శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Aug 10, 2020 , 21:21:00

ప్రాజెక్టులపై కేంద్ర వైఖరిని యావత్‌ దేశానికి తెలిసేలా చేస్తాం: సీఎం కేసీఆర్‌

ప్రాజెక్టులపై కేంద్ర వైఖరిని యావత్‌ దేశానికి తెలిసేలా చేస్తాం: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: రాష్ర్టాల హక్కులను హరించేలా కేంద్రం వ్యవహరించడం తగదని సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రాజెక్టుల విషయంలో కేంద్ర వైఖరిని కూడా యావత్‌ దేశానికి తెలిసేలా చేస్తామన్నారు. జలవనరుల శాఖ అధికారులతో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. సమావేశంలో సీఎం మాట్లాడుతూ..శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసే విషయంలో కూడా కేంద్రం అనవసరంగా అభ్యంతరం పెడుతున్నది. గోదావరి, కృష్ణా బేసిన్లలో రాష్ర్టానికి ఉన్న హక్కుల ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికే ఇప్పుడు నిర్మిస్తున్న ప్రాజెక్టులు మంజూరై, నీటి కేటాయింపులు జరిగాయి. సీడబ్ల్యూసీ సహా ఇతర సంస్థల నుంచి అనుమతులు వచ్చాయి. దాదాపు రూ.23 వేల కోట్ల వరకు నిధుల ఖర్చు జరిగింది. 31,500 ఎకరాల భూసేకరణ జరిగింది. ఇంత జరిగిన తర్వాత ఇపుడు కొత్త ప్రాజెక్టులు అనడం అర్థరహితం, అవివేకం. సమైక్య రాష్ట్రంలో మంజూరయినప్పటికీ వాటిని పూర్తి చేయలేదు. చాలా ప్రాజెక్టుల డిజైన్‌ తెలంగాణ రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా చేయలేదన్నారు. 

రాష్ట్రం వచ్చిన తర్వాత హక్కులు, అవసరాలు, నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టుల రీడిజైన్‌ చేయడం జరిగిందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రంలో నీటి కేటాయింపులు జరిపి ప్రతిపాదించిన ప్రాజెక్టులు కట్టడం లేదనే అసంతృప్తితోనే, వివక్షకు వ్యతిరేకంగానే తెలంగాణ ఉద్యమం వచ్చింది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్‌ చేసి కాళేశ్వరం, కంతనపల్లి ప్రాజెక్టును రీడిజైన్‌ చేసి సమ్మక్క సాగర్‌, రాజీవ్‌సాగర్‌-ఇందిరా సాగర్‌ లను రీడిజైన్‌ చేసి సీతారామ ప్రాజెకు,్ట దుమ్ముగూడెం ప్రాజెక్టును రీడిజైన్‌ చేసి సీతమ్మ సాగర్‌ నిర్మిస్తున్నం. గతంలో జరిగిన మొదటి అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రలో చేపట్టిన ముచ్చుమర్రిని ప్రస్తావించింది. దీంతో ఈ రెండింటిని కొనసాగించాలనే నిర్ణయం జరిగింది. మళ్లీ ఆ అంశాన్ని లేవనెత్తడం సరికాదు. పాలమూరు-రంగారెడ్డి విషయంలో కూడా వాస్తవాలను మరోసారి వివరిస్తాం. సాగునీటి రంగంలో తెలంగాణకు మొదటి నుంచీ అన్యాయం జరిగింది. ఏలేశ్వరం దగ్గర కట్టాల్సిన నాగార్జున సాగర్‌ ప్రాజెక్టును 17 కిలోమీటర్ల దిగువన కట్టడం వల్ల తెలంగాణకు అన్యాయం జరిగింది. సమైక్య రాష్ట్రం కారణంగా ఎగువ కృష్ణ, తుంగభద్ర, భీమా ప్రాజెక్టులు పోయాయి. నీటి వాటాల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని సాక్షాత్తూ బచావత్‌ ట్రిబ్యునల్‌ పేర్కొన్నదని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


logo