గురువారం 16 జూలై 2020
Telangana - Jun 24, 2020 , 02:48:27

రేపు నర్సాపూర్‌కు సీఎం కేసీఆర్‌

రేపు నర్సాపూర్‌కు సీఎం కేసీఆర్‌

  • ఆరోవిడుత హరితహారాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
  • ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీశ్‌

నర్సాపూర్‌/రూరల్‌/హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆరోవిడుత హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ గురువారం ప్రారంభించనున్నారు. స్థానిక అర్బన్‌ పార్కులో ఉదయం 11 గంటలకు సీఎం మొక్క నాటుతారని ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్‌రావు తెలిపారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, పీసీసీఎఫ్‌ శోభ, కలెక్టర్‌ ధర్మారెడ్డితో కలిసి మంగళవారం పరిశీలించారు. అర్బన్‌పార్కులో నిర్మించిన ప్రధానగేటు, బ్రిడ్జి, ఔషధ మొక్కలు, వాచ్‌టవర్‌ను పరిశీలించారు. ఆయన వెంట మాజీ మంత్రి సునీతారెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ మురళీయాదవ్‌, జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ నాగేశ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రాగౌడ్‌, జిల్లా అటవీశాఖ అధికారి పద్మజారాణి, ఆర్డీవో అరుణారెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నహీం, కౌన్సిలర్‌లు అశోక్‌గౌడ్‌ తదితరులు ఉన్నారు.

విజయవంతం చేయండి : అల్లోల 

ఆరో విడుత తెలంగాణకు హరితహారాన్ని విజయవంతం చేయాలని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సహచర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల ను కోరారు. ఈ విషయమై ప్రజాప్రతినిధులకు మంగళవారం లేఖ రాశారు. ఐదు విడుతల్లో 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 182 కోట్ల మొక్కలు నాటినట్టు వివరించారు. సీ ఎం కేసీఆర్‌ దూరదృష్టి, ప్రణాళికలకు అనుగుణంగా అందరి సహకారంతో ఐదేండ్లుగా హరితహారం రాష్ట్రంలో ఓ ఉద్యమంలా కొనసాగుతున్నదని వివరించారు. జంగల్‌ బచావో.. జంగల్‌ బడావో అని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన నినాదస్ఫూర్తితో అం దరూ హరితహారంలో మమేకం కావాలని కోరారు. కనీసం 85శాతం మొక్కలను కాపా డాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు పిలుపునిచ్చారు. 


logo