సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 22, 2020 , 10:44:04

మామిడి మార్కెట్‌లో కోడ్‌ ట్రేడింగ్‌ విధానం

మామిడి మార్కెట్‌లో కోడ్‌ ట్రేడింగ్‌ విధానం

వరంగల్‌ : మామిడి.. పండ్లల్లోనే కాదు ఆదాయంలోనూ రాజుగా తన స్థానాన్ని పదిల పర్చుకుంటున్నది. వరంగల్‌ పండ్ల మార్కెట్‌కు ఒక్క వరంగల్‌ జిల్లా నుంచే కాకుండా ధరను బట్టి ఇతర రాష్ర్టాల నుంచి సైతం రైతులు అమ్మకాల కోసం సరుకును తీసుకువస్తుంటారు. అదే స్థాయిలో వరంగల్‌ మార్కెట్‌ నుంచి ఉత్తర భారతదేశ వ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాలకు సైతం ఎగుమతులు జరుగుతుంటాయి. ఏటా ఒక్క మామిడి సీజన్‌లోనే సుమారు రూ.50 లక్షలకు పైగా ఆదాయం వస్తున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈ ఆదాయాన్ని మరింత రెట్టింపు చేసుకోవడానికి, జీరో దందాను అరికట్టడానికి అధికారులు నూతన విధానాల కోసం కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. 

ఇందులో భాగంగా  కోడ్‌ ట్రేడింగ్‌ విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు. వరంగల్‌ పండ్ల మార్కెట్‌కు వచ్చిన ప్రతి వాహనదారుడు ముందుగా మార్కెట్‌ అధికారుల వద్ద రైతు వివరాలతో పాటుగా వాహనం వివరాలు నమోదు చేసుకొని కోడ్‌ పొందాలి. అలాగే ముందస్తుగా నమోదు చేసుకున్న రైతుల సరుకును కొనుగోలు చేసిన వ్యాపార సంస్థ వివరాలు వేలం పాట అనంతరం అక్కడే నమోదు చేస్తారు. దీంతో మార్కెట్‌లో అనుమతులు కలిగిన వ్యాపారులు మాత్రమే కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు కలుగుతాయి. ప్రస్తుతం లక్ష్మీపురం పండ్ల మార్కెట్‌కు వచ్చిన వాహనానికి సంబంధించిన వివరాలను అధికారులు, సిబ్బంది నమోదు చేసుకుంటూ పన్ను వసూలు చేస్తున్నారు. అయితే సిబ్బంది గుర్తించని వాహనాలు జీరో దందాలోకి వెళ్తున్నాయి. దీన్ని నివారించడానికి అధికారులు ఈ సరికొత్త, పటిష్ట కార్యాచరణకు చర్యలు ప్రారంభించారు.   

పెరుగనున్న నిఘా 

గతంలో ప్రతి వాహనాన్ని సిబ్బంది గుర్తించి వారే వివరాలు నమోదు చేసుకోవాల్సి వచ్చేది. ఈ క్రమంలో సిబ్బంది గుర్తించని వాహనాల్లోని సరుకుకు వ్యాపారులు పన్ను చెల్లించకుండానే విక్రయాలు జరిపేవారు. నూతనంగా ఏర్పాటు చేయనున్న కోడ్‌ ట్రేడింగ్‌ విధానంలో రైతు లేదా వాహనదారులు విధిగా ముందస్తుగా సమాచారం అందించి కోడ్‌ తీసుకోవాలి. కోడ్‌ అందించిన వాహనాల్లోని సరుకుకు మాత్రమే వేలం పాట నిర్వహిస్తారు. దీంతో తప్పకుండా రికార్డుల్లో నమోదవుతాయి. సిబ్బంది సైతం మార్కెట్‌కు చుట్టుపక్కల నిలిపి అమ్మకాలు నిర్వహిస్తున్న వాహనాలను గుర్తించడం సులువు కానుంది. కొంతమంది వ్యాపారులు నగర శివారులో పాత మిల్లులను లీజుకు తీసుకొని వాహనాలను నేరుగా అక్కడికే తరలించి అక్కడి నుంచి ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేస్తున్నారు. దీంతో మార్కెట్‌ ఆదాయానికి గండి పడుతున్నది. మార్కెట్‌కు రాకుండా నేరుగా తరలిపోతున్న వాహనాలను గుర్తించడానికి అధికారులు, సిబ్బంది  నిఘా పెంచనున్నారు.

సులువైన, కచ్చితమైన రికార్డులు 

కోడ్‌ ట్రేడింగ్‌ విధానం ద్వారా అనుమతి కలిగిన వ్యాపార సంస్థ నిర్వహించిన అన్ని రకాల లావాదేవీలను గుర్తించడం, పరిశీలించడం సులభం కానుంది. అదే విధంగా ఎంచుకోబడిన వ్యాపార సంస్థ చెల్లించిన పన్ను వివరాలు, రైతు వివరాలతో సహా అన్ని అంశాల నమోదు కచ్చితంగా ఉంటుంది. ఇదే క్రమంలో వివిధ రకాల పండ్ల తోటల సాగుదారుల వివరాలు సైతం గుర్తించడం సులభతరం అవుతుంది.

మోడల్‌ మార్కెట్‌లో అధునాతనంగా.. 

ప్రభుత్వం పండ్ల రైతులకు మద్దతు ధరను అందించడానికి, సులువుగా పంటను విక్రయించుకోవడానికి వీలుగా ఆరున్నర కోట్ల రూపాయలతో వరంగల్‌ లక్ష్మీపురం పండ్ల మార్కెట్‌ను మోడల్‌ పండ్ల మార్కెట్‌గా పునర్‌నిర్మాణం చేయనున్నది. మోడల్‌ మార్కెట్‌కు తగిన విధంగా రికార్డులను సైతం అధునాతన పద్ధతిలో నిర్వహించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ విధానం ద్వారా అమ్మకందారుడు, కొనుగోలుదారుడి వివరాలు పూర్తిగా మార్కెటింగ్‌ శాఖకు చేరుతాయి. దీనికి తోడు ఏటా మారే పంటల వివరాలు, వాటి విస్తీర్ణం మార్కెటింగ్‌ శాఖకు అందుతుంది. దీని ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల వివరాలు అంచనా వేసుకోవడానికి వీలు కలుగుతుంది.logo