సోమవారం 25 మే 2020
Telangana - Mar 30, 2020 , 02:34:11

ప్రతిగింజ కొనుగోలు చేయాలి

ప్రతిగింజ కొనుగోలు చేయాలి

-గ్రామాల్లో అన్ని ఏర్పాట్లుచేయండి

-వలసకార్మికులకు 12కిలోల బియ్యం,  రూ.500

-లాక్‌డౌన్‌ పక్కాగా అమలుచేయాలి

-కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రైతులెవరూ ధాన్యం విక్రయించేందుకు పట్టణాలకు రావొద్దు.. గ్రామాల్లోనే పంటమొత్తాన్ని కొనుగోలుచేసేలా ఏర్పాట్లుచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఆదివారం ప్రగతిభవన్‌ నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, ఇతరఅధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మంత్రులు ఈటల రాజేందర్‌, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి రైతుబంధుసమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి శాంతికుమారి, వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ సత్యనారాయణరెడ్డి, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లాక్‌డౌన్‌ అమలవుతున్నతీరు, ప్రజలకు నిత్యావసరసరుకుల పంపిణీని అడిగి తెలుసుకున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తిచెందకుండా తీసుకోవాల్సినచర్యలను వివరించారు. వైద్యారోగ్యశాఖ అధికారులు ఇచ్చిన వివరాల ప్రకారం ఏప్రిల్‌7వ తేదీ నాటికి రాష్ట్రంలో కరోనా లేకుండా పోతుందని.. అయినప్పటికీ ఏప్రిల్‌14 వరకు లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలుచేయాలని సూచించారు. పంటకోత నుంచి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా చర్చించారు. గ్రామాల్లో రైతులకు యాసంగి పంట చేతికొస్తుందని, వారి పనులకు ఆటంకం కలుగకుండా తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయమార్కెట్లను బంద్‌ పెడుతున్న నేపథ్యంలో రైతులెవరూ ధాన్యం తీసుకురాకుండా చూడాలని.. వారి ప్రతిగింజను కొనుగోలు చేసేలా చూడాలని కేసీఆర్‌ ఆదేశించారు.


logo