ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 21, 2020 , 02:52:34

విస్తృతంగా పరీక్షలు

విస్తృతంగా పరీక్షలు

  • పాజిటివ్‌ రోగులకు నాణ్యమైన వైద్యం
  • కరోనా కట్టడికి కట్టుదిట్టంగా చర్యలు
  • నియంత్రిత సాగుకు మంచి స్పందన
  • రాష్ట్రంలో పుంజుకొంటున్న ఆర్థిక పరిస్థితి
  • గవర్నర్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ  పలు కీలక అంశాలపై చర్చ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ముఖ్యమం త్రి కే చంద్రశేఖర్‌రావు.. గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం కేసీఆర్‌.. గంటసేపు రాష్ర్టానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలను గవర్నర్‌కు ముఖ్యమంత్రి వివరించారు. కరోనా పరీక్షలు విస్తృతంగా నిర్వహిస్తున్నామని, పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులకు నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. లక్షణాలు కనిపించకుండా పాజిటివ్‌ ఉన్నవారికి ఇంటివద్దనే ఉంచి వైద్యం అందేలా చర్యలు తీసుకొన్నామన్నారు. వైద్యులు ఆన్‌లైన్‌ ద్వారా అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నారని వెల్లడించారు. ఇం టికే మందులు, కరోనా కిట్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. వైరస్‌ తీవ్రత ఉన్నవారిని గుర్తించి దవాఖానల్లో వైద్యమందిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పదివేల బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. కరోనా వైద్యసేవల కోసం ప్రైవేట్‌ దవాఖానలకు వెళ్లి ఆర్థికంగా నష్టపోవద్దని, ప్రభుత్వ దవాఖానల్లో వైద్యం చేయించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తిచేసినట్లు గవర్నర్‌కు సీఎం కేసీఆర్‌ తెలిపారు. ప్రైవేట్‌ దవాఖానల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకంటే ఎక్కువగా డబ్బులు వసూలుచేస్తే సదరు హాస్పిటల్స్‌పై కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించినట్టు పేర్కొన్నారు. కరోనా చికిత్సలో ఉపయోగించే మందులను బ్లాక్‌లో విక్రయిస్తున్నవారిని ఉపేక్షించడంలేదని వెల్లడించారు. ప్రతిరోజూ వైద్యారోగ్యశాఖ కొవిడ్‌-19 సమాచార బులెటిన్‌ను విడుదలచేస్తున్నదని తెలిపారు. ఐసీఎమ్మార్‌ అనుమతితో నిమ్స్‌లో ఎంపికచేసిన వలంటీర్లపై కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ టెస్ట్‌ ట్రయల్స్‌ జరుగుతున్న విషయాన్ని కూడా సీఎం కేసీఆర్‌ గవర్నర్‌కు వివరించారు.

రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగింది

ఈ ఏడాది ముందుగానే వర్షాలు కురువడంతో పంటల సాగు విస్తీర్ణం పెరిగిందని సీఎం కేసీఆర్‌.. గవర్నర్‌కు తెలిపారు. ప్రాజెక్టులకు వరద వస్తున్నదని, రిజర్వాయర్లన్నీ పూర్తిగా నిండే అవకాశం కనిపిస్తున్నదని పేర్కొన్నారు. ఇప్పటికే 70 శాతానికి పైగా విత్తనాలు వేసినట్టు వివరించారు. రైతులకు లాభం రావడంకోసం నియంత్రిత సాగుచేయాలని కోరితే అన్నదాతలంతా స్పందించి ప్రభుత్వం సూచించిన పంటలనే సాగుచేస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది పంట దిగుబడి బాగా వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. రైతుల పంటలకు మంచి మార్కెటింగ్‌ కల్పించడంకోసం, వినియోగదారులకు కల్తీ లేని నాణ్యమైన ఉత్పత్తులు అందించే విధంగా రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్క్‌ల ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాలను గవర్నర్‌కు వివరించారు. రాష్ట్రంలో సాగునీటి వ్యవస్థ ఏకీకృతంగా లేదని, గతంలో చిన్ననీటి పారుదల, భారీ నీటిపారుదల, ఎత్తిపోతల పథకాలు ఇలా విడివిడిగా ఉండేవని చెప్పారు. ఇప్పుడు మొత్తం సాగునీటి పారుదలశాఖను పునర్వ్యవస్థీకరించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు అధికారులతో సమావేశమవుతున్నట్టు పేర్కొన్నారు. 

హరిత నిబంధనల ప్రకారం సచివాలయ నిర్మాణం

రాష్ట్ర ఆర్థికపరిస్థితి లాక్‌డౌన్‌ తర్వాత క్రమంగా పుంజుకుంటున్నదని గవర్నర్‌కు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులందరికీ పూర్తి వేతనాలిచ్చామని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కూడా కొనసాగిస్తున్నామన్నారు. నూతన సచివాలయం నిర్మాణానికి న్యాయస్థానాల నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రావడంతో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా, ఐకానిక్‌గా నూతన సచివాలయం నిర్మించడానికి చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. సచివాలయం బాహ్యరూపం ఎలా ఉండాలి? లోపల సౌకర్యాలు ఎలా ఉండాలి? అనే అంశాలపై మంగళవారం అధికారులు, ఆర్కిటెక్ట్‌లతో సమావేశమవుతున్నట్లు గవర్నర్‌కు సీఎం వివరించారు. ఈ సందర్భంగా సచివాలయ పాత భవనాల కూల్చివేత పనులను గురించి కూడా చెప్పారు. పాత సచివాలయం దుస్థితిని వివరించి, గ్రీన్‌ బిల్డింగ్‌ నిబంధనల ప్రకారం నూతన సచివాలయ భవనం నిర్మించనున్నట్లు తెలిపారు. 


logo