సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 04, 2020 , 16:53:12

ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తి చేయండి

ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తి చేయండి

హైదరాబాద్ : పౌరుల కనీస అవసరాలపై ప్రధాన దృష్టి సారించాలని మంత్రులకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ ఏసీ గార్డ్స్ లోని పురపాలక శాఖ కాంప్లెక్స్ లో వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి, ఖమ్మం వరంగల్ జిల్లాల కలెక్టర్లు, కార్పొరేషన్ల కమిషనర్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కార్పొరేషన్లలో ప్రభుత్వ పథకాలు, హౌసింగ్ పైన ప్రధాన దృష్టి సారించి ఎప్పటికప్పుడు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం, పట్టణంలోని ఇతర మౌలిక వసతుల కార్యక్రమాల పురోగతిని సమీక్షించాలని జిల్లా మంత్రులకు కేటీఆర్ సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల్లోనూ ప్రాధాన్యత క్రమంలో ముఖ్యమైన కార్యక్రమాలను వెంటనే పూర్తయ్యేలా కార్యాచరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్, కార్పొరేషన్ల కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం పురపాలక శాఖ తరఫున అవసరమైన అన్నిరకాల సహాయ సహకారాలను అందిస్తామని తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్ల కమిషనర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని నియోజకవర్గాల వారీగా చేపట్టిన వివిధ కార్యక్రమాలను సమీక్షించారు.

మౌలిక వసతుల నిర్మాణ కార్యక్రమాల్లో కాంట్రాక్టర్ల అలసత్వం ఉంటే వాటిని ఇతర కాంట్రాక్టర్లకు అప్పజెప్పాలని నిర్ణయించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి నిధుల కొరత లేకున్నా ఆలస్యం జరగడం పట్ల వర్కింగ్ ఏజెన్సీల తీరు పైన అసంతృప్తి వ్యక్తం చేశారు. వరంగల్ ,ఖమ్మం పట్టణాల్లో రోడ్ల నిర్వహణ తో పాటు, ఫుట్ పాత్ ల నిర్మాణం, గ్రీనరీ ఏర్పాటు, జంక్షన్ల అభివృద్ధి, టాయిలెట్ల నిర్మాణం వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి కేటీఆర్ సూచించారు. పట్టణాల్లో ప్రస్తుతం ఉన్న తాగునీటి సౌకర్యం, చేపడుతున్న తాగునీటి సంబంధిత మౌలిక వసతుల కార్యక్రమాలపై ఆయన సమీక్షించారు. ఈనెల మూడో వారంలో వరంగల్, ఖమ్మం పట్టణాల్లో స్వయంగా పర్యటించనున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.


logo