గురువారం 04 జూన్ 2020
Telangana - May 10, 2020 , 21:26:08

వ్యవసాయ శాఖపై సీఎం కేసీఆర్‌ సుదీర్ఘ సమీక్ష

వ్యవసాయ శాఖపై సీఎం కేసీఆర్‌ సుదీర్ఘ సమీక్ష

హైదరాబాద్‌: వ్యవసాయాభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణంతో సాగునీటి సమస్య పరిష్కారమవుతోందన్నారు. దేశానికే అన్నంపెట్టే ధాన్యాగారంగా అద్భుత తెలంగాణ రూపొందుతున్నదని వివరించారు. వ్యవసాయ శాఖపై సీఎం కేసీఆర్‌ ఇవాళ ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. 

'వ్యవసాధికారులు, రైతుబంధు సమితి, వ్యవసాయ యూనివర్సిటీ, పౌరసరఫరాల సంస్థ సమన్వయంతో వ్యవహరించి రైతులకు మేలు చేసే వ్యవసాయ విధానంపై చైతన్యం కలిగించాలి. రాష్ట్రంలో రాబోయే కాలంలో దాదాపు 90 లక్షల ఎకరాల్లో ప్రతి ఏటా వరి పంట పండుతుంది. రెండు కోట్ల 70లక్షల టన్నుల ధాన్యం వస్తుంది. ఇంత ధాన్యాన్ని బియ్యంగా మార్చడానికి అనుగుణంగా రాష్ట్రంలో రైస్‌ మిల్లులు తమ సామర్థ్యం పెంచుకోవాలని' సీఎం సూచించారు. 

'రైతుల పంటలను కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయడమే కాకుండా ఆ ముడిసరుకును వినిమయ వస్తువుగా మార్చే బాధ్యతను కూడా తీసుకునే క్రియాశీల సంస్థగా పౌరసరఫరాల సంస్థ రూపాంతరం చెందాలి. దీని వల్ల రైతులకు మంచి ధర వస్తుంది. వినియోగదారులకు తక్కువ ధరకు నాణ్యమైన వస్తువులు అందుతాయి. కల్తీలను అరికట్టవచ్చు.' అని సీఎం పేర్కొన్నారు. 

రాష్ట్రంలో పంటలకు మంచి ధర వచ్చి రైతులకు మేలు కలిగేలా చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందరూ ఒకే పంట వేసి నష్టపోకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసే పద్ధతిని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అమలు చేయబోయే సమగ్ర వ్యవసాయ విధానంపై క్షేత్రస్థాయి వ్యవసాయధికారులతో సమావేశం కావాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. 


logo