బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 16, 2020 , 02:59:37

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ 23 నుంచి

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ 23 నుంచి

  • సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు సీఎం ఆదేశాలు
  • ధరణి ప్రక్రియకు ప్రజల నుంచి ఆదరణ
  • క్షేత్రస్థాయి నుంచి అద్భుతమైన ఫీడ్‌బ్యాక్‌
  • సమీక్షలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు
  • పోర్టల్‌ను తీర్చిదిద్దిన అధికారులకు ప్రశంస

భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో చారిత్రక శకం ఆరంభమైంది. ధరణి పోర్టల్‌పై క్షేత్రస్థాయి ఫీడ్‌బ్యాక్‌ అద్భుతంగా ఉన్నది. వ్యవసాయభూములపై నిశ్చింతగా ఉండవచ్చని ప్రజలు సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. మూడునాలుగు రోజుల్లో నూటికి నూరుశాతం సమస్యలను అధిగమిస్తున్నాం. ఎక్కడి సమస్యలు అక్కడ చక్కబడినంకనే వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రారంభించాలనుకున్నాం.  

- ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఈ నెల 23 నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్‌ అంశంపై ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ధరణి పోర్టల్‌ ప్రజల ఆదరణ పొందుతున్నదని తెలిపారు. ధరణిలో సమస్యలు నాలుగురోజుల్లో పరిష్కారమవుతాయని.. తర్వాత వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ‘ధరణి ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ విశేష ఆదరణ పొందుతున్నది. భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో ఒక చారిత్రకశకం ఆరంభమైనట్టుగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు.


ధరణి ద్వారా వారి వ్యవసాయ భూములకు భరోసా కలిగిందని సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ధరణిపై క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ అద్భుతంగా ఉన్నది. మరో మూడునాలుగు రోజుల్లో ధరణి నూటికి నూరుశాతం అన్నిరకాల సమస్యలను అధిగమించనున్నది. ఎక్కడి సమస్యలు అక్కడ చక్కబడినంకనే వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రారంభించాలనుకున్నాం. అందుకే కొన్నిరోజులు వేచి చూసినం. నవంబర్‌ 23 సోమవారం సీఎస్‌ వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రారంభిస్తారు. ధరణిని అద్భుతంగా తీర్చిదిద్దిన అధికారులను అభినందిస్తున్నా’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. సమావేశంలో మంత్రులు పువ్వాడ, సబిత, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, సీఎం ముఖ్యకార్యద ర్శి నర్సింగ్‌రావు, రెవెన్యూశాఖ కార్యదర్శి శేషాద్రి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, పురపాలకశాఖ డైరెక్టర్‌ సత్యనారాయణ, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ రఘునందన్‌రావు, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.