గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Oct 13, 2020 , 01:29:45

దుబ్బాక‌లో కూడా అదే సీన్!

దుబ్బాక‌లో కూడా అదే సీన్!

  • నిజామాబాద్‌ తరహాలోనే  ప్రతిపక్షాలకు డిపాజిట్లు దక్కవు
  • కాంగ్రెస్‌ను సొంత పార్టీ ప్రజా ప్రతినిధులే విశ్వసించడంలేదు
  • మంత్రి హరీశ్‌రావు విమర్శలు
  • టీఆర్‌ఎస్‌లో చేరిన మద్దుల,  దుబ్బాక కాంగ్రెస్‌ కార్యకర్తలు

సొంత నియోజకవర్గం హుజూర్‌నగర్‌లో ఓడిపోయిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దుబ్బాకలో  గెలుస్తామని బీరాలు పలుకుతున్నారు.  దుబ్బాక మీద కేసీఆర్‌కు ఉన్న ప్రేమ ఉత్తమ్‌కు ఉంటుందా? కాంగ్రెస్‌ పార్టీ దుబ్బాకలో ఖాళీ అయ్యింది. - ఆర్థిక మంత్రి  హరీశ్‌రావు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలోనే దుబ్బాక ఉప ఎన్నికలో కూడా ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్లు దక్కవని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్‌ రావు చెప్పారు. దుబ్బాకలో ఏం చేశారని ఓట్లు అడుగుతారని ప్రతిపక్ష పార్టీలను ఆయన నిలదీశారు. దుబ్బాక నియోజకవర్గం నుంచి 2018లో కాంగ్రెస్‌ తరఫున పోటీచేసిన మద్దుల నాగేశ్వరరెడ్డి సోమవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనకు హరీశ్‌ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికలో కవిత ఘన విజయం సాధించారని, ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్‌ కూడా దక్కలేదని, అదే తరహాలో దుబ్బాకలోనూ టీఆర్‌ఎస్‌ను విజయం వరిస్తుందని చెప్పారు. కాంగ్రెస్‌ను ప్రజలే కాదు ఆ పార్టీ ప్రజాప్రతినిధులు కూడా విశ్వసించడంలేదని, అందుకే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని అన్నారు. ఫార్మా సిటీని అడ్డుకుంటామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారని, గతంలో కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకుంటామని చెప్పారని గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి హైకోర్టు, సుప్రీంకోర్టు, ఎన్జీటీలో కేసులు వేశారని తెలిపారు. రైతులకు 24 గంటల విద్యుత్‌ ఇస్తామంటే వద్దన్నరన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా దుబ్బాకలో ఇంటింటికి నల్లా నీటిని అందించింది సీఎం కేసీఆర్‌ అని చెప్పారు. ఈ పథకానికి కూడా రుణం ఇవ్వొద్దని హడ్కోకు లేఖ రాశారని తెలిపారు. ఇలా అన్నింటినీ కాంగ్రెస్‌ వద్దన్నదని, అందుకే ప్రజలు కాంగ్రెస్‌ను వద్దన్నారని హరీశ్‌రావు ఎద్దేవాచేశారు. కాంగ్రెస్‌ దుబ్బాకలో ఖాళీ అయిందని, కాంగ్రెస్‌ ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్‌ ఇతర ప్రాంతాల నాయకులతో సోమవారం అక్కడ సమావేశం పెట్టుకున్నారని తెలిపారు.

కాంగ్రెస్‌, బీజేపీ రైతు వ్యతిరేక పార్టీలు

 సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ పార్టీ రైతులకు 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్నదని తెలుపుతూ.. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఆరు గంటలే సరఫరా చేశారని, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతామని బీజేపీ చెప్పుతున్నదని పేర్కొన్నారు. కేంద్రం ఇక్కడి మక్కలు వద్దని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నదని, మరి ఇక్కడి మక్కలు ఏం చేసుకోవాలని ఆయన ప్రశ్నించారు. ఇలా కాంగ్రెస్‌, బీజేపీలు ప్రజా, రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నాయని విమర్శించారు. కాంగ్రెస్‌ నాయకులు మైకాసురులని, బీజేపీ వాళ్లు ఫేస్‌బుక్‌లోనే హడావుడి చేస్తారని వ్యాఖ్యానించారు. 

చేసిందే చెప్తాం.. చెప్పిందే చేస్తాం

టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు దుబ్బాక ఎన్నికల ప్రచారంలో గడప గడపకు తిరగాలని, గుండె గుండెను తట్టాలన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని మంత్రి హరీశ్‌ రావు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ పార్టీ చేసిందే చెప్తుందని, చెప్పిందే చేస్తుందన్నారు. మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షాలు బూటకపు మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నాయని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌లో చేరిన మద్దుల నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌లో చేరానని, సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో అయితేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో నారాయణ్‌ఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి, ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొన్నారు.