e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home తెలంగాణ ఈటల వద్ద 200 కోట్ల భూమి

ఈటల వద్ద 200 కోట్ల భూమి

ఈటల వద్ద 200 కోట్ల భూమి
  • రావల్‌కోల్‌ వద్ద 2019లోనే కొనుగోళ్లు
  • కొడుకు నితిన్‌రెడ్డి, బినామీ కేశవరెడ్డి పేర 67 ఎకరాలు
  • పట్టాదార్‌ పాస్‌బుక్కులోఈటల రాజేందర్‌రెడ్డి
  • బ్లాక్‌మనీ మార్పిడికే కోళ్లఫారాలు
  • కాంగ్రెస్‌ నేత కౌశిక్‌రెడ్డి విమర్శ

కరీంనగర్‌, మే 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అక్రమ ఆస్తులు, కుంభకోణాలను బయట పెడుతున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కౌశిక్‌రెడ్డి.. శనివారం రూ.200 కోట్ల విలువగల భూముల వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చారు. ఈటల కొడుకు నితిన్‌రెడ్డితోపాటు ఈటల బినామీగా చెబుతున్న సాదా కేశవరెడ్డి పేరుపై ఉన్న 36.39 కలిపి మొత్తం 67 ఎకరాల పైచిలుకు భూముల కొనుగోళ్లను ఆధారాలతో వెల్లడించారు. ఇందులో విశేషం ఏమిటంటే.. ఈటల రాజేందర్‌ కాస్తా.. ఈ డాక్యుమెంట్లలో ఈటల రాజేందర్‌రెడ్డిగా మారిపోవడం! కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ భవన్‌లో కౌశిక్‌రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ ఈటల మీడియా ముందు అమాయకంగా నటిస్తున్నారని, ఆయన నటన ముందు పెద్దపెద్ద సినిమా నటులు పనికిరారన్నారు.
ఇటీవల ప్రెస్‌మీట్లలో తొండలు గుడ్లు పెట్టని భూములు మాత్రమే కొనుగోలు చేశామని, అది కూడా చాలా ఏండ్లక్రితమే కొన్నామని, ఇటీవల ఎలాంటి భూములు కొనలేదని ఈటల చెప్పిన మాటలు పచ్చి అబద్ధాలు, దగాకోరు ముచ్చట్లని ఆరోపించారు. మేడ్చల్‌ మండలం రావల్‌కోల్‌ పరిధిలోని సర్వేనంబర్‌ 64, 65, 66, 69, 71, 72, 73, 77, 78లో కొడుకు నితిన్‌రెడ్డి పేరుతో 2019లో 31.25 ఎకరాల భూమి కొనుగోలు చేశారని వెల్లడించారు. అలాగే, అతని బినామీ సాదా కేశవరెడ్డి పేరుతో 36.39 ఎకరాలు కొన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఎకరాకు రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల ధర పలుకుతుందని.. ఎంత తక్కువగా లెక్కించినా ఈ భూమి విలువ రూ.200 కోట్లు ఉంటుందని స్పష్టంచేశారు.
ఈ భూముల కొనుగోలుకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ చేయించాలని ముఖ్యమంత్రిని కోరారు. తన వద్ద ఉన్న బ్లాక్‌ మనీని వైట్‌గా మార్చుకోవడానికే ఈటల కోళ్లఫారాలు నడుపుతున్నారని ఆరోపించారు. రావల్‌కోల్‌ భూముల పట్టాదారు పాస్‌బుక్‌లో ఈటల నితిన్‌రెడ్డి తండ్రి పేరు ఈటల రాజేందర్‌రెడ్డి అని ఉన్నదని ఆధారాలు చూపించారు. నిజంగానే రెడ్డి అనే పేరు పెట్టుకోవడం నీకు ఇష్టం లేకపోతే.. 2019 నుంచి నేటివరకు అదే పేరును ఎందుకు కొనసాగిస్తున్నారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. బీసీ ముసుగులో ఆయా వర్గాలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
‘ఆత్మగౌరవం ఉందని చెప్పుకొనే నీవు.. హుజురాబాద్‌ వెళ్లి అందరితో మాట్లాడి రాజీనామా చేస్తామని ప్రకటించావు కదా? మూడు రోజులువుతున్నా ఎందుకు రాజీనామా చేయడం లేదు?’ అని నిలదీశారు. ‘ఇప్పుడు మాత్రం అన్ని బీసీ కులాల బాధ్యులకు ఫోన్‌చేసి.. మద్దతు ఇవ్వాలని కోరుతున్నావే.. అధికారంలో ఉన్నప్పుడే ఏ ఒక్కరికైనా ఏమైనా న్యాయం చేశావా? అని ప్రశ్నించారు. మున్ముందు మరిన్ని అక్రమాలు బహిర్గతం చేస్తా’ అని కౌశిక్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈటల అక్రమాలు, అన్యాయాలు ఒక్కరోజుతో ఒడిచేవి కావన్నారు. సమావేశంలో జిల్లా కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సత్యనారాయణరెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఈటల వద్ద 200 కోట్ల భూమి

ట్రెండింగ్‌

Advertisement