బుధవారం 20 జనవరి 2021
Telangana - Dec 31, 2020 , 01:47:42

ఉద్యోగులకు లబ్ధి 10,000 కోట్లు

ఉద్యోగులకు లబ్ధి 10,000 కోట్లు

  • నిధుల కొరతలోనూ వేతన పెంపు
  • రెగ్యులర్‌ సిబ్బందికే భారీ వాటా
  • తాత్కాలిక ఉద్యోగులకూ వేతన పెంపు
  • సంక్షోభంలోనూ సంక్షేమానికే పెద్దపీట
  • నిధుల సమీకరణ దిశగా ఆర్థికశాఖ 
  • వార్షిక బడ్జెట్‌లో సర్దుబాటుకు యత్నం
  • మరో 50 వేల పోస్టుల భర్తీకి కసరత్తు
  • వారినీ కలిపితే భారీగా నిధులు అవసరం

రాష్ర్టాన్ని సాధించిన పార్టీగా 2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌.. ఎవరూ ఊహించని రీతిలో ఉద్యోగులకు 43% ఫిట్‌మెంట్‌ ఇచ్చి సంచలనం సృష్టించింది. అప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతున్నదన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. అయినా సీఎం కేసీఆర్‌ తటపటాయించకుండా 43% ఫిట్‌మెంట్‌ ఇచ్చారు. ఆ తర్వాత రాష్ట్ర ఆర్థిక రథ చక్రాలను పరుగులు పెట్టించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకున్నది. 

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జీతాలు పెంచాలన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయంతో రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ రూ.10వేల కోట్ల వరకు లబ్ధి చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మొత్తం నిధులను సమకూర్చడంపై రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. వేతనాల పెంపునకు నిధుల సమీకరణపై దృష్టి సారించిన ఆర్థికశాఖ.. బడ్జెట్‌లో ఈ మొత్తాన్ని సర్దుబాటు చేసే విషయమై కసరత్తు చేస్తున్నది. ఉద్యోగులకు ఏ మేరకు ఫిట్‌మెంట్‌ శాతం పెంచితే ఎన్ని నిధులు అవసరమవుతాయన్నదానిపై లెక్కలు వేస్తున్నది. ఇప్పటికే ఓ వైపు కరోనా ప్రళయంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం కాగా, మరోవైపు కేంద్రం చట్టబద్ధంగా రాష్ర్టానికి ఇవ్వాల్సిన నిధుల్లో కోత విధిస్తున్నది. ఓవైపు నిధుల కొరత వేధిస్తున్నా ప్రజా సంక్షేమ పథకాల అమలులో ఏమాత్రం లోటు రానీయని రాష్ట్ర ప్రభుత్వం అదే ధీమాతో ఉద్యోగుల వేతనాలు పెంచాలనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నది.

రెగ్యులర్‌ ఉద్యోగులతో పాటు గ్రాంట్‌-ఇన్‌ ఎయిడ్‌, వర్క్‌చార్జ్‌డ్‌, డెయిలీవేజ్‌, ఫుల్‌టైమ్‌ కంటింజెంట్‌, పార్ట్‌టైమ్‌ కంటింజెంట్‌ ఉద్యోగులతోపాటు అంగన్‌వాడీలు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్‌, ఆశావర్కర్లు, విద్యా వాలంటీర్లు, సెర్ప్‌ ఉద్యోగులు, హోంగార్డులు, పెన్షనర్లు, గౌరవ వేతనం అందుకుంటున్న వారందరికీ ప్రయోజనం కలిగేలా వేతనాలు పెంచాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వివిధ ప్రభుత్వ విభాగాల్లో 9.37 లక్షల మంది వరకు ఉద్యోగులున్నారు. వీరందరికీ జీతభత్యాలు అందించేందుకు ఏడాదికి రూ.25వేల కోట్ల వరకు అవసరమవుతున్నాయి. 

రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ద్వారా వేతనాలు అందుకుంటున్న రెగ్యులర్‌ ఉద్యోగులు 2.90 లక్షలకుపైనే ఉండగా, పెన్షనర్లు 2.88 లక్షలు ఉన్నారు. రెగ్యులర్‌ ఉద్యోగులకు ఒక శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చినా ఏడాదికి రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు అవసరమవుతాయి. అదే 25 శాతం నుంచి 30 శాతం మధ్య పెంచితే ఏడాదికి రూ.7,500 కోట్ల వరకు అవసరమవుతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అన్నిరకాల ఉద్యోగులకు వేతనాలు పెంచనున్న నేపథ్యంలో రూ.10వేల కోట్ల వరకు అవసరమవుతాయని లెక్క కడుతున్నారు. దీనికితోడు ప్రభుత్వం మరో 50వేల పోస్టులను భర్తీ చేయడానికి సిద్ధమవుతున్నది. కొత్తగా చేరే ఈ ఉద్యోగులకు కూడా వేతనాలు చెల్లించేందుకు భారీ స్థాయిలో నిధులు అవసరమవుతాయి. ఈ మొత్తం నిధులను సర్దుబాటు చేసే విషయమై ఆర్థికశాఖ సమాలోచనలు జరుపుతున్నది. 

సీఎం నిర్ణయం సాహసోపేతం

ఉద్యమ పార్టీగా 2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌.. ఎవ్వరూ ఊహించని రీతిలో ఉద్యోగులకు 43శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చి సంచలనం సృష్టించింది. అప్పటికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతున్నదన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. అయినా సీఎం కేసీఆర్‌ తటపటాయించకుండా 43శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చారు. ఆ తర్వాత రాష్ట్ర ఆర్థిక రథ చక్రాలను పరుగులు పెట్టించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకున్నది. గతంలో ఎన్నడూ లేనివిధంగా కరోనా సృష్టించిన ప్రళయంతో కోలుకోలేని విధంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలకు ఇవ్వాల్సిన పన్నుల వాటాలో భారీ కోత విధించడం మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది. 

ఈ పరిస్థితుల్లో వేతనాలు పెంచాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం సాహసమేనని టీఎన్జీవో సెంట్రల్‌ కమిటీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్‌ అభిప్రాయపడ్డారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభం పేరిట కరువు భత్యాన్ని కుదించి ఎల్‌ఐసీ వంటి ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్న పరిస్థితుల్లో ఉద్యోగుల సంక్షేమాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం ఆయన గొప్పతనానికి నిదర్శనమని కొనియాడారు. తెలంగాణ ఉద్యమం నుంచి ఉద్యోగులతో ఆత్మీయ అనుబంధం పెంచుకున్న సీఎం కేసీఆర్‌ పట్ల ప్రజలలో అపార విశ్వాసం ఉన్నదని, ఆయన నాయకత్వంలో రాష్ట్రం  అన్ని రంగాలలో సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తున్నదని దేవీప్రసాద్‌ పేర్కొన్నారు.


logo