శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Oct 29, 2020 , 09:17:50

31న జనగామలో రైతు వేదిక ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

31న జనగామలో రైతు వేదిక ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ : ఈ నెల 31న జనగామ జిల్లాలో రైతు వేదికను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు. శనివారం మధ్యాహ్నం 12.30గంటలకు సీఎం కేసీఆర్‌ రైతు వేదికను ప్రారంభిస్తారు. అలాగే వేదిక వద్ద ఉన్న పల్లె ప్రకృతి వనాన్ని సందర్శిస్తారు. అనంతరం రైతులు, ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించనున్నారు. రైతు వేదిక నిర్మాణం వెనుక ఉన్న ఉద్దేశాన్ని, ఆవశ్యకతను, వాటి ద్వారా జరిగే కార్యకలాపాలను రైతులకు వివరించనున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన రైతుబంధు జిల్లా, మండల, గ్రామ కమిటీలను కార్యక్రమానికి ఆహ్వానించారు. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్యక్రమానికి హాజరుకానున్నారు.

రైతులంతా ఒకే చోట చేరి వ్యవసాయం, సాగు చేసే పంటలపై చర్చించుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికలను నిర్మిస్తోంది. ఆన్‌లైన్‌లో సీఎం కేసీఆర్ నేరుగా రైతులతో మాట్లాడేలా.. రాష్ట్రవ్యాప్తంగా రూ.573 కోట్లతో 2,604 వేదికలను నిర్మిస్తున్నారు. సమావేశాలు, చర్చలు నిర్వహించడంతోపాటు గోడౌన్‌గా ఈ వేదికలను ఉపయోగించనున్నారు. ప్రతి ఐదు వేల ఎకరాలను ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి.. 2,604 క్లస్టర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే నిధులను కూడా కేటాయించింది. పలు చోట్ల వేదిక నిర్మాణాలు పూర్తి కావచ్చాయి. మరికొన్ని చోట్ల శరవేగంగా పనులు సాగుతున్నాయి. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.