శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 25, 2020 , 01:52:38

లోకల్‌ క్యాడర్‌ వర్గీకరణ పూర్తిచేయండి

లోకల్‌ క్యాడర్‌ వర్గీకరణ పూర్తిచేయండి

  • వెంటనే డ్రాఫ్ట్‌ జీవోలు పంపించాలి
  • శాఖాధిపతులకు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆదేశం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వశాఖల్లోఉన్న పోస్టులను స్థానిక క్యాడర్‌గా వర్గీకరించే ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు స్థానిక నిరుద్యోగులకే దక్కేలా రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణ చేయాలని ప్రతిపాదిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసి పంపింది. ఆ తీర్మానానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో.. సవరించిన ఉత్తర్వులు 2018లో అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వశాఖలు, సంస్థలు తమ పరిధిలోని పోస్టులను లోకల్‌ క్యాడర్‌గా వర్గీకరిస్తూ జీవోలు విడుదల చేయాలి. మొత్తం 109 శాఖాధిపతుల కార్యాలయాలు ఉండగా ఇప్పటివరకు 57 శాఖాధిపతుల కార్యాలయాలు ప్రతిపాదనలను పంపించాయి. 

మిగిలిన శాఖల్లో జరుగుతున్న జాప్యాన్ని నివారించి వెంటనే అమలు చేయించేలా శుక్రవారం బీఆర్కేభవన్‌లో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ సమీక్ష నిర్వహించారు. ఆలస్యానికి గల కారణాలపై ఆరా తీసిన ఆయన.. ఎన్ని పనులున్నా వెంటనే ప్రతిపాదనలను డ్రాఫ్ట్‌ జీవో రూపంలో పంపించాలని ఆయాశాఖల అధికారులను ఆదేశించారు. సమావేశంలో కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణికుముదిని, సాగునీటిశాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌, జీఏడీ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్‌, ఆర్థికశాఖ సీనియర్‌ కన్సల్టెంట్‌ శివశంకర్‌, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా, ఆర్థికశాఖ కార్యదర్శి రోనాల్డ్‌ రోస్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo