బుధవారం 27 మే 2020
Telangana - May 12, 2020 , 01:19:46

ఇప్పుడే రైళ్లు వద్దు

ఇప్పుడే రైళ్లు వద్దు

  • ప్రధాన నగరాల్లో కరోనా ప్రభావం అధికం
  • ఎవరు ఎక్కడికెళ్తారో.. ఎవరికి వైరస్‌ ఉన్నదో తెలియదు
  • రాష్ర్టాల రుణాలను రీషెడ్యూల్‌ చేయాలి
  • ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని కేంద్రం పెంచాలి
  • వలసకూలీలను రాష్ర్టాలు రానివ్వాలి
  • కేసులు లేనిచోట్ల కరోనా జోన్ల మార్పిడి చేయాలి
  • ప్రధానితో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా నిలిపివేసిన ప్రయాణికుల రైళ్లను ఇప్పుడే పునరుద్ధరించవద్దని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తిచేశారు. ప్రధాన నగరాల్లో వైరస్‌ ప్రభావం అధికంగా ఉన్నందున అది ప్రయాణికుల ద్వారా మరింత విస్తరించే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో అప్పులు చెల్లించే పరిస్థితి లేనందున రాష్ర్టాల రుణాలను రీషెడ్యూల్‌ చేయాలని సూచించారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని పెంచాలని మరోసారి కోరారు. ఏ రాష్ర్టానికి చెందిన వలసకూలీలను ఆ రాష్ట్రం అనుమతించాలన్నారు. జూలై లేదా ఆగస్టు నెలల్లో కరోనా వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం ఉందని, అది భారత్‌నుంచి ముఖ్యంగా హైదరాబాద్‌నుంచి వెలువడే అవకాశం ఉన్నదని సీఎం ఆశాభావం వ్యక్తంచేశారు.

ప్రధాని మోదీ సోమవారం అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కొన్ని ఎంపికచేసిన మార్గాల్లో ప్రయాణికుల రైళ్లను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంపై సీఎం కేసీఆర్‌ స్పందించారు. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో కరోనా విజృంభిస్తున్నదని, ఈ నేపథ్యంలో నగరాల మధ్య రైళ్ల రాకపోకలను ప్రారంభించరాదని తెలిపారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు కేంద్రం, రాష్ర్టాలు కలిసి పనిచేస్తున్నాయని, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటూ వాటిని అమలు చేస్తున్నామని సీఎం చెప్పారు. కరోనాపై తప్పక విజయం సాధిస్తామన్నారు. 


వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్‌ ప్రస్తావించిన ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

  • దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్‌తోపాటు పలు ప్రధాన నగరాల్లో కరోనా ప్రభావం అధికంగా ఉన్నది. ఈ పరిస్థితుల్లో రైళ్ల రాకపోకలను అనుమతిస్తే ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణాలు సాగిస్తారు. ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నారో తెలియదు. వారిలో వైరస్‌ ఉన్నవారు ఎంతమందో తెలియదు. వారిలో ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు. అలాగే రైలు ప్రయాణం చేసి వచ్చినవారందరినీ క్వారంటైన్‌ చేయడం కూడా కష్టం. కాబట్టి ఇప్పుడే రైళ్లను పునరుద్ధరించరాదు.
  • కరోనా ఇప్పుడప్పుడే మనల్ని వదిలిపోయేట్టు కనిపించడం లేదు. కాబట్టి మనకు కరోనాతో కలిసి బతకడం తప్పదు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ముందుగా వారిలో భయాన్ని పోగొట్టాలి. 
  • కరోనా వ్యాక్సిన్‌ తయారుచేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ వ్యాక్సిన్‌ ముందుగా భారతదేశం నుంచి మరీ ముఖ్యంగా హైదరాబాద్‌ నుంచే వచ్చే అవకాశం ఉన్నది. వ్యాక్సిన్‌ తయారీకి హైదరాబాద్‌కు చెందిన కంపెనీలు బాగా కృషిచేస్తున్నాయి. జూలై-ఆగస్టు నెలల్లో వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం ఉన్నది. వ్యాక్సిన్‌ వచ్చిన అనంతరం పరిస్థితిలో మార్పు వస్తుంది. 
  • కరోనా వ్యాప్తి నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. వైద్యపరంగా సిద్ధంగా ఉన్నాం. వైద్య పరికరాలు, మందులు, మాస్కులు, పీపీఈ కిట్లు, బెడ్లు.. కావాల్సినవన్నీ ఉన్నాయి. ఏ కొరతా లేదు. 
  • కరోనా వల్ల ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడింది. ఆదాయాలు లేవు. అప్పులు కట్టే పరిస్థితి రాష్ర్టాలకు లేదు. కాబట్టి రాష్ర్టాల అప్పులను రీషెడ్యూల్‌ చేయాలి. రైతుల రుణాలను బ్యాంకులు ఎలాగైతే రీషెడ్యూల్‌ చేస్తాయో అలాగే రాష్ర్టాల రుణాలను రీషెడ్యూల్‌ చేసే విధంగా కేంద్రం చొరవ తీసుకోవాలి.
  • ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని పెంచాలి. 
  • వలస కార్మికుల విషయంలో అన్ని రాష్ర్టాలు సానుభూతితో, మానవత్వంతో వ్యవహరించాలి. మనది సెంటిమెంటు కలిగిన దేశం. సొంతూర్లో పిల్లలను, తల్లిదండ్రులను వదిలివచ్చారు. సొంతవాళ్లను చూసుకోవాలని వారికి ఉంటుంది. అందుకే సొంతూరు పోదామనుకుంటున్నారు. వారిని పోనివ్వకపోతే ఆందోళనలు పెరిగే అవకాశం ఉన్నది. ఒకసారి పోయి వస్తే, వారు స్థిమితపడుతారు. మళ్లీ పనిలోకి వస్తారు. శ్రామిక్‌ రైళ్లు వేయడం మంచి నిర్ణయం. తెలంగాణ నుంచి పోదామనుకుంటున్న వారిని పంపుతున్నం. మళ్లీ ఆ కూలీలు వస్తున్నారు. తెలంగాణ రైసు మిల్లులలో పనిచేసేందుకు బీహార్‌ కార్మికులు ప్రత్యేక రైలు ద్వారా మళ్లీ వచ్చారు. వారిని మేము సాదరంగా స్వాగతించాం. వస్తారు, పోతారు. రానివ్వాలి, పోనివ్వాలి. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.
  • కంటైన్మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ నిబంధనలు కచ్చితంగా పాటించాలి. అలక్ష్యం చేయవద్దు. 
  • పాజిటివ్‌/యాక్టివ్‌ కేసులులేని జిల్లాలను ఆరెంజ్‌/గ్రీన్‌ జోన్లుగా మార్చమని కేంద్రాన్ని కోరుతున్నాం. అలా ప్రకటించడంలో జాప్యం జరుగుతున్నది. పాజిటివ్‌ కేసులులేని ప్రాంతాల్లో ఇతర కార్యకలాపాలు నిర్వహించుకోవడం సాధ్యమవుతుంది కాబట్టి, రాష్ర్టాల నుంచి విజ్ఞప్తి రాగానే జాప్యం లేకుండా జోన్ల మార్పు జరుగాలి.


logo