మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Aug 31, 2020 , 19:10:38

ప్రణబ్‌ ముఖర్జీ మృతిపై సీఎం కేసీఆర్‌ దిగ్ర్భాంతి

ప్రణబ్‌ ముఖర్జీ మృతిపై సీఎం కేసీఆర్‌ దిగ్ర్భాంతి

హైదరాబాద్‌ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ అంశంతో ప్రణబ్‌కు ఎంతో అనుబంధం ఉందని సీఎం కేసీఆర్‌ గుర్తు చేసుకున్నారు. యూపీఏ తెలంగాణ ఏర్పాటుకు వేసిన కమిటీకి నాయకత్వం వహించిన ప్రణబ్‌.. చివరకు రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లుపై సంతకం చేశారని ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌లో న్యాయం ఉందని భావించే వారని, తాను కలిసిన ప్రతిసారి ఎన్నో విలువైన సూచనలు చేసేవారని గుర్తు చేసుకున్నారు. ఒక నాయకుడికి ఉద్యమాన్ని ప్రారంభించి, విజయతీరాలకు చేర్చే అవకాశం దక్కడం అరుదుగా సంభవిస్తుందని, ఆ ఘనత తనకు దక్కిందని తనను ప్రత్యేకంగా అభినందించారని కేసీఆర్‌ చెప్పారు. ప్రణబ్‌ రాసిన ద కొలీషన్‌ ఇయర్స్‌ పుస్తకంలో కూడా తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారని, కేసీఆర్‌కు తెలంగాణ అంశమే తప్ప పోర్ట్‌పోలియో అక్కర్లేదని పేర్కొన్నారని గుర్తు చేశారు. యాదాద్రి దేవాలయాన్ని అక్కడ జరుగుతున్న పనులను అభినందించారన్నారు. ప్రణబ్‌ మరణం తీరని లోటన్నారు. వ్యక్తిగతంగా తన తరఫున, తెలంగాణ రాష్ట్రం తరఫున కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo