శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 12, 2020 , 19:58:00

కంప్యూటర్‌ ఎక్కువ సేపు పనిచేస్తున్నారా?... జాగ్రత్త

కంప్యూటర్‌ ఎక్కువ సేపు పనిచేస్తున్నారా?... జాగ్రత్త

కంప్యూటర్‌లో ఎక్కువ సేపు పనిచేస్తున్నారా? అదే పనిగా స్క్రీన్‌ చూస్తూ ఉంటే కంటి ఆరోగ్యం పాడవుతుందంటున్నారు నిపుణులు. దీన్ని కంప్యూటర్‌ సిండ్రోమ్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.  ఏ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు మాత్రమే కాదు..కంప్యూటర్‌, లాప్‌టాప్‌ వంటి స్క్రీన్‌ల మీద పనిచేయనివాళ్లు ఉండరు. ఏదో కొద్దిసేపు అని కాదు.. గంటలు గంటలు కంప్యూటర్‌తో కుస్తీ పట్టేవాళ్లు ఇకపై జాగ్రత్తగా ఉండాలంటున్నారు వైద్యులు. కంప్యూటర్‌ నుంచి వచ్చే రేడియేషన్‌ వల్ల దృష్టిలోపాలు ఏర్పడే అవకాశం ఉంది. అంతకన్నా ముందు కళ్లు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతాయి. ఆసక్తికరమైన అంశం ఏదైనా కనిపిస్తేనో, సీరియస్‌గా పనిచేస్తుంటేనో తదేకంగా చూస్తూ రెప్ప వేయడం కూడా మరిచిపోతాం. కాని కనురెప్పలు క్షణక్షణానికీ మూసుకుని తెరుస్తూ ఉంటేనే కళ్లు లూబ్రికెంట్‌ అయివుంటాయి. లేకపోతే సమస్యే. రెప్ప కొట్టకుండా చూడడం వల్ల కళ్లు తడి ఆరిపోతాయి. కళ్ల చుట్టూ ఉండే కండరాలు బిగుసుకుపోతాయి. ఇది నిద్రలేమికి కూడా కారణమవుతుంది. 


ఎలా నివారించాలి?

కంప్యూటర్‌ స్క్రీన్‌కి అతి దగ్గరగా ముఖం పెట్టి చూడొద్దు. ముఖ్యంగా లాప్‌టాప్‌, మొబైల్స్‌ వాడేవాళ్లు ఇలా కళ్లకి దగ్గరగా పెట్టుకుంటుంటారు. దీనివల్ల రేడియేషన్‌ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇలా చేయొద్దు. ఉద్యోగ రీత్యా గానీ, చదువు కోసం గానీ ఎక్కువ సేపు కంప్యూటర్‌ వాడాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు మధ్యలో కళ్లకు రెస్ట్‌ ఇవ్వడం మంచిది. ప్రతి అరగంటకు ఒకసారి కళ్లు మూసుకుని రెండు అరచేతులను కళ్ల మీద పెట్టుకోవాలి. అలా 30 నుంచి 60 క్షణాల వరకు ఉండాలి. ప్రతి గంటకు ఒకసారి దూరంగా కనిపించే వాటిని కొద్దిసేపు చూడాలి. ఇలా చేయడం వల్ల కళ్లకు విశ్రాంతి లభిస్తుంది. కళ్లు రిలాక్స్‌ అయ్యి కంటి సమస్యలు రాకుండా చాలావరకు తప్పించుకోవచ్చు. logo