మంగళవారం 26 మే 2020
Telangana - May 13, 2020 , 01:56:47

కేటాయింపుల మేరకే వాడుకొంటాం

కేటాయింపుల మేరకే వాడుకొంటాం

  • అదనంగా చుక్క నీటిని కూడా వాడుకోం
  • నీటి వినియోగంపై ఎప్పటికప్పుడు కృష్ణా బోర్డు  పర్యవేక్షణ జలవనరులశాఖ అధికారుల సమావేశంలో ఏపీ సీఎం జగన్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కృష్ణా జలాలకు సంబంధించి తమ రాష్ర్టానికి కేటాయించిన నీటిని మాత్రమే తాము వాడుకొంటామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. కృష్ణాబోర్డు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నందున.. కేటాయింపులను దాటి ఏ రాష్ట్రం కూడా అదనంగా నీటిని వాడుకొనే అవకాశం ఉండదన్నారు. పరిధిని దాటి నీటిని తీసుకొని పోయేందుకు బోర్డు కూడా అనుమతించదని పేర్కొన్నారు. తమ హక్కుగా ఉన్న, తమకు కేటాయించిన నీటిని తీసుకొనిపోయేందుకు ఒక సదుపాయంగా మాత్రమే పోతిరెడ్డిపాడును కట్టుకొన్నామని తెలిపారు. 

రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్న నేపథ్యంలో ఏపీ సీఎం జగన్‌ మంగళవారం ఆ రాష్ట్ర జలవనరులశాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాయలసీమ సహా నెల్లూరు, ప్రకాశంలాంటి జిల్లాల్లో తాగేందుకు నీళ్లులేని దుస్థితి ఉన్నదని చెప్పారు. శ్రీశైలం జలాశయంలో 881 అడుగులు ఉన్నపుడు మాత్రమే పోతిరెడ్డిపాడు ద్వారా 44 వేల క్యూసెక్కుల నీటిని తరలించేందుకు అవకాశం ఉంటుందని.. సంవత్సరంలో సగటున పది రోజులకు మించి ఈ స్థాయిలో నీటిమట్టం ఉండదన్నారు. ఈ పది రోజుల్లోనే కరువుపీడిత రాయలసీమ సహా నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీళ్లు పోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగులుగా ఉంటే పోతిరెడ్డిపాడు ద్వారా ఏడువేల క్యూసెక్కుల నీరు కూడా వెళ్లడం కష్టమని, 841 అడుగులకు చేరితే వెయ్యి క్యూసెక్కులు మాత్రమే పోతాయని పేర్కొన్నారు. కొత్తగా కడుతున్న వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా రెండు టన్నెల్స్‌ ద్వారా గరిష్ఠంగా తొమ్మిది వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే తరలించవచ్చునన్న జగన్‌.. అది కూడా శ్రీశైలంలో 854 అడుగుల మేర నీటిమట్టం ఉంటేనే సాధ్యమవుతుందని తెలిపారు. కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్‌ (కేడబ్ల్యూడీటీ) ఎవరెన్ని నీళ్లు వాడుకోవాలనేది నిర్ణయిస్తుందని, కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఆ పంపకాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని జగన్మోహన్‌రెడ్డి అన్నారు.  

కరువు ప్రాంతాల నీటికి పరిమితులు వద్దు

కరువు పీడిత ప్రాంతాలకు నీళ్లు ఇచ్చేందుకు పరిమితులు విధించవద్దని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. తెలంగాణ నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా శ్రీశైలంలో 800 అడుగుల స్థాయిలో నీటిమట్టం ఉన్నా రోజుకు రెండు టీఎంసీల నీటిని తరలించవచ్చని, కల్వకుర్తి లిఫ్టు ద్వారా 800 అడుగుల స్థాయిలో రోజుకు 0.3 టీఎంసీల చొప్పున 40 టీఎంసీలు, ఇదేస్థాయిలో డిండి ప్రాజెక్టు ద్వారా మరో 30 టీఎంసీల నీటిని తరలించవచ్చని పేర్కొనారు. ఎస్సెల్బీసీ ద్వారా శ్రీశైలంలో 824 అడుగులు ఉన్నా రోజుకు 0.51 టీఎంసీల చొప్పున 40 టీఎంసీలు తీసుకోవచ్చన్నారు. ఇలా అన్ని ప్రాజెక్టులతో తెలంగాణ సుమారు 200 టీఎంసీల నీటిని తీసుకునే సామర్థ్యం ఉందన్నారు. జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌ నుంచి కూడా శ్రీశైలంలోకి నీళ్లు రాకముందే తెలంగాణ జలాల్ని తరలించుకోవచ్చని జగన్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.


logo