శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Aug 10, 2020 , 20:49:44

2 రాష్ర్టాల రైతుల కోసం స్నేహహస్తమందించాం: సీఎం కేసీఆర్‌

2 రాష్ర్టాల రైతుల కోసం స్నేహహస్తమందించాం: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: జలవనరుల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశమయ్యారు. తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల పూర్వాపరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కేంద్రం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అభిప్రాయాలపై సీఎం కేసీఆర్‌ చర్చించారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో ఏపీ తీరుపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. స‌మావేశంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ..నా అంతట నేనే ఏపీ ప్రభుత్వ పెద్దలను పిలిచి పీటేసి అన్నం పెట్టి మరీ మాట్లాడాను. రెండు రాష్ర్టాల రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించుకుందామని స్నేహ హస్తమందించాను. బేసిన్లు లేవు, భేషజాలు లేవని మన వైఖరిని చాలా స్పష్టంగా చెప్పాం. సహజ సరిహద్దు రాష్ర్టాలు కాబట్టి స్నేహ పూర్వకంగా మెదిలి..రైతులకు సాగునీరందించే లక్ష్యం సాధించాలని ప్రతిపాదించాం. సముద్రం పాలవుతున్న నీటిని పొలాలకు మళ్లిద్దామని చెప్పాం. ఎంత మంచిగా చెప్పినా ఏపీ ప్రభుత్వం కెలికి మరీ కయ్యం పెట్టుకుంటున్నది.

తెలంగాణ ప్రాజెక్టులపై అర్థంలేని వాదనలతో, నిరాధారమైన ఆరోపణలతో ఫిర్యాదు చేస్తోంది. అపెక్స్‌ కమిటీ సమావేశంలో ఏపీ ప్రభుత్వం నోరు మూయించేలా వారి అర్థరహిత వాదనలను తిప్పికొట్టేలా సమాధానం చెపుతామని సీఎం  కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ ప్రాజెక్టుల గురించి ఏపీ ప్రభుత్వం మరోసారి నోరెత్తి మాట్లాడకుండా చేస్తమన్నారు. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరికూడా తప్పిదమే. తెలంగాణ రాష్ర్టానికున్న నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. రాష్ట్రం ఏర్పడే నాటికే నీటి కేటాయింపులు జరిగి, అనుమతులు పొంది..ఖర్చు కూడా జరిగిన ప్రాజెక్టుల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేయడం సరికాదు. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు నీటిన విడుదల చేసే విషయంలో కూడా కేంద్రం అనవసరంగా అభ్యంతరం పెడుతున్నదన్నారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo