శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 04, 2020 , 01:12:55

రేవంతు.. అక్రమతంతు

రేవంతు.. అక్రమతంతు
  • భూదందాపై ప్రాథమిక దర్యాప్తు పూర్తి
  • ప్రభుత్వ భూమితోపాటు పేదల ప్లాట్లు గల్లంతు
  • 18 పేజీలతో సమగ్ర నివేదిక
  • క్రిమినల్‌ చర్యలకు ఆర్డీవో చంద్రకళ సిఫారసు

హైదరాబాద్‌ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి, ఆయన సోదరుల భూదందాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. అధికారుల ప్రాథమిక దర్యాప్తులో రేవంతుడి అక్రమాలు తేటతెల్లమయ్యాయి. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లి సర్వే నం.127 భూదందాపై రాజేంద్రనగర్‌ ఆర్డీవో కే చంద్రకళ ప్రాథమిక దర్యాప్తు పూర్తిచేశారు. ఆ సర్వేనంబరును వివాదాల సుడిగుండంగా తేల్చారు. ప్రతి ఉత్తర్వు, ప్రతి పేరు మార్పు వెనుక లోపాలు వెల్లడయ్యాయి. అప్పటి అధికారులు ఆర్వోఆర్‌ చట్టాలను, నియమాలను పాటించకుండానే రికార్డుల్లో కొనుగోలుచేసిన వారి పేర్లను మార్చినట్టు తేలింది. ప్రస్తుతం రెవెన్యూ రికార్డుల పరిశీలన, ప్రభుత్వ భూములు, బండ్లబాట ఆక్రమణలు, కోమటికుంట బఫర్‌జోన్‌, ఎఫ్‌టీఎల్‌ను పరిశీలించి దర్యాప్తుచేసిన ఆర్డీవో.. 18 పేజీల నివేదిక రూపొందించారు. సర్వే నం.127, 128లో లేఅవుట్‌ చేసి విక్రయించిన ప్లాట్లను  తీసుకొంటే మరింత వివాదాస్పదంగా మారే అవకాశం కనిపిస్తున్నది.  


పహాణీల పరిశీలనతో దర్యాప్తు

1954-55 ఖాస్రా పహాణీ, 1955-58 సెస్లా పహాణీ మొదలుకొని ప్రస్తుత పహాణీల వరకు అన్ని విషయాలను ఆర్డీవో పరిశీలించారు. వడ్డె హనుమయ్య నుంచి శ్రీరామజయసింహ వరకు పట్టాదారులతోపాటు అక్రమార్కులను గుర్తించారు. మార్పు,చేర్పులను అధ్యయనం చేశారు. మొన్నటి భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం వరకు ప్రతి ఫైల్‌ను క్షుణ్ణంగా చూసిన తర్వాతే నివేదికను రూపొందించారు. వడ్డె మల్లయ్య పేరు దబ్బా మల్లయ్యగా మార్చి.. జనాన్ని ఏమార్చిన బాగోతాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. 


  • 1998-99, 1999-2000 పహాణీల్లో పట్టాదారు కాలమ్‌లో ఆర్‌ కళావతి పేరును రౌండప్‌చేసి సంతకం పెట్టారు. ఎలాంటి రిమార్కులు పేర్కొనలేదు. 2001-02లో మళ్లీ చేర్చారు. కారణాలు చూపలేదు.
  • 2005లో అప్పటి డిప్యూటీ కలెక్టర్‌ జారీచేసిన ప్రొసీడింగ్స్‌ బీ785/2005 ప్రకారం 2.21 ఎకరాలకు ఇ లక్ష్మయ్య తండ్రి మల్లయ్యకు వారసత్వ ధ్రువీకరణ చేశారు. కానీ, వడ్డె మల్లయ్యకు వారసుడిగా ఇ లక్ష్మ య్య ఎలా అయ్యారనే అంశం తేలలేదు. సక్సెషన్‌ (వారసత్వం) పొందిన ఇ లక్ష్మ య్య నుంచి కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి డాక్యుమెంట్‌ నం.15504/05 ప్రకారం కొనుగోలు చేశారు. ఆయనకు అప్పటి అధికారులు మ్యుటేషన్‌ చేసేశారు. ముందుగా రికార్డులు పరిశీలించలేదు. ఇ లక్ష్మయ్య నుంచి కొనుగోలు చేసిన మిగతా వారందరికీ మ్యుటేషన్‌ చేస్తూ రెవెన్యూ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు.
  • ప్రొసీడింగ్స్‌ నం.బి/222/2011 ప్రకారం ఇ అనిల్‌కుమార్‌ తండ్రి గాలయ్యకు వారసత్వం కింద 2.30 ఎకరాలు చేశారు. సర్వే నం.127/ఇ గా పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుల తర్వాత సర్వే నం.127లో విస్తీర్ణం 13.11 ఎకరాలకు చేరింది. అంటే అసలు కంటే పట్టాదారుల విస్తీర్ణం ఎక్కువైంది.
  • 2005, 2011లో పనిచేసిన డిప్యూటీ కలెక్టర్లు ఏ రాజేశ్వర్‌రెడ్డి, జీ సుబ్బారావుతోపాటు 2015 నుంచి 2016 వరకు పనిచేసిన డీ శ్రీనివాస్‌రెడ్డి వరకు ఆర్వోఆర్‌ చట్టాన్ని, గైడ్‌లైన్స్‌ను పాటించకుండానే మ్యుటేషన్‌ ఉత్తర్వులు జారీచేసినట్టు తాజా నివేదికలో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే శ్రీనివాస్‌రెడ్డిపై సస్పెన్షన్‌ వేటుపడింది. 
  • సక్రమంగా క్లెయిమ్‌ చేయని 5.21 ఎకరాలను బోనావెకెన్షియా పరిధిలోకి తీసుకురావాలని నివేదిక స్పష్టంచేసింది. 
  • సర్వే నం.34లో ఆక్రమించుకున్న ప్రభుత్వ భూమి 1.11 ఎకరాలను, బండ్లబాటను ఆక్రమించుకొని కలిపేసిన 10 గుంటల భూమిని తిరిగి స్వాధీనం చేసుకొనేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. కోమటి కుంట చెరువు ఎఫ్‌టీఎల్‌ సర్వే నం. 126లోని 32 గుంటలు, బఫర్‌ జోన్‌ కింద 22 గుంటల్లోని నిర్మాణాలను తొలగించనున్నారు. వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి ప్రహరీ నిర్మించి.. దానిపై ఏ రేవంత్‌రెడ్డి, ఆయన సోదరులు కొండల్‌రెడ్డి, కృష్ణారెడ్డి పేర్లు కూడా రాసుకున్నారు. 


ప్లాట్ల యజమానుల పాట్లు

గోపన్‌పల్లిలో రాజోలు నియోజకవర్గ ఎస్సీ మ్యుచువల్లీ ఎయిడెడ్‌ కో ఆపరేటివ్‌ హౌజింగ్‌ సొసైటీ లిమిటెడ్‌ ద్వారా ప్లాట్‌ నం.42, 43, 44 (మొత్తం విస్తీర్ణం 643 గజాలు), ప్లాట్‌ నం.24, 25, 26, 27 (మొత్తం విస్తీర్ణం 1000 గజాలు) కళ్లెం పేరిరెడ్డి కొనుగోలు చేశారు. డాక్టర్‌ ఓ నాగేశ్వర్‌రావు, రామారావు, కోలా అరుణ తదితరులు 337 గజాలు, 1044 గజాలు, 400 గజాలు, 1781 గజాలు వంతున కొనుగోలు చేశారు. ఇవన్నీ సర్వే నం.127(పార్ట్‌), 128(పార్ట్‌)లో ఉన్నట్టు వారి సేల్‌డీడ్స్‌లో ఉన్నాయి. పలువురు ఈ సొసైటీ పేరిట ఉన్న వెంచర్‌లో ప్లాట్లను కొనుగోలు చేశారు. వీరు కొనుగోలు చేసిన ప్లాట్లను రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు ఆక్రమించారని, ప్లాట్ల కోసం వేసిన హద్దు రాళ్లను తొలగించారని ఫిర్యాదుచేశారు. తుపాకులు గురిపెట్టి, అసభ్యంగా మాట్లాడారన్న అభియోగాలు బా ధితుల ద్వారా తెలిశాయని నివేదికలో పేర్కొన్నారు. సర్వేనం.127(పార్ట్‌), 128 (పార్ట్‌)లోని రాజోలు ఎస్సీ మ్యుచువల్లీ ఎయిడెడ్‌ కో ఆపరేటివ్‌ హౌజింగ్‌ సొసైటీ లో ఎన్పీ రాజు, కొప్పినేని రామకృష్ణ, సిరిగినిధి నర్సింహారావు, జాగృతిషా, జీ ప్రవీణ్‌కుమార్‌, అడబాల నాగేశ్వర్‌రావు, బీఎస్‌ ప్రకాశ్‌కుమార్‌, ఎస్‌ బెంజిమెన్‌బాబు 9 ప్లాట్లు(విస్తీర్ణం 2706 గజాలు) కొనుగోలు చేశారు. 1987లోనే కొన్నట్టు డాక్యుమెం ట్లు ఉన్నాయి. ఈ మేరకు సేల్‌డీడ్లను సమర్పించినట్టు నివేదికలో పేర్కొన్నారు. వారి ప్లాట్ల రాళ్లను తొలిగించి ఆక్రమించుకున్నట్టు బాధితులు 2014 ఫిబ్రవరిలోనే చందానగర్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ  కేసు కోర్టులో ఉన్నది. ప్లాట్లను ఆక్రమించుకున్నారంటూ ఆర్డీవో చంద్రకళకు పలువురు ఫిర్యాదు చేశారు. అక్రమార్కులపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆర్డీవో సిఫారసు చేశారు.


logo