ఆదివారం 07 జూన్ 2020
Telangana - Feb 12, 2020 , 02:22:47

పేలుతున్న పెయింట్‌ డబ్బాలు!

పేలుతున్న పెయింట్‌ డబ్బాలు!
  • సగం వాడి పడేసిన డబ్బాల్లో రసాయనిక చర్య
  • ప్రాణాలమీదకొస్తున్న అవగాహన లోపం
  • జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సగం వాడి పడేసిన రంగు డబ్బాలు పేలుతున్న ఘటనలు ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో మృతి చెందుతుండటం, పలువురు తీవ్రంగా గాయపడుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఎక్కువమంది బాధితులు చెత్త ఏరుకునేవాళ్లు, యాచకులు, కూలీ పనులు చేసుకొనే అమాయకులే  ఉంటుండటం గమనార్హం. తాజాగా ఆదివారం రామోజీ ఫిల్మ్‌సిటీలో పాత పెయింట్‌ డబ్బా తెరిచేందుకు ప్రయత్నించగా పేలుడు జరిగి ఓ కార్మికుడు గాయపడ్డ ఘటనే ఇందుకు ఉదాహరణ. గత జనవరి 9న యూసుఫ్‌గూడలో పెయింట్‌ డబ్బా పేలి మాణిక్‌రావు అనే వ్యక్తి మృతిచెందగా, ఇటీవల రాజేంద్రనగర్‌లో జరిగిన ఘటనలో సయ్యద్‌ ఖాజా అలీ మృతిచెందాడు. 


ఈ నెల 8న ముషీరాబాద్‌లో, గత నవంబర్‌ 9న హైదరాబాద్‌ శివారు బాలాపూర్‌ మండలం జిల్లెలగూడ విజయ్‌నగర్‌ కాలనీలోనూ సగం వాడేసిన పెయింట్‌ డబ్బాలను తెరిచే ప్రయత్నంలో అవి పేలి పలువురు గాయపడ్డారు. అత్యాశ, అవగాహన లోపంతోనే ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నట్టు నిపుణులు చెప్తున్నారు. జాగ్రత్తలు పాటిస్తే ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చని సూచిస్తున్నారు. ఒక్కసారిగా పెద్ద శబ్దాలతో పేలుళ్లు సంభవిస్తుండటంతో అటు పోలీసులు, ఇటు స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. పెయింట్‌ డబ్బాలు ఎందుకు పేలుతున్నాయి? పేలకుండా ఎలా నిరోధించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్నదానిపై హైదరాబాద్‌ క్లూస్‌ టీం హెచ్‌వోడీ డాక్టర్‌ వెంకన్న పలు అంశాలను ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు.


పెయింట్‌ డబ్బాలు ఎందుకు పేలుతున్నాయి?

రంగు వేయగానే వేగంగా ఆరిపోయేందుకు వీటిలో రసాయన మిశ్రమాలు, ద్రావణాలు కలుపుతుంటారు. వాస్తవానికి పెయింట్లు స్మూత్‌గా వచ్చేందుకు వీటిలో ఈథర్‌ బేస్డ్‌ ఆర్గానిక్‌ సాల్వెంట్‌ కలుపుతారు. ఇలా కలిపిన మిశ్రమం గాలిలోని ఆక్సిజన్‌తో జతకూడితే పెరాక్సైడ్స్‌గా మార్పు చెందుతాయి. ఈ పెరాక్సైడ్‌ మిశ్రమాలను ఎక్కువకాలం మూతపెట్టి ఉంచితే ఈథైల్‌ మిథైల్‌ పెరాక్సైడ్‌లుగా రూపాంతరం చెందుతాయి. లోపలి మిశ్రమం అలాంటి స్థితిలో ఉన్న డబ్బాలను తెరవడంలో ఏ చిన్న ఒత్తిడికి గురిచేసినా, వేడి తగిలినా అది బాంబు మాదిరిగా పేలుతుంది. ఈ పేలుడు తీవ్రత సెకన్‌కు 6000 మీటర్ల వేగంతో ఉంటుంది. 


ఇలా చేస్తే పేలవు

ఇండ్లలో, దుకాణాల్లో పాత పెయింట్‌ డబ్బాలు ఉన్నా, చెత్తకుండీల్లో సగం వాడేసిన పెయింట్‌ డబ్బాలు కనిపించినా అవి పేలుతాయేమోనని భయంతో విసిరేయొద్దు. గట్టిగా విసరడం, తొక్కడం, కాల్చడం ఏదిచేసినా అవి పేలే ప్రమాదం ఉంటుంది. పెయింట్‌ డబ్బాను ఒక పెద్దపాత్రలో లేదా బకెట్‌లో చల్లటి నీటిని, వీలైతే ఐస్‌ ముక్కల మధ్య దాదాపు రెండు గంటలపాటువేసి ఉంచితే వాటిలో రసాయనాలు చల్లబడి పేలుడు స్వభావాన్ని కోల్పోతాయి. తర్వాత నెమ్మదిగా డబ్బా మూతను తెరిచి అందులో మిగిలిన రంగును దూరంగా పారబోస్తే మేలు.


logo