గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Sep 08, 2020 , 02:46:06

దేశానికే ఆదర్శంగా..కొత్త రెవెన్యూ చట్టం

దేశానికే ఆదర్శంగా..కొత్త రెవెన్యూ చట్టం

  • ఒక్క రోజులోనే అన్ని పనులు పూర్తి
  • టీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీలో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశంలో ఏ ప్రభుత్వమూ చేయని సాహసాన్ని తెలంగాణ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని తేవడం ద్వారా చేస్తున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కే చంద్రశేఖరరావు అన్నారు. సోమవారం తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారితనంతో ఒకేరోజులో రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌, పాస్‌బుక్కు వచ్చేవిధంగా కొత్త చట్టాన్ని తీసుకొస్తామని తెలిపారు. ఈ తరహా చట్టం గురించి దేశంలోని ఏ రాష్ట్రం కూడా చేయలేదని, ఆలోచించలేదన్నారు. దేశచరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకవస్తున్నామని వెల్లడించారు. అవినీతి తావులేకుండా, పారదర్శకంగా, వివాదాలకు ఆస్కారంలేకుండా ఈ చట్టం ఉంటుందని చెప్పారు. కొత్త చట్టం వల్ల ఒక్క రోజులోనే రికార్డుల మార్పిడి జరిగిపోతుందని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎమ్మార్వోలు, వీఆర్వోల అవినీతి అంతులేకుండా పోయిందని, అందువల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులపాలవుతున్నారని సీఎం కేసీఆర్‌ తెలిపారు. రెవెన్యూ రికార్డుల గొడవలు, కేసులతో మర్డర్లు కూడా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఒకరి భూమిని మరొకరు కబ్జా చేస్తున్నారని చెప్పారు. ఇలాంటివి జరగకుండా పకడ్బందీగా కొత్త చట్టాన్ని తెస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో అత్యధికులు ప్రజలు రెవెన్యూశాఖ బాధితులుగా ఉన్నారని, కొత్తచట్టం ద్వారా ప్రజల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని పేర్కొన్నారు. కొత్త చట్టాన్ని ప్రజల్లో విస్తృతంగా తీసుకొని పోవాలని ప్రజాప్రతినిధులకు ఆదేశించారు. ఈనెల 9న అసెంబ్లీలో చట్టాన్ని ప్రవేశపెడుతామని, ఆ రోజున గ్రామాల్లో ఒక పండుగ వాతావరణం ఉండే విధంగా సంబురాలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కొత్తచట్టం ద్వారా ఒకటే రోజులో భూమి రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌, పాస్‌బుక్‌ ఇస్తారని తెలిపారు. మరోవైపు భూముల సమగ్ర సర్వే కూడా జరుగుతుందని వెల్లడించారు. ఈ చట్టం దేశంలోనే నంబర్‌వన్‌ రెవెన్యూ చట్టం అవుతుందని పేర్కొన్నారు. దేశమే అబ్బురపడే విధంగా ఈ చట్టం ఉంటుందని సీఎం కేసీఆర్‌ చెప్పారు.logo