ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Aug 14, 2020 , 01:06:57

కలర్‌ ఫుల్‌ చీటింగ్‌

కలర్‌ ఫుల్‌ చీటింగ్‌

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మూడు రంగులు ముందు పెట్టి ఆరు రాళ్లు వెనుకేసుకుంటున్న చైనా కంపెనీ గుట్టును సిటీ సైబర్‌ క్రైమ్‌పోలీసులు రట్టుచేశారు. పిల్లలు, యువత, మహిళలే లక్ష్యంగా ఈజీగా డబ్బు సంపాదించవచ్చంటూ టెలిగ్రామ్‌ యాప్‌ ద్వారా సభ్యులను చేర్చుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు. సభ్యులంతా పిరమిడ్‌ ఆకారంలో ఆన్‌లైన్లో చేరుతున్నారు. చైనా సంస్థలు, ఇండియాకు చెందిన కొంతమందితో కలిసి ఈ మోసానికి పాల్పడుతున్నాయి. ఈ సొమ్మంతా చైనాకు తరలిపోతున్నదని విచారణలో వెల్లడయ్యింది. సుమారు రూ.1,100 కోట్ల వరకు నిర్వాహకులు వసూలుచేసినట్టు దర్యాప్తులో తేలింది. బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ. 30 కోట్లును సీజ్‌చేసిన సైబర్‌క్రైమ్‌ పోలీసులు, ఒక చైనీయుడితోపాటు ముగ్గురు భారతీయులను అరెస్ట్‌చేశారు. వివరాలను హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ గురువారం వెల్లడించారు. ఈ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ద్వారా హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకుల్లో ఒకరు రూ. 97 వేలు, మరొకరు రూ.1.64 లక్షలు పోగొట్టుకున్నారు. ఈ ఫిర్యాదులపై చీటింగ్‌, ఐటీయాక్టు, తెలంగాణ గేమింగ్‌ యాక్టు ప్రకారం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డబ్బు ఏ ఖాతాలోకి పోయిందని దర్యాప్తు చేయగా చైనా లింక్‌లు బయటపడ్డాయి. టెలిగ్రామ్‌ యాప్‌లో గ్రూప్‌లు తయారై అందులో ఒకరికొకరు రిఫరెన్స్‌ చేసుకుంటూ ఇందులో చేరుతున్నారు. ఈ గేమ్‌లోచేరే సభ్యులు మరొకరికి రిఫరెన్స్‌ చేయాలి. సభ్యులుగా చేరిన వారు మూడు రంగులపై బెట్టింగ్‌ చేస్తుంటారు. మొదట్లో ఆడినప్పుడు సభ్యులకు బెట్టింగ్‌లో మంచి లాభాలే వస్తాయి. ఆకర్షితులై పెద్ద మొత్తంలో డబ్బు పెట్టడంతోపాటు ఇతరులను సభ్యులుగా చేర్చుతారు. కొత్తగా సభ్యుడిని చేర్చిన వారికి కమీషన్‌ వస్తుంది. ఇది గొలుసుకట్టు విధానంలా సాగుతుంది. ఈ-కామర్స్‌ కంపెనీలు తీసుకునే పేమెంట్‌ గేట్‌వేలతోడబ్బును రెండు మూడు బ్యాంకుల నుంచి గుర్‌గావ్‌లోని హెచ్‌ఎస్‌బీసీ ద్వారా చైనాకు ఈ ముఠాలు తరలిస్తున్నట్టు విచారణలో తేలిందని సీపీ అంజనీకుమార్‌ వెల్లడించారు. కేసు దర్యాప్తు జరిపి భారీ స్కామ్‌ను వెలుగులోకి తెచ్చిన సైబర్‌క్రైమ్స్‌ బృందంలోని ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌రావు, ఎస్సై మదన్‌లను సీపీ అభినందించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్‌ శిఖా గోయెల్‌, సీసీఎస్‌ జాయింట్‌ సీపీ అవినాష్‌ మహంతి, సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌, ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌రావు, ఎస్సై మదన్‌మోహన్‌గౌడ్‌ తదితరులున్నారు.logo