శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Oct 14, 2020 , 18:52:57

స‌మ‌గ్ర ఉద్యాన‌వ‌న పంట‌ల విధానానికి సీఎం కేసీఆర్‌ ఆదేశం

స‌మ‌గ్ర ఉద్యాన‌వ‌న పంట‌ల విధానానికి సీఎం కేసీఆర్‌ ఆదేశం

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగులో గుణాత్మకమైన మార్పు తీసుకురావడానికి సమగ్ర ఉద్యానవన పంటల విధానాన్ని త‌యారు చేయాల‌ని సీఎం కేసీఆర్ ఉద్యాన‌వ‌నశాఖ అధికారుల‌ను ఆదేశించారు. ప‌క్క రాష్ర్టాల్లో, ఇత‌ర దేశాల్లో పర్యటించి తెలంగాణకు అనుగుణమైన విధానాన్ని మూడు నెలల్లోగా రూపొందించాల‌న్నారు. ఏడాదిలోగా ఉద్యాన పంటల సాగులో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్‌లో బుధవారం ఉద్యానవన శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష స‌మావేశం నిర్వహించారు. ఈ స‌మావేశంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి బి.జనార్ద‌న్ రెడ్డి, ఉద్యానవనశాఖ ఎండీ వెంకట్రాంరెడ్డి, జేడీ సరోజన, డీడీ సునంద, సీనియర్ అధికారులు సత్తార్, బాబు, భాగ్యలక్ష్మి, మధుసూదన్, లహరి, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ... కూరగాయలు, పండ్లు, పూలు తదితర తోటల సాగులో గుణాత్మక మార్పులు రావాలని, ఇందుకోసం ఉద్యానవనశాఖ బలోపేతం కావాలన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో విభిన్న స్వభావాలు కలిగిన నేలలు, మంచి వర్షపాతం, వృత్తి నైపుణ్యం కలిగిన రైతులు ఉన్నారన్నారు. ఈ సానుకూలతలను వినియోగించుకుని పండ్లు, కూరగాయలు, పూల సాగులో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉద్యానవనశాఖను బలోపేతం చేయడానికి ప్రభుత్వం అవ‌స‌ర‌మైన‌ అన్ని ర‌కాల‌ చర్యలు తీసుకుంటుందని ఈ సంద‌ర్భంగా సీఎం హామీ ఇచ్చారు. తెలంగాణ‌ వివిధ రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిచినట్లు ఉద్యానవన పంటల సాగులో కూడా అగ్రస్థానం సంపాదించాలన్నారు. భవిష్యత్తుకు బాటలు వేసుకునే దశలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యానవన పంటల విషయంలో కూడా సమగ్ర దృక్పథం అవ‌స‌ర‌మ‌ని తెలిపారు. 

 స్వ‌యం సంవృద్ధి సాధించాలి.. 

రాష్ట్ర వ్యాప్తంగా 900-1500 మిల్లీమీటర్ల వార్షిక సగటు వర్షపాతం ఉంది. వృత్తి నైపుణ్యం కలిగిన లక్షలాది రైతు కుటుంబాలున్నాయి. ఇవన్నీ తోటల సాగుకు ఎంతో సానుకూలం. ఇన్ని వ‌న‌రులు ఉండి కూడా ఇంకా ఇత‌ర‌ రాష్ట్రాల నుంచి పండ్లు, కూరగాయలు, పూలు, మసాల దినుసులు, నూనె గింజలను దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. ఈ పరిస్థితి మారాల‌ని సీఎం అన్నారు. ఉద్యానవన పంటల్లో తెలంగాణ రాష్ట్రం స్వయం సమృద్ధి సాధించాల‌న్నారు. మన అవసరాలు తీర్చడంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు, ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి చేసే విధంగా మనం ఎదగాల‌న్నారు. ఇందుకోసం ఉద్యానవనశాఖ సమాయత్తం కావాలని సూచించారు. ఏ ప్రాంతంలో ఎలాంటి ఉద్యానవన పంటలు సాగు చేయగలుగుతామో తెలిపి రైతులకు అవగాహన కల్పించాల‌న్నారు. 

ఉద్యాన‌వ‌న‌శాఖ అధికారుల‌కు శిక్ష‌ణ‌..

ఉద్యాన‌వ‌న‌శాఖ అధికారుల‌కు శిక్ష‌ణ అవ‌స‌రం అని సీఎం పేర్కొన్నారు. ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లి అక్క‌డి సాగు పద్ధతులు, అనుభవాలు, మార్కెటింగ్ గురించి తెలుసుకోవాల‌న్నారు. ఉద్యానవనశాఖ అధికారులను బెంగులూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రిసెర్చ్ కు పంపి శిక్షణ ఇప్పించాల‌న్నారు. అక్కడి నుంచి నిపుణులను తెలంగాణకు ఆహ్వానించి ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించాలన్నారు. హార్టికల్చర్ యూనివర్సిటీలో, ఉద్యానవన శాఖలో తోటలపై పరిశోధనలు విస్తృతంగా జరపాలని సీఎం సూచించారు. ఉద్యానవన పంటల సాగులో వస్తున్న ఆధునిక పద్ధతులు, మార్కెటింగ్‌పై ఎప్పటికప్పుడు అధ్యయనం జరగాల‌న్నారు. ఈ శిక్షణ, అధ్యయన ప్రక్రియ నిరంతరాయంగా కొన‌సాగాల‌న్నారు. ఉద్యానవన తోటల సాగులో యాంత్రీకరణను ప్రోత్సహించాల‌ని చెప్పారు.

ఖాళీల‌ను భ‌ర్తీ చేసేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంది..

ఉద్యాన‌వ‌న‌శాఖ‌లో ఖాళీల‌ను భ‌ర్తీ చేసేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ శాఖను విస్తరించాల్సిన అవసరం ఉంద‌న్న సీఎం మండలానికి ఒక ఉద్యానవనశాఖ అధికారిని నియమించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇంకా ఎంత మంది ఉద్యోగులు కావాలి? శాఖను ఎలా విస్తరించాలి? అనే అంశాలపై వెంటనే ప్రతిపాదనలు తయారు చేయాల‌న్నారు. అవసరమైన అధికారులను, సిబ్బందిని నియమించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్న‌ట్లు పేర్కొన్నారు. 

కొంగ‌ర‌క‌లాన్‌లో ఉద్యాన పంట‌ల మార్కెట్‌...

రాష్ట్ర ఉద్యానవనశాఖలో కూడా సాగు విధానంలో వస్తున్న మార్పులను అధ్యయనం చేయడానికి, మార్కెటింగ్ పై నిరంతరం సమాచారం తెలుసుకోవడానికి, పంటల్లో నాణ్యత పెరగడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయడానికి సీనియర్ అధికారుల నాయకత్వంలో ప్రత్యేక విభాగాలు ఉండాల‌న్నారు.  దేశంలో, ప్రపంచంలో ఎక్కడ ఏది అవసరమో గుర్తించి వాటిని రైతులతో సాగు చేయించాల‌న్నారు. ఢిల్లీ ఆజాద్ పండ్ల‌ మార్కెట్ తరహాలో హైదరాబాద్ కొంగరకలాన్ ప్రాంతంలో 300 ఎకరాల విస్తీర్ణంలో ఉద్యానవన పంటల మార్కెట్‌ను నెలకొల్ప‌నున్న‌ట్లు సీఎం వెల్ల‌డించారు.