శనివారం 16 జనవరి 2021
Telangana - Jan 08, 2021 , 10:44:22

11న మంత్రులు, క‌లెక్ట‌ర్ల‌తో సీఎం కేసీఆర్ కీల‌క భేటీ

11న మంత్రులు, క‌లెక్ట‌ర్ల‌తో సీఎం కేసీఆర్ కీల‌క భేటీ

హైద‌రాబాద్ : ఈ నెల 11న ఉద‌యం 11:30 గంట‌ల‌కు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో మంత్రులు, క‌లెక్ట‌ర్ల‌తో ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు. రెవెన్యూ, పంచాయ‌తీరాజ్‌, మున్సిప‌ల్, వైద్యారోగ్య, విద్యా, అట‌వీశాఖ‌‌ల‌పై స‌మీక్షించ‌నున్నారు. వీటితో పాటు ముఖ్య‌మైన అంశాల‌పై స‌మావేశంలో చ‌ర్చించ‌నున్నారు. ఈ స‌మావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకోనున్నారు. ఇటీవ‌లే రెవెన్యూకు సంబంధించిన అంశాల‌పై సీఎం స‌మీక్షించారు. ఆ సమావేశంలో రెవెన్యూకు సంబంధించి పరిష్కరించాల్సిన కొన్ని అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. 11న‌ జరిగే సమావేశంలో రెవెన్యూకు సంబంధించిన అంశాలను కూలంకషంగా చర్చిస్తారు. పెండింగ్ మ్యుటేషన్లు, సాదా బైనామాల క్రమబద్ధీకరణ, ట్రిబ్యూనళ్ల‌ ఏర్పాటు, పార్ట్ బీ లో చేర్చిన అంశాల పరిష్కారం తదితర విషయాలపై సమాశంలో చర్చిస్తారు. రెవెన్యూకు సంబంధించిన అన్ని అంశాలను సత్వరంగా పరిష్కరించేందుకు అవసరమైన కార్యాచరణను ఈ సమావేశంలో నిర్ణయిస్తారు. 

క‌రోనా వ్యాక్సిన్‌పై చ‌ర్చ‌

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై సమావేశంలో చర్చిస్తారు. కరోనా వ్యాక్సిన్ ప్రజలకు అందించే కార్యాచరణపై చర్చిస్తారు. వ్యాక్సీన్ అన్ని ప్రాంతాలకు సరఫరా చేయడం, ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సీన్‌ను పౌరులకు వేయడానికి సంబంధించిన కార్యాచరణను రూపొందిస్తారు.

ప‌ల్లె ప్ర‌గ‌తి, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిపై స‌మీక్ష‌

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలును సమీక్షిస్తారు. గ్రామాలకు, పట్టణాలకు నిధులు సకాలంలో అందుతున్నాయా? వాటి వినియోగం ఎలా ఉంది ? తదితర అంశాలపై చర్చిస్తారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన పనుల పరోగతిని సమీక్షిస్తారు. రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం అమలును సమావేశంలో సమీక్షిస్తారు. గ్రామాల్లో, పట్టణాల్లో పచ్చదనం పెంచడానికి తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చిస్తారు. 

విద్యాసంస్థ‌లు తెరిచే అంశంపై చ‌ర్చ‌

రాష్ట్రంలో విద్యా సంస్థల్లో తరగతులను ఎప్పటి నుండి తిరిగి ప్రారంభించాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఏ తరగతి నుండి క్లాసులు నిర్వహించాలి ? ఏ విధంగా నిర్వహించాలి ? ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానం ఏమిటి ? తదితర అంశాలపై కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకుంటారు.