సోమవారం 01 జూన్ 2020
Telangana - May 17, 2020 , 22:11:45

వచ్చే వర్షాకాలం నుంచి మూడో టీఎంసీని వాడుకోవాలి: సీఎం కేసీఆర్‌

వచ్చే వర్షాకాలం నుంచి మూడో టీఎంసీని వాడుకోవాలి: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌:  కాళేశ్వరం ప్రాజెక్టుల పరిధిలోని అన్ని పంపుల నిర్మాణం మే నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. కొండపోచమ్మ సాగర్‌ వరకు నీటిని పంప్‌ చేయాలని సూచించారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఈ వర్షాకాలం అవంభించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్‌  మంత్రులు, అధికారులతో  సమీక్ష నిర్వహించారు. 

'నీటిపారుదలశాఖ భూములు, కట్టల ఆక్రమణను తీవ్రంగా పరిగణించాలి. వర్షాకాలంలో ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల ప్రారంభం కాగానే మొదట అన్ని చెరువులు, కుంటలు నింపాలి. దీని కోసం అవసరమైన ఓటీలను, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లను వెంటనే నిర్మించాలి. చెరువులు, కుంటలు ఏడాదంతా నిండి ఉండే వ్యూహం అవలంభించాలి. చెరువుల నుంచి రైతులు మట్టిని తీసుకుపోవడానికి అవకాశం ఇవ్వాలి. అధికారులు రైతులపై ఎలాంటి ఆంక్షలు పెట్టవద్దు. ఈ వానాకాలంలో ఎస్పారెస్పీ ఆయకట్టు పరిధిలో 16లక్షల 41వేల 284 ఎకరాలకు సాగునీరు అందించాలి. గోదావరిలో పై నుంచి వచ్చే వరదను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ ఎస్పారెస్పీని కాళేశ్వరం ద్వారా నింపాలని' అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.  

'ఎల్‌ఎండీ నుంచి దిగువకు నీరందించడానికి ప్రస్తుతమున్న కాలువ కేవలం 6వేల క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యంతో ఉంది. దీని ద్వారా సామర్థ్యాన్ని 9వేల క్యూసెక్కులకు పెంచాలి. కాళేశ్వరం మూడో టీఎంసీ ఎత్తిపోసే పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి. వచ్చే వర్షాకాలం నుంచి మూడో టీఎంసీని వాడుకోవాలి. దేవాదుల ప్రాజెక్టు ద్వారా వరంగల్‌ జిల్లాలోని అన్ని చెరువులు నింపాలి. సమ్మక్క బరాజ్‌ పనులను వేగవంతం చేయాలి. దేవాదుల ప్రాజెక్టు 365 రోజులూ నీటిని లిఫ్టు చేయాలి. వరద కాలువకు వెంటనే నీరు విడుదల చేయాలని' సీఎం కేసీఆర్ సూచించారు. 


logo