మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 18, 2020 , 01:59:16

దసరా రోజు ధరణి ప్రారంభం

దసరా రోజు ధరణి ప్రారంభం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: భూ లావాదేవీలకు ఆయువుపట్టుగా మారనున్న ధరణి పోర్టల్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 25న ప్రారంభిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు. శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, తాసిల్దార్లు, నాయబ్‌ తాసిల్దార్లతో సీఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ధరణి పోర్టల్‌ పనితీరును వివరించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ విజన్‌ మేరకు ధరణి రూపుదిద్దుకున్నదని చెప్పారు. ఇది వినూత్నమైన ప్రక్రియ అని, దేశంలోనే ట్రెండ్‌ సెట్టర్‌గా నిలుస్తుందని చెప్పారు. పోర్టల్‌ ప్రారంభమైన తర్వాత 570 మండలాల్లో తాసిల్దార్లు జాయింట్‌ సబ్‌రిజిస్ట్రార్లుగా పనిచేస్తారని, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ బాధ్యతలు చూసుకుంటారని, 142 ప్రాంతాల్లో సబ్‌రిజిస్ట్రార్లు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ చేస్తారని చెప్పారు. దసరానాటికి పోర్టల్‌ నిర్వహణకు వందశాతం సిద్ధంగా ఉండాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ స్పష్టంచేశారు. సమీక్షలో స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ ఐజీ శేషాద్రి, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ఎస్సీ సంక్షేమ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్‌చోంగ్తు, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్‌ నీతూప్రసాద్‌, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్‌ రాస్‌, పీఆర్‌ అండ్‌ ఆర్డీ కమిషనర్‌ రఘునందన్‌రావు, ఎక్సైజ్‌శాఖ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, టీఎస్‌టీఎస్‌ ఎండీ వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

సొంతంగా వ్యవసాయేతర ఆస్తుల నమోదు

వ్యవసాయేతర ఆస్తులను సొంతంగా  ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు యజమానులకు అవకాశం కల్పిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్తుల నమోదుకు  www.npb.telangana.gov.inను సందర్శించాలని సీఎస్‌ సూచించారు. మీసేవలో నమోదు చేసుకోవాలనుకునే వారు ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరంలేదన్నారు.


logo