ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Oct 31, 2020 , 18:47:23

'ఎన్నిక‌ల నియ‌మావ‌ళి ఉల్లంఘిస్తే సీ- విజిల్ ద్వారా ఫిర్యాదు చేయండి'

'ఎన్నిక‌ల నియ‌మావ‌ళి ఉల్లంఘిస్తే సీ- విజిల్ ద్వారా ఫిర్యాదు చేయండి'

సిద్ధిపేట : ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థులు గానీ, వారికి సంబంధించిన వారుగానీ ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్లంఘిస్తే పౌరులు సీ-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చ‌ని సిద్దిపేట జిల్లా కలెక్ట‌ర్ భార‌తి హోళ్లికేరి అన్నారు. సిద్ధిపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం జిల్లా పోలీసు కమిషనర్ జోయల్ డేవీస్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు.. హక్కు మాత్రమే కాదు అని అది మ‌న‌ బాధ్యత కూడా అని, ఆ ఓటు హక్కుకు సార్థకత వచ్చేలా బాధ్యతను విస్మరించకూడదన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో 18 సంవత్సరాలు నిండి ఓటరు జాబితాలో పేరున్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాల‌ని పిలుపునిచ్చారు. 

భారత ఎన్నికల సంఘం ప్రవేశ పెట్టిన సీ-విజిల్ (C-Vigil) యాప్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు కానీ, అభ్యర్థులకు సంబంధించిన వ్యక్తులు కానీ ఓటు వెయ్యమని ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన, డబ్బులు ఆశ చూపి ప్రలోభ పెట్టినా, మద్యం, డబ్బులు ఓట‌ర్ల‌కు పంపిణీ చేసిన, ఎలాంటి నేరపూరిత చర్యలకు దిగిన, ఎన్నికల సంఘం నియమావళికి విరుద్ధంగా వ్యవహరించినా, అల్లర్లు, గొడవలకు పాల్పడిన వెంటనే గ్రామాల ప్రజలు, యువకులు స్పందించి ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించారు. ఈ యాప్ మొబైల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని ఫిర్యాదుదారులు సంబంధిత వీడియోలు, ఫోటోలు, తీసి యాప్‌లో అప్లోడ్ చేసినచో ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకుంటారన్నారు. కావున ఎటువంటి భ‌యాందోన‌లు లేకుండా గ్రామాలలోని ప్రజలు, యువకులు ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.