శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 13:55:17

అన్ని మతాలను ఆదరిస్తున్న సీఎం కేసీఆర్‌ : మంత్రి కొప్పుల

అన్ని మతాలను ఆదరిస్తున్న సీఎం కేసీఆర్‌ : మంత్రి కొప్పుల

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాలను గౌరవిస్తారని, ప్రజలందరి బాగు కోసం కృషి చేస్తూ ప్రగతిపథంలో నడిపిస్తున్నారని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. క్రిస్మస్ పర్వదినం సమీపిస్తున్నందున ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉత్సవాల నిర్వహణ, గిఫ్ట్ ప్యాక్‌లు పంపిణీ ఏర్పాట్ల గురించి మంత్రి తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం అధికారులతో సమీక్ష జరిపారు.

ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో 1,518 కోట్ల రూపాయలు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. నగరంలో అధునాతన క్రిస్టియన్ భవనాన్ని నిర్మిస్తుండడాన్ని ప్రస్తావించారు. ఆరేండ్ల నుంచి జరుపుతున్న మాదిరిగానే ఈ ఏడాది కూడా క్రిస్టియన్లలోని 2.40మంది  నిరుపేదలకు  గిఫ్ట్ ప్యాక్‌లు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ గిఫ్ట్ ప్యాక్‌లలో చీరలతో పాటు పంజాబీ డ్రెస్సులు, దుస్తులు ఉంటాయని మంత్రి పేర్కొన్నారు.


హైదరాబాద్ మహానగరంలో వీటిని వచ్చే నెల 12నుంచి 15వ తేదీ వరకు, జిల్లాల్లో 11వ తేదీ నుంచి 15వరకు పంపిణీ జరిగేలా పకడ్బండీ ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. క్రిస్టియన్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఏటా ఇచ్చే విందు, జిల్లాల్లో ఏర్పాటు చేసే విందులు కొవిడ్ నిబంధనల కారణంగా ఈసారి  నిర్వహించడం లేదని మంత్రి వివరించారు. ఈ సందర్భంగా ఆయన పంపిణీ చేయనున్న చీరెలను పరిశీలించారు. సమావేశంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ కాంతివెస్లీ, టిస్కో జాయింట్ డైరెక్టర్ యాదగిరి అధికారులు పాల్గొన్నారు.