బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Oct 16, 2020 , 02:09:34

యాసంగి సాగు 63 లక్షల ఎకరాలు

యాసంగి సాగు 63 లక్షల ఎకరాలు

  • అత్యధికంగా 50 లక్షల ఎకరాల్లో వరి
  • 13 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు
  • 2 లక్షల ఎకరాల్లో కూరగాయలు అదనం
  • యాసంగి నియంత్రిత పంటల సాగు ఖరారు
  • మక్కలసాగు వద్దనేది ప్రభుత్వ సూచన.. ఆపై రైతు ఇష్టం 
  • ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టీకరణ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో యాసంగి సీజన్‌లో 63 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేయాలని ప్రభుత్వం సూచించింది. ఇందులో అత్యధికంగా 50 లక్షల ఎకరాల్లో వరి వేయాలని.. 13 లక్షల ఎకరాల్లో ఇతర పంటలను సాగుచేయాలని పేర్కొన్నది. ఈ మేరకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు యాసంగి సీజన్‌కు సంబంధించి నియంత్రిత పంటల సాగు విధానాన్ని ఖరారుచేశారు. యాసంగి సాగు విధానంపై గురువారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. యాసంగిలో పంటలసాగుపై జిల్లాలవారీగా ప్రతిపాదనలు అందజేయాలని ఇటీవల వ్యవసాయఅధికారుల సమావేశంలో సీఎం ఆదేశించారు. ఆ మేరకు క్లస్టర్లు, మండలాలు, జిల్లాలవారీగా యాసంగిలో సాగుచేసే పంటలపై అంచనాలను రూపొందించి కేసీఆర్‌కు అందజేశారు. వీటిపై గురువారం జరిగిన సమావేశంలో విస్తృతంగా చర్చించి.. యాసంగి పంటల సాగుపై తుదినిర్ణయం తీసుకున్నారు.

9 లక్షల ఎకరాలు అధికం

గతేడాది యాసంగితో పోల్చితే ఈసారి సుమారు 9 లక్షల ఎకరాల్లో అధికంగా పంటలు సాగవుతాయని ప్రభుత్వం పేర్కొన్నది. యాసంగిలో వరిని 50 లక్షల ఎకరాల్లో వేయాలని సూచించింది. శనగ 4.5 లక్షలు, వేరుశనగ 4 లక్షలు, జొన్న, నువ్వులు లక్ష ఎకరాల చొప్పున వేయాలని పేర్కొన్నది. పెసర్లు 50 నుంచి 60 వేలు, మినుములు 50 వేలు, పొద్దు తిరుగుడు 30 నుంచి 40 వేలు, ఎకరాల్లో, ఆవాలు, కుసుమలు, సజ్జలు తదితర పంటలు మరో 60వేల నుంచి 70 వేల ఎకరాల్లో సాగుచేయాలని నిర్ణయించింది. అదేవిధంగా మిరపతోపాటు ఇతర కూరగాయలను లక్షన్నర నుంచి రెండు లక్షల ఎకరాల్లో సాగు చేయాలని సూచించింది. గతేడాది యాసంగిలో ఉద్యానపంటలు కాకుండా మొత్తం 53.82 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ఈసారి సుమారు 9.18 లక్షలకుపైగా సాగు పెరుగనున్నది. గతేడాది 39.31 లక్షల ఎకరాల్లో వరినాట్లు వేయగా.. ఈసారి 10.69 లక్షల ఎకరాల్లో సాగు పెరుగనున్నది. ఇక యాసంగి సీజన్‌ పంటల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచినట్లు సీఎం వెల్లడించారు.


ఒరవడిని కొనసాగించాలి

పంటల సాగులో వానకాలంలో చూపించిన ఒరవడిని యాసంగిలోనూ కొనసాగించాలని సీఎం కేసీఆర్‌ రైతులకు పిలుపునిచ్చారు. వానకాలం సీజన్‌లో ప్రభుత్వం సూచించిన మేరకు వందకు వందశాతం నియంత్రిత పద్ధతిలోనే రైతులు పంటలు సాగుచేశారని అన్నారు. ఈ నియంత్రిత పంటల సాగువిధానం నిరంతర ప్రక్రియగా కొనసాగాలని చెప్పారు. జిల్లాలు, మండలాలు, క్లస్టర్లవారీగా ఏ పంటలు వేయాలనే విషయంలో వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. పంటల సాగు లెక్కలతో కార్డులు తయారుచేయాలని ఆదేశించారు. రైతులు కూడా ఆ మేరకే సాగుచేసి మంచిధర పొందాలని తెలిపారు. ఒక సీజన్‌లో విత్తనాలు వేయడం ముగియగానే.. మరో సీజన్‌లో ఏ పంటలు వేయాలనే విషయంలో కార్యాచరణ ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ వ్యవసాయశాఖకు దిశానిర్దేశం చేశారు. ఈ విషయంలో రైతుబంధు సమితులు క్రియాశీలపాత్ర పోషించాలని చెప్పారు. దసరా నాటికి చాలావరకు రైతు వేదికల నిర్మాణం పూర్తవుతుందని, వాటిద్వారా రైతులను సంఘటితంచేసి, సమన్వయపర్చడం సులభమవుతుందని తెలిపారు.

మక్కల సాగు వద్దేవద్దు

మక్కల విషయంలో దేశీయంగా, అంతర్జాతీయంగా నెలకొన్న వ్యతిరేక పరిస్థితుల నేపథ్యంలో ఆ పంటను సాగుచేయవద్దని సీఎం కేసీఆర్‌ మరోసారి రైతులకు స్పష్టం చేశారు. ఇది ప్రభుత్వ సూచన మాత్రమేనని.. ఈ విషయంలో రైతులే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఎంత ధరవస్తే అంతకే అమ్ముకుంటామనుకుంటే పండించుకోవచ్చని తెలిపారు. మక్కలకు రూ.900 మించి ధరవచ్చే అవకాశం లేదని అధికారులు అంచనా వేస్తున్నారని అన్నారు. సమీక్షలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌, వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, సీఎంవో అధికారులు స్మితాసబర్వాల్‌, ప్రియాంకవర్గీస్‌, అగ్రికల్చర్‌ యూనివర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు, ఉద్యానవనశాఖ ఎండీ వెంకట్రామ్‌రెడ్డి, జేడీ శోభారాణి తదితరులు పాల్గొన్నారు.

కొత్త విధానమేదైనా ఒక్కరోజుతో.. 

ఒక్క ప్రయత్నంతో ఎవరికీ అలవాటు కాదు.. నిరంతర ప్రక్రియ ద్వారా అది అందరికీ అలవడుతుంది. నియంత్రిత సాగు విధానంద్వారా లాభం చేకూరుతుందని రైతుకు ఒకటికి నాలుగుసార్లు అర్థమయ్యేలా చెప్పాలి. అప్పుడే వారిలో అవగాహన, చైతన్యం పెరుగుతాయి.

- ముఖ్యమంత్రి కేసీఆర్‌


logo