బుధవారం 27 జనవరి 2021
Telangana - Dec 23, 2020 , 18:40:14

ములకలపల్లిలో పెద్దపులి సంచారంపై ఆందోళన

ములకలపల్లిలో పెద్దపులి సంచారంపై ఆందోళన

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని ములకలపల్లి మండలంలో పెద్ద పులి అలికిడికి ఆయా గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. బుధవారం గుట్టగూడెం-మామిళ్లగూడెం మధ్య ఉన్న పంట చేనులో మంగళవారం ఓ మహిళ పులి సంచారాన్ని గుర్తించిన వార్త మరువకముందే బుధవారం ఇదే మండల పరిధిలోని కమలాపురంలో పులి అలికిడిని గుర్తించారు. పాల్వంచ నుంచి కమలాపురం వైపు కారులో వస్తున్న ప్రయాణికులు పులిని గుర్తించినట్లు తెలుస్తున్నది. 

మరో వస్త్ర వ్యాపారి ఇదే మార్గంలో పులిని చూశాడని, అక్కడి నుంచి భయంతో గ్రామంలోకి పరుగులు తీశాడని తెలిసింది. ఈ పరిణామాల నేపథ్యంలో కమలాపురం, మామిళ్లగూడెం, గుట్టగూడెం, మూకమామిడి, ఎర్రప్పగుంపు, ముత్యాలంపాడు గ్రామాల్లో సర్పంచ్‌లు టముకు వేయిస్తున్నారు. పులి సంచారంపై వార్తలు వస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. మరోవైపు పులి సంచారంపై అటవీశాఖ అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. పాదముద్రలను పరిశీలిస్తున్నామన్నారు.logo