శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 30, 2020 , 02:59:16

స్మృతి చిహ్నంగా సినారె సదనం

స్మృతి చిహ్నంగా సినారె సదనం

  • ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌
  • బంజారాహిల్స్‌లో ఆడిటోరియానికి శంకుస్థాపన

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రముఖ కవి, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత డాక్టర్‌ సీ నారాయణరెడ్డి జన్మించిన గడ్డ నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించడాన్ని తాను గౌరవంగా భావిస్తున్నానని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. సినారె 89వ జయంతి సందర్భంగా.. తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లో నూతనంగా నిర్మించనున్న ‘సినారె సారస్వత సదనం (ఆడిటోరియం)’కు మంత్రి కేటీఆర్‌ బుధవారం శంకుస్థాపనచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణ భారతదేశం నుంచి రాజ్యసభకు ఎన్నికైన తొలి రచయిత, కవి సినారె అని తెలిపారు. 3 వేల చదరపు గజాల విస్తీర్ణంలో ఆడిటోరియాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. 


తెలంగాణ బిడ్డలే కాకుండా.. తెలుగు భాషాభిమానులు ప్రపంచంలో ఎక్కడున్నా సినారె జ్ఞాపకం.. వారి మదిలో శాశ్వతంగా ఉండేలా ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. సిరిసిల్ల జిల్లాలో సినారె పేరుపై అద్భుతమైన గ్రంథాలయం కట్టుకున్నామని చెప్పారు. సినారె కీర్తి దశదిశలా వ్యాప్తిచెందేలా, వారి జ్ఞాపకాలు గుర్తుండిపోయేలా కార్యక్రమాలు చేపడుదామని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. సాంస్కృతికశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలోని కవులు, రచయితలు, కళాకారులు, సాహితీవేత్తలను గుర్తుంచుకొని గౌరవిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే దానం నాగేందర్‌, ఎమ్మెల్సీ ప్రభాకర్‌రావు, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సంగీతనాటక అకాడమీ చైర్మన్‌ బాద్మి శివకుమార్‌, స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి, సాంస్కృతికశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, సీఎంవో ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌, టూరిజం ఎండీ మనోహర్‌, సాంస్కృతికశాఖ డైరెక్టర్‌ హరికృష్ణ, సినారె కుటుంబసభ్యులు పాల్గొన్నారు.


logo