గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Sep 30, 2020 , 02:35:15

పాలిటెక్నిక్‌లో కొత్త కోర్సులు

పాలిటెక్నిక్‌లో కొత్త కోర్సులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పాలిటెక్నిక్‌లో కొత్త కోర్సులైన 3డీ యానిమేషన్‌ అండ్‌ గ్రాఫిక్స్‌, యానిమేషన్‌ అండ్‌ మల్టీమీడియా, ఫ్యాషన్‌ టెక్నాలజీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు రాష్ట్ర విద్యాశాఖ అంగీకరించింది.సాంకేతిక విద్యాశాఖ గుర్తింపు పొందిన కోర్సులను నిర్వహించే తమ కళాశాలలను బుధవారం నుంచి జరుగబోయే పాలిటెక్నిక్‌ కౌన్సెలింగ్‌కు అనుమతించలేదని, తమకు ఎన్వోసీ జారీచేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పలు కళాశాలలు హైకోర్టులో పిటిషన్లు దాఖలుచేశాయి. వీటిపై చీఫ్‌జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఈనెల 30 నుంచి రెండో దశ కౌన్సెలింగ్‌ ప్రారంభమవుతుందని, ఈ కౌన్సెలింగ్‌కు తమను అనుమతించకపోతే ఆయా కోర్సుల్లో విద్యార్థులను చేర్చుకోలేమని పిటిషనర్లు పేర్కొన్నారు. ఉన్నతవిద్యాశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది వాణీరెడ్డి వాదనలు వినిపిస్తూ.. కొత్త కోర్సులను నిర్వహిస్తున్న కాలేజీలలో కౌన్సెలింగ్‌కు ఎన్వోసీ ఇవ్వడానికి అభ్యంతరం లేదని, వారు కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు వెంటనే జీవో జారీచేస్తామని హైకోర్టుకు హామీ ఇచ్చారు. వాదనలు నమోదు చేసుకొన్న ధర్మాసనం.. పిటిషనర్‌ కాలేజీలను గుర్తింపు పొందిన కాలేజీల జాబితాలో చేర్చి కౌన్సెలింగ్‌లో పాల్గొనేలా అనుమతివ్వాలని ఆదేశిస్తూ విచారణను ముగించింది. 


logo