్తులో రేవంత్‌రెడ్డి టీం సాగించిన దందాలో కొత్తకోణం వెలుగులోకి వచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. సర్వేనంబర్‌ 127లో తాము కొనుగోలు చేశామంటూ పక్కనున్న ప్రభుత్వ భూములను, చెరువులను, బండ్లబాటనూ ఆక్రమించుకున్నట్టు క్షేత్రస్థాయి విచారణలో వెల్లడైంది. అక్రమ నిర్మాణాలు, కుంటల ఆక్రమణ, నీటి వనరుల ధ్వంసం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించినచోట నిర్మించిన ప్రహరీపైన, గేటుపై ఎంపీ రేవంత్‌రెడ్డి, ఆయన సోదరుల పేర్లు కూడా రాసి ఉండటం గమనార్హం. ఇప్పటికే ఫిర్యాదుల పరంపర కొనసాగుతుండగా, ఇంకెంత మంది బాధితులు ముందుకొస్తారో వేచిచూడాలి. ప్రభుత్వ భూములతోపాటు ప్రైవేటు భూములనూ ఆక్రమించుకున్నారని తేలింది. 


ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన అంశాలు

 • సర్వేనంబర్‌ 127లో కొనుగోలు చేసినట్టుగా చెప్తున్నది 10.20 ఎకరాలు. దానికి ఉత్తరం దిక్కున సర్వేనంబర్‌ 34, 35లోని భూములు ప్రభుత్వానివి. అందులోనే టీఎన్జీవోలకు, యూనివర్సిటీకి భూములు కేటాయించారు. అయితే, రేవంత్‌ టీం సర్వేనంబర్‌ 127 చూపించి సర్వేనంబర్‌ 34లోని 1.11 ఎకరాలను కబ్జా పెట్టినట్టు తేలింది. ఇక్కడ ఎకరా విలువ రూ.25 కోట్ల పైమాటే కావడం విశేషం. 
 • సర్వేనంబర్‌ 126లో కోమటికుంట ఉన్నది. ఇది చాలా ఏండ్ల నాటిది. దాన్నీ వదల్లేదు. సర్వేనంబర్‌ 126లోని 1.14 ఎకరాల చెరువు విస్తీర్ణాన్ని 127 సర్వేనంబర్‌లోని భూమి అంటూ కలిపేశారు. బఫర్‌ జోన్‌కింద 22 గుంటలు, ఎఫ్‌టీఎల్‌ పరిధిలో 32 గుంటలుగా లెక్క తేలింది. చెరువులను రక్షించాల్సిన ప్రజాప్రతినిధి వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి దాన్ని భక్షించేందుకు యత్నిస్తున్నారు. సుప్రీంకోర్టు సూచనలను పట్టించుకోలేదు. ఆక్రమణదారులపై రెవెన్యూ ఫస్లీ యాక్టులో సెక్షన్‌ 24 ప్రకారం క్రిమినల్‌ చర్యలు తప్పవు. ఈ చెరువును కాపాడకపోతే భావితరాలకు ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు అంటున్నారు. నగరానికి దగ్గరలో ఉండే ప్రతి నీటి వనరును పరిరక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న దరిమిలా కోమటికుంట రక్షణకు చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం. 
 • ఏ ఊరిలోనైనా ఒక పొలం నుంచి మరో పొలానికి వెళ్లేందుకు మార్గాలు ఉండేవి. గోపన్‌పల్లి రెవెన్యూ మ్యాపులోనూ సర్వేనంబర్‌ 127 నుంచి ఓ వైపు 126, మరోవైపు 34లోకి వెళ్లేందుకు బండ్లబాట స్పష్టంగా ఉన్నది. దాన్ని పూర్తిగా మూసేశారు. అలా 10 గుంటలకు పైగానే స్వాహా చేసినట్టు తేలింది. వందల ఏండ్లనాటి బండ్లబాటను పునరుద్ధరించడం ద్వారా ఎంతోమందికి ప్రయోజనం కలుగుతుందని స్థానికులు అంటున్నారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని రెవెన్యూ అధికారులను కోరుతున్నారు.  
 • మరోవైపు సర్వేనంబర్‌ 127గా చెప్పుకొంటూ సర్వేనంబర్‌ 128లోని 10 గుంటలకు పైగానే క్లెయిమ్‌ చేస్తున్నారు. ఎవరైనా భూమి కొనుగోలు చేసేటప్పుడే హద్దురాళ్లను పెట్టించుకుంటారు. అందుకోసం సర్వే చేయించుకుంటారు. ఇక్కడేమో అధికార బలం ఉన్నదని అన్నింటినీ ఉల్లంఘించి దందాను సాగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
 • ఎంపీ రేవంత్‌రెడ్డి, ఆయన అనుచరవర్గం కొనుగోలు చేసినట్టు చెప్తున్న సర్వేనంబర్‌ 127లోనూ 5.21 ఎకరాలు కూడా టైటిల్‌ ఫేక్‌ అని తేలింది.  
 • తాజాగా రెవెన్యూ అధికారుల క్షేత్రస్థాయిలో ప్రాథమికంగా చేపట్టిన దర్యాప్తులో ఈ అక్రమాలన్నీ వెలుగులోకి వచ్చాయి. వాల్టా చట్టం ఉల్లంఘన, ప్రభుత్వ భూమి ఆక్రమణ, నీటి వనరుల ఆక్రమణ వంటి అంశాలపై క్రిమినల్‌ చర్యలు తీసుకోనున్నట్టు తెలిసింది. నేడో రేపో నిర్మాణాల కూల్చివేత మొదలుకానున్నట్టు సమాచారం.  
 • త్వరలోనే గోపన్‌పల్లిలో వివాదాస్పద సర్వేనంబర్‌ 127పై నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు ఓ రెవెన్యూ అధికారి ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. ఉల్లంఘనలు నిజమేనని విచారణలో తేలిందని, అక్రమార్కులపై చట్టం ప్రకారం క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని చెప్పారు.


logo
>>>>>>