శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 01, 2020 , 02:02:55

చాలా బాగా మాట్లాడిండ్రు సార్‌

చాలా బాగా మాట్లాడిండ్రు సార్‌

  • సీఎం కేసీఆర్‌ను మెచ్చుకున్న ముల్కలపల్లి, వాసాలమర్రివాసులు
  • కొడకండ్ల తిరుగు ప్రయాణంలో గ్రామస్థులతో సీఎం మాటామంతి

తుర్కపల్లి: ‘రైతుల సంక్షేమానికి మస్తు చేస్తున్నరు సార్‌.. గతంలో ఎవరూ ప్రవేశపెట్టని పథకాలు అమలుచేస్తున్నరు.. పెట్టుబడికి రైతుబంధు ఉపయోగపడుతున్నది. సాగుకు పుష్కలంగా నీళ్లు అందుతున్నయ్‌. ఇంటింటికీ మిషన్‌ భగీరథ నీళ్లు వస్తున్నయ్‌. కొడకండ్ల సభలో మీరు మాట్లాడిన ప్రసంగం టీవీల్లో విన్నం సార్‌. చాలా బాగా మాట్లాడిండ్రు సార్‌. రైతులంతా సంతోషంగా ఉన్నరు సార్‌' అని ముల్కలపల్లి, వాసాలమర్రివాసులు అన్నారు. జనగామ జిల్లా కొడకండ్లలో రైతువేదికను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌.. శనివారం తిరుగు ప్రయాణంలో యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం ముల్కలపల్లి, వాసాలమర్రి గ్రామాల్లో కాసేపు ఆగారు. కాన్వాయి దిగి ముల్కలపల్లి సర్పంచ్‌ ఇమ్మడి మల్లప్పతోపాటు వాసాలమర్రివాసులతో ముచ్చటించారు. ‘ఏం సర్పంచ్‌గారు గ్రామంలో మిషన్‌ భగీరథ నీళ్లొస్తున్నయా?’ అని అడుగగా.. ‘ఊరంతా గోదావరి నీళ్లొస్తున్నాయ్‌ సార్‌' అని సమాధానమిచ్చారు. కొడకండ్లలో మాట్లాడిన ప్రసంగం విన్నారా..? అని ప్రశ్నించగా.. ‘విన్నాం సార్‌ చాలా బాగా మాట్లాడిండ్రు. గతంలో ఎవరూ ప్రవేశపెట్టని విధంగా రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలను చేపట్టారు సార్‌.. రైతులంతా సంతోషంగా ఉన్నారు’ అని చెప్పారు. భువనగిరికి వెళ్లేందుకు ఇబ్బంది ఉందనగా.. రూ.250 కోట్లతో భువనగిరి- గజ్వేల్‌ బీటీ రోడ్డును పునరుద్ధరిస్తామని సీఎం కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. అనంతరం యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయని కలెక్టర్‌ను ప్రశ్నించగా.. పనులు బాగా జరుగుతున్నాయని, నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయని బదులిచ్చారు.