ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 16, 2020 , 00:39:07

నేడు మంత్రులు, కలెక్టర్లతో సీఎం సమావేశం

నేడు మంత్రులు, కలెక్టర్లతో సీఎం సమావేశం

కల్ల్లాల ఏర్పాటు, ఉపాధి హామీ, వ్యవసాయం, సాగునీటి పనులపై చర్చ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం మంత్రులు, జిల్లా కలెక్టర్లతో సమావేశం కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష కళ్లాల నిర్మాణం, ఉపాధి హామీ పనులు, వ్యవసాయరంగం, సాగునీటి పనులపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చిస్తారు. ఉదయం 11.30 గంటలకు ప్రగతిభవన్‌లో జరిగే ఈ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశమున్నది. ఈ సమావేశానికి అడిషనల్‌ కలెక్టర్లు ( స్థానిక సంస్థలు), జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు, జిల్లా ప్రజాపరిషత్‌ సీఈవోలు,జిల్లా పంచాయతీ అధికారులు, జిల్లా అటవీ అధికారులు, జిల్లా వ్యవసాయ అధికారులు పాల్గొంటారు. ఇప్పటికే ప్రభుత్వానికి మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికపై చర్చించి ఒక నిర్ణయం తీసుకొంటారు.

ఉపాధి హామీ పనుల ద్వారా గ్రామాల్లో రైతులకు కల్లాలు నిర్మించాలన్న ప్రతిపాదనతోపాటు, కాలువలు, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నది. వ్యవసాయ పనులు వేగం పుంజుకొన్న నేపథ్యంలో ఉపాధి హామీ పథకం పనులను రైతుల కళ్లాల నిర్మాణంతోపాటు కాలువలు, డిస్ట్రిబ్యూటరీ పనులకు వినియోగిస్తే ఉపయుక్తంగా ఉంటుందని సర్కారు భావిస్తున్నది. సమావేశంలో పాల్గొనే అధికారులు మంగళవారం ఉదయం రంగారెడ్డి జిల్లాపరిషత్‌ కార్యాలయానికి వస్తే అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో ప్రగతిభవన్‌కు తీసుకెళ్తామని పంచాయతీరాజ్‌శాఖ సర్క్యులర్‌ విడుదలచేసింది.  


logo