గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 09, 2020 , 01:32:07

పేదింటికి పెద్దదిక్కుగా..

పేదింటికి పెద్దదిక్కుగా..

  • బాధిత కుటుంబానికి సీఎం సతీమణి శోభ రూ.లక్ష సాయం
  • ఆదుకోవాలని ఎమ్మెల్యే రవిశంకర్‌కు సూచన 
  • మరో రూ.2లక్షలు కలిపి మొత్తం రూ.3 లక్షలు అందజేత

రామడుగు: ఇంటిపెద్ద మృతితో నిలువ నీడలేక దిక్కుతోచని స్థితిలో ఓ సంఘ భవనంలో తల దాచుకున్న కుటుంబానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సతీమణి శోభ చేయూతనందించారు. ఆ కుటుంబ దీనస్థితిని సామాజిక మాధ్యమాల్లో చూసి చలించిన ఆమె.. రూ. లక్ష నగదు పంపించడంతోపాటు ఆదుకోవాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు సూచించారు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం తిర్మలాపూర్‌కు చెందిన కముటం తిరుపతి(45) గత నెల 18న అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో అతనిపై ఆధారపడ్డ వృద్ధ తల్లిదండ్రులు, భార్యాపిల్లలు రోడ్డున పడ్డారు. ఇదివరకే ఇల్లు కూలిపోవడంతో వారంతా స్థానిక మున్నూరుకాపు సంఘ భవనంలో తల దాచుకున్నారు. 


బాధితుల దీనస్థితిని వివరిస్తూ అక్టోబర్‌ 23న ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమైంది. ఆ కథనం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కాగా.. విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్‌ సతీమణి శోభ శనివారం సాయంత్రం చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్‌కు ఫోన్‌ చేసి బాధిత కుటుంబానికి చేయూత అందించాలని సూచిస్తూనే రూ.లక్ష పంపించారు. దీంతో ఎమ్మెల్యే రవిశంకర్‌ స్థానిక టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులతో కలిసి మరో రూ.2 లక్షలు పోగుచేసి మొత్తం రూ.3 లక్షల నగదును బాధిత కుటుంబానికి ఆదివారం అందజేశారు. బాధిత కుటుంబానికి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. కాగా, తమ భూమిలోనే ఇల్లు కట్టించాలన్న తిరుపతి తండ్రి హన్మండ్లు కోరిక మేరకు కట్టిస్తామని ఎమ్మెల్యే భరోసానిచ్చారు. తిరుపతి ఇద్దరు పిల్లల చదువుకు సాయం చేస్తానని ప్రకటించారు.