గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 21, 2020 , 02:45:44

ఇంటికి రారా.. రాజన్న

ఇంటికి రారా.. రాజన్న

  • మావోయిస్టు నేత రాజిరెడ్డి తల్లి వీరమ్మ వేడుకోలు

కాల్వశ్రీరాంపూర్‌: ‘ఊరికి దూరమై కాటికి దగ్గరైతున్న. కొడుకా రాజన్నా ఇంటికి రారా.. ముసలి దాన్నైన బిడ్డా. చేతగాని పరిస్థితిల ఉన్న. నీరందిలోనే మీ నాయిన చనిపోయిండు. నీ రాకకోసం నేను ఎదురుచూస్తున్న కొడుకా. నిన్ను చూడాలని ఉంది.. నా పాణం పోయే ముందు ఇంటికి వచ్చి నన్ను ఆదుకోరా.. రెండు చేతులు జోడించి మొక్కుతున్న. ఇంటికి రారా రాజన్న’ అంటూ మావోయిస్టు నేత కంకణాల రాజిరెడ్డి అలియాస్‌ వెంకటేశ్‌ తల్లి వీరమ్మ కన్నీటి పర్యంతమైంది. సోమవారం కాల్వశ్రీరాంపూర్‌ మండలం కిష్టంపేట గ్రామంలో కంకణాల రాజిరెడ్డి తల్లి వీరమ్మను పెద్దపల్లి డీసీపీ రవీందర్‌ కలిసి ఆమె ఆరోగ్యం, యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పండ్లు అందజేసి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. మావోయిస్టులు కాలంచెల్లిన సిద్ధాంతాలు వదిలి, జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. కంకణాల రాజిరెడ్డి అలియాస్‌ వెంకటేశ్‌ 1995లో అప్పటి పీపుల్స్‌వార్‌లో చేరాడని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నట్టు సమాచారం ఉన్నదన్నారు. లొంగిపోతే ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.


logo