బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Oct 29, 2020 , 03:13:55

భూ పాలనలో నవశకం

భూ పాలనలో నవశకం

  • నేడు ధరణి పోర్టల్‌ను ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్‌
  • మూడు చింతలపల్లిలో శ్రీకారం
  • అమలులోకి కోర్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థ
  • కొత్త రూపంలో భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ
  • తాసిల్‌ కార్యాలయంలో ఏర్పాట్లను 
  • పరిశీలించిన మంత్రి మల్లారెడ్డి, సీఎస్‌

హైదరాబాద్‌/మేడ్చల్‌, నమస్తే తెలంగాణ: భూ పరిపాలనలో ఒక కొత్త శకం ఆరంభమైంది. దశాబ్దాల తరబడి భూ రికార్డులలో గజిబిజి, గందరగోళం అంతమైంది. అడ్డగోలుగా భూ రికార్డులను మార్చే సంస్కృతికి అడ్డుకట్ట పడింది. రైతుల శ్రేయస్సే లక్ష్యంగా తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టం (ఆర్వోఆర్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌-2020) గురువారం నుంచి అధికారికంగా అమలుకాబోతున్నది. భూమి రికార్డులన్నింటినీ నిక్షిప్తంచేసిన ‘ధరణి’ పోర్టల్‌ను మధ్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మూడు చింతలపల్లి తాసిల్దార్‌ కార్యాలయంలో ప్రారంభించనున్నారు. యాభై రోజులుగా రాష్ట్రంలో నిలిచిపోయిన భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇకపై కొత్త తరహాలో మొదలుకాబోతున్నది.  గ్రామీణ, మండల కేంద్రాలు, రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో కొత్త చట్టం ప్రకారం ‘ధరణి’ పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ధరణిలో నిక్షిప్తమైన సమాచారం ఆధారంగా తాసిల్దార్లు రిజిస్ట్రేషన్లు చేస్తారు. రైతులు భూమి రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఆటోమెటిక్‌గా పూర్తవుతుంది. బ్యాంకుల్లో డబ్బులు దాచుకొని.. తిరిగి తీసుకొనేంత సులువుగా రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ప్రక్రియను సరళతరం చేశారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా తెలంగాణలోనే భూ పరిపాలనలో కోర్‌ బ్యాంకింగ్‌ విధానం అమలు అవుతున్నది. ఇకపై సమస్యలకోసం ఏ కార్యాలయానికి వెళ్లనవసరంలేకుండా ఆన్‌లైన్‌లో తెలిపితే పరిష్కారమయ్యేలా ధరణి రూపకల్పన జరిగింది. 

తాసిల్దార్లకు పూర్తయిన శిక్షణ

కోర్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థ ద్వారా ధరణిని నిర్వహించడానికి తాసిల్దార్లకు ఇచ్చిన శిక్షణ పూర్తయింది. ధరణికి సంబంధించిన మాడ్యూల్‌ను ఉన్నతాధికారులు అన్ని జిల్లాలకు పంపించారు. దీనిపై క్షేత్రస్థాయిలో పరీక్షించి చూశారు. ట్రయల్స్‌కు ముందుగా జిల్లా కలెక్టర్లనుంచి, తాసిల్దార్లు, నయాబ్‌ తాసిల్దార్లు, కంప్యూటర్‌ ఆపరేటర్‌ వరకు అన్ని స్థాయిల అధికారులుచ సిబ్బందితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మార్గదర్శనం చేశారు. ట్రయల్స్‌లో 20 నుంచి 40 వరకు రిజిస్ట్రేషన్లు చేశారు. చివరగా ఈ నెల 27న వీరందరికీ ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. అంతా ఓకే కావడంతో గురువారం పోర్టల్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తున్నారు. తర్వాత మూడుచింతలపల్లి నుంచి లింగాపూర్‌తండా వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం మూడుచింతలపల్లి గ్రామ శివారులోని ఫంక్షన్‌హాల్‌లో రైతులు, జర్నలిస్టులు, ప్రజా ప్రతినిధులతో కలిసి సహపంక్తి భోజనాలు చేసిన తరువాత తిరిగి హైదరాబాద్‌కు వెళ్లనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 

ఏర్పాట్లు పూర్తి

ధరణి పోర్టల్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ధరణి పోర్టల్‌ను ప్రారంభించేందుకు  మూడుచింతలపల్లి తాసిల్దార్‌ కార్యాలయం ఎదుట ఓ వేదికను ఏర్పాటుచేయడంతోపాటు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రజలు వీక్షించేలా భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లను, మూడెకరాల విస్తీర్ణంలో సభా వేదికను ఏర్పాటుచేశారు. ఆరువందల మంది ఏకకాలంలో భోజనం చేసేలా ముఖ్యమంత్రి ప్రత్యేక అభివృద్ధి నిధులతో నిర్మించిన ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ నవీన్‌చంద్‌ మూడుచింతలపల్లిలో పర్యటించి పోలీసు అధికారులతో సమీక్షించారు. శామీర్‌పేట నుంచి రాజీవ్‌ రహదారి నుంచి మూడుచింతలపల్లి వరకు భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటుచేశారు.

పరిశీలించిన ప్రముఖులు..

ధరణి పోర్టల్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి చామకూర మల్లారెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ శరత్‌ చంద్రారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, టీఆర్‌ఎస్‌ జనరల్‌ సెక్రటరీ మలిపెద్ది సుధీర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు మర్రి రాజశేఖర్‌రెడ్డి పరిశీలించారు. అంతకుముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఆర్‌అండ్‌బీ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సందీప్‌ కుమార్‌ సుల్తానియా ధరణి పోర్టల్‌ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు తదితరులు మూడుచింతలపల్లిలోనే మకాం వేసి సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లుచేస్తున్నారు.