మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Oct 31, 2020 , 02:15:16

సాగుబాటలో మరో విప్లవం

సాగుబాటలో మరో విప్లవం

  • నేడు కొడకండ్లలో రైతువేదిక ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌
  • ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి, సత్యవతి
  • వేదికలు కర్షకుల దేవాలయాలు : మంత్రి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/పాలకుర్తి, కొడకండ్ల: రైతులు సాగు సమస్యలపై చర్చిండం, అధిక దిగుబడులు, సస్యరక్షణ కోసం అవలంబించాల్సిన అధునాతన పద్ధతులపై అవగాహన పెంచుకొనేందుకు నిర్మించిన రైతు వేదికలు సిద్ధమయ్యాయి. జనగామ జిల్లా కొడకండ్లలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభించనున్నారు. దేశచరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 350 కోట్ల వ్యయంతో 2,601 రైతు వేదికలు నిర్మిస్తున్నారు. ఇందులో 2,462 గ్రామీణ ప్రాంతాల్లో, 139 పట్టణాల్లో ఉన్నాయి. ఒక్కో రైతు వేదికను 2,046 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 22 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు 1,951 రైతు వేదికల నిర్మాణం పూర్తికాగా, 650 నిర్మాణ దశలో ఉన్నాయి. పక్షం రోజుల్లో వీటన్నింటినీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇప్పటికే ఆదేశించారు. ఇందులో భూవిరాళంతో నిర్మిస్తున్న రైతు వేదికలు 139 ఉన్నాయి. రైతు వేదికలో రెండు గదులు, మరుగుదొడ్లు, విశాలమైన హాలు నిర్మిచడంతోపాటు మిషన్‌ భగీరథ ద్వారా నల్లా కనెక్షన్‌ ఇచ్చారు. ప్రతి వేదికకూ విద్యుత్తు సదుపాయం కల్పించారు.రైతులు రాజుల్లా బతుకాలన్నదే సీఎం లక్ష్యం

సీఎం పర్యటన షెడ్యూల్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి హెలిక్యాప్టర్‌లో బయలు దేరి నేరుగా జనగామ జిల్లా కొడకండ్లకు మధ్యాహ్నం 12గంటలకు చేరుకుంటారు. 12.10గంటలకు కొడకండ్ల రైతు వేదిక భవనాన్ని ప్రారంభిస్తారు. 12.20 గంటలకు పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కొడకండ్ల మండలం రామవరంలోని వైకుంఠధామం, డంపింగ్‌ యార్డు పనులను పరిశీలిస్తారు. 1.30కు తిరిగి కొడకండ్లకు చేరుకుని 10వేల మంది రైతులతో ముఖాముఖిలో మాట్లాడుతారు. 2.30 గంటలకు కొడకండ్లలో డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ కుందూరు వెంకటేశ్వర్‌రెడ్డి గృహంలో భోజనం చేసి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.

రైతులు రాజుల్లా బతుకాలన్నదే సీఎం లక్ష్యం: మంత్రి నిరంజన్‌రెడ్డి


రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నిర్మిస్తున్న రైతు వేదికలు కర్షక దేవాలయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. జనగామ జిల్లా కొడకండ్లలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను శుక్రవారం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఆరేండ్ల పాలనలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని కొనియాడారు. రైతులు రాజుల్లా బతకాలన్నాదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని పేర్కొన్నారు. రైతు వేదికలు భారతదేశానికి తలమానికంలా నిలుస్తాయని చెప్పారు. బీజేపీ నాయకులకు ఉప ఎన్నికలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని ధ్వజమెత్తారు. ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయినా కేంద్రం పట్టించుకోలేదని విమర్శించారు. కేంద్రం రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చి రైతుల నోట్లో మట్టి కొడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2601 రైతు వేదికలు నిర్మిస్తున్నామని, 58లక్షల మంది రైతులకు మేలు జరుగుతుందని, రైతు వేదికలు అన్నదాతలకు విజ్ఞాన భాండాగారాలుగా నిలుస్తాయని వివరించారు.మంత్రుల వెంట ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, జనగామ జడ్పీ అధ్యక్షుడు పాగాల సంపత్‌రెడ్డి, పంచాయతీ రాజ్‌ కమిషనర్‌ రఘునందన్‌రావు, పంచాయతీ రాజ్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సందీప్‌కుమార్‌ సుల్తానియా, కలెక్టర్‌ కే నిఖిల ఉన్నారు.