శనివారం 16 జనవరి 2021
Telangana - Nov 25, 2020 , 01:19:19

టీకాల పంపిణీకి రెడీ

టీకాల పంపిణీకి రెడీ

  • రాష్ర్టాలకు ముందుగా కొన్ని వ్యాక్సిన్‌ డోసులు పంపించండి
  • 15 రోజులపాటు సైడ్‌ఎఫెక్ట్స్‌ను పరిశీలించాలి
  • ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్‌
  • ముందుగా కరోనా వారియర్స్‌కు వ్యాక్సినేషన్‌
  • ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ స్ఫూర్తితో యువ ఐఆర్‌ఎస్‌ అధికారి శశికాంత్‌ తన వివాహ తంతు పదికాలాలపాటు బంధువులకు గుర్తుండేలా పెండ్లి పత్రికను వినూత్నంగా తయారుచేయించారు. ఆహ్వాన పత్రికలో కూరగాయల విత్తనాలను అమర్చారు. వివాహం అయ్యాక ఈ పత్రికలను భూమిలో నాటాలని సూచిస్తున్నారు. తన వివాహ ఆహ్వాన పత్రికను మంగళవారం సీఎం కేసీఆర్‌కు ప్రగతిభవన్‌లో అందజేశారు.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: శాస్త్రీయంగా ఆమోదించిన వ్యాక్సిన్‌ను ప్రజలకు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ఈ వ్యాక్సిన్‌ వల్ల ఏమైనా సైడ్‌ఎఫెక్ట్స్‌ ఉంటాయా అనే విషయాన్ని ముందుగా నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. మంగళవారం ప్రధాని నరేంద్రమోదీ అన్నిరాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చాక ప్రజలకు అందించే విషయంలో అనుసరించాల్సిన విధానంపై చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ తన అభిప్రాయాలను వెల్లడించారు.

‘వ్యాక్సిన్‌ కోసం ప్రజలంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. శా్రస్త్రీయంగా ఆమోదింపబడిన వ్యాక్సిన్‌ రావాల్సిన అవసరం ఉన్నది. వ్యాక్సిన్‌ను ప్రాధాన్యక్రమంలో ప్రజలకు అందించేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఇందుకనుగుణమైన కార్యాచరణ రూపొందించాం. ఈ వ్యాక్సిన్‌ వల్ల ఏమైనా సైడ్‌ఎఫెక్ట్స్‌ ఉంటాయా అనే విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. దేశంలో వివిధ ప్రాంతాల్లో వేర్వేరు వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. కరోనా వైరస్‌ కూడా దేశమంతటా ఒకేరకమైన ప్రభావం చూపలేదు. వ్యాక్సిన్‌ కూడా ఒక్కోప్రాంతంలో ఒక్కోరకమైన సైడ్‌ఎఫెక్ట్స్‌ ఇచ్చే అవకాశం ఉన్నది. 

ఈ నేపథ్యంలో ముందుగా రాష్ట్రానికి కొన్నిడోసుల వ్యాక్సిన్‌ పంపి వాటిని కొంతమందికి ఇచ్చాక పది పదిహేనురోజులు పరిస్థితిని పరిశీలించాలి. తర్వాతే మిగతా వారికి ఇవ్వాలి’ అని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఈ కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ముర్తజా రజ్వీ, మెడికల్‌ హెల్త్‌డైరెక్టర్‌ శ్రీనివాస్‌రావు, మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ రమేశ్‌రెడ్డి, కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి, కొవిడ్‌-19 నిపుణుల కమిటీ సభ్యుడు డాక్టర్‌ గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.


ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం

రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్‌ వేసేందుకు కార్యాచరణను రూపొందించాలని, అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారును ఆదేశించారు. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం సీఎం కేసీఆర్‌ అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సిన్‌ను సరఫరా చేసేందుకు అవసరమైన కోల్డ్‌చైన్‌ రూపొందించాలని చెప్పారు. రాష్ట్ర, జిల్లా, మండలస్థాయిలో కమిటీలుగా ఏర్పడి వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుందని సూచించారు. మొదట ఆరోగ్యకార్యకర్తలకు, కొవిడ్‌పై ముందుండి పోరాడుతున్న పోలీసులు, ఇతరశాఖల సిబ్బందికి, అరవైఏండ్లు దాటిన, తీవ్రమైన జబ్బులతో బాధపడుతున్నవారికి ఇవ్వాలని పేర్కొన్నారు. దీనికోసం జాబితాను తయారుచేయాలని ఆదేశించారు.