మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 16, 2020 , 21:53:39

అధ్యాపకుడికి ఫోన్‌ చేసి అభినందించిన సీఎం కేసీఆర్‌

అధ్యాపకుడికి ఫోన్‌ చేసి అభినందించిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బాటనీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న సదాశివయ్యకు సీఎం కేసీఆర్‌ గురువారం ఫోన్‌ చేసి, అభినందించారు. సదాశివయ్య ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటడడంతోపాటు ‘తెలంగాణ బొటానికల్‌ గార్డెన్‌’ ఏర్పాటుకు సంకల్పించారు. ఈ విషయాన్ని విద్యాశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్న సందర్భంలో అధికారులు వివరించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకులు కేవలం విద్యాబోధనకే పరిమితం కాకుండా మొక్కలు నాటడం లాంటి సామాజిక కార్యక్రమాలను చురుగ్గా నిర్వహిస్తున్నారని, అలాంటి వారిని ప్రోత్సహించాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా అధికారులు సదాశివయ్యతోపాటు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక హైస్కూల్ హెడ్ మాస్టర్  డాక్టర్ పీర్ మహ్మద్ షేక్ గురించి చెప్పారు. ఇద్దరు తమ విద్యాసంస్థల్లో పెద్ద ఎత్తున మొక్కలు పెంచుతున్నారని వివరించారు. వారిద్దరినీ ప్రోత్సహించాలని, ప్రభుత్వం పక్షాన ప్రత్యేకంగా అవార్డులు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు.

అనంతరం సదాశివయ్యతో ఫోన్లో మాట్లాడారు. హృదయపూర్వకంగా అభినందించారు. ‘సదాశివయ్య గారు మీ గురించి అధికారులు బాగా చెప్పారు. మీ కృషిని నేను టీవీల్లో స్వయంగా చూశాను. మీ అంకితభావం గొప్పది. మీకు హృదయ పూర్వక అభినందనలు. మీరు సంకల్పించినట్లుగానే జడ్చర్లలో బొటానికల్ గార్డెన్ ఏర్పాటు ప్రయత్నాన్ని కొనసాగించండి. దానికి కావాల్సిన నిధులను వెంటనే ప్రభుత్వం మంజూరు చేస్తుంది. మీలాంటి వాళ్లే సమాజానికి కావాలి. ఈ స్ఫూర్తిని కొనసాగించండి. పాలమూరు యూనివర్సిటీలో కూడా పెద్ద ఎత్తున మొక్కలు పెంచండి. మంచి ఉద్దేశ్యంతో చేస్తున్న మీ సామాజిక కార్యక్రమాలను కొనసాగించండి. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది’ అని సీఎం కేసీఆర్ సదాశివయ్యతో అన్నారు. అలాగే, ప్రతిపాదనలతో శుక్రవారం వచ్చి ప్రభుత్వ సెక్రెటరీని కలువాలని సూచించారు. తనను కూడా కలవమని సదాశివయ్యకు సీఎం చెప్పారు. అన్ని విషయాలు మాట్లాడుకుందామని, నిధులు మంజూరు చేయించుకొని వెళ్లాలన్నారు. మీరు ఇన్నాళ్లూ చేస్తున్న కృషికి రివార్డు కూడా ఇస్తామని సదాశివయ్యకు సీఎం తెలిపారు.

బొటానికల్ గార్డెన్ ఏర్పాటుకు అవసరమయ్యే నిధులను వెంటనే మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా, సాక్షాత్తు ముఖ్యమంత్రి తనకు ఫోన్ చేస్తారని అస్సలు ఊహించలేదని... ఇది కలా నిజమా అర్థం కావడం లేదని లెక్చరర్ సదాశివయ్య అన్నారు. శుక్రవారం నాడు సీఎంను కలవబోతుండటం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ముఖ్యమంత్రే స్వయంగా బొటానికల్ గార్డెన్ అభివృద్ధికి నిధులు ఇస్తున్నందున ఎవరూ ఊహించని స్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలిపారు.లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo