ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Sep 06, 2020 , 02:29:17

కొత్త సచివాలయంలో 3 ప్రార్థన మందిరాలు ఒకే రోజు శ్రీకారం

కొత్త సచివాలయంలో 3 ప్రార్థన మందిరాలు ఒకే రోజు శ్రీకారం

  • ప్రభుత్వ ఖర్చుతోనే నిర్మాణం
  • అసెంబ్లీ సమావేశాల అనంతరం శంకుస్థాపన
  • రాష్ట్రంలో రెండో అధికార భాషగా ఉర్దూ భాష
  • ముస్లిం మతపెద్దలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌
  • అన్ని మతాలకు సమాన ప్రాధాన్యం
  • త్వరలో ఇస్లామిక్‌ సెంటర్‌ పనులు ప్రారంభం
  • హైదరాబాద్‌ చుట్టూ ఖబ్రస్థాన్‌ల ఏర్పాటు
  • నారాయణపేటలో పీరీల చావడి అధికార భాషా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉర్దూ భాషావేత్త

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కొత్తగా నిర్మించే సచివాలయంలో మందిరం, మసీదు, చర్చిని ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక అన్ని ప్రార్థనా  మందిరాలకు శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. శనివారం కొత్త సెక్రటేరియట్‌లో ప్రార్థనామందిరాల నిర్మా ణం, ఇతర అంశాలపై ముస్లిం మత పెద్దలతో సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. వారినుంచి అభిప్రాయాలు సూచనలు తీసుకొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పాత సచివాలయం కూల్చివేస్తున్న సమయంలో అక్కడున్న మందిరం, రెండు మసీదులకు నష్టం వాటిల్లిందని, వాటిని పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో నిర్మించాలని నిర్ణయించామని తెలిపారు. ఒక్కొక్కటి 750 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇమామ్‌ క్వార్టర్‌తో సహా రెండు మసీదులు (మొత్తం 1500 చదరపు అడుగులు ) ప్రభుత్వం నిర్మిస్తుందని చెప్పారు. 

పాత సెక్రటేరియట్‌లో ఉన్న స్థలంలోనే మసీదులను నిర్మించి వక్ఫ్‌ బోర్డుకు అప్పగిస్తామని సీఎం తెలిపారు. 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో దేవాలయ నిర్మాణాన్ని పూర్తిచేసి దేవాదాయ శాఖకు అప్పగిస్తామని వెల్లడించారు. కొత్త సెక్రటేరియట్‌ ప్రాంగణంలో తమకూ ప్రార్థనామందిరం కావాలన్న క్రిస్టయన్ల కోరిక మేరకు చర్చిని కూడా ప్రభుత్వం నిర్మిస్తుందని పేర్కొన్నారు. ‘తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా ఆదరిస్తుంది. గంగా జమునా తహజీబ్‌కు ప్రతీక. అందుకే కొత్త సెక్రటేరియట్‌లో అన్ని మతాల ప్రార్థనా మందిరాలు నిర్మిస్తాం. ముస్లిం అనాథ పిల్లలకు ఆశ్రయమిచ్చి, విద్య నేర్పించే అనీస్‌-ఉల్‌ - గుర్బా నిర్మాణం వేగవంతం చేస్తాం. ఇప్పటికే 80 శాతం నిర్మాణం పూర్తయింది. మరో 18కోట్లు అవసరమవుతాయి. వాటిని వెంటనే విడుదల చేసి పూర్తి చేయిస్తాం. అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్‌ నగరంలో ఇస్లామిక్‌ సెంటర్‌ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

ఇందుకోసం స్థలం కూడా కేటాయించింది. కరోనా పరిస్థితుల వల్ల నిర్మాణంలో జాప్యం జరుగుతున్నది. వెంటనే ఈ సెంటర్‌ నిర్మాణ పనులు ప్రారంభిస్తాం.’ అని సీఎం తెలిపారు. హైదరాబాద్‌ నగరం చుట్టూ ఖబ్రస్థాన్‌లు రావాల్సిన అవసరం ఉన్నదని, ఇందుకోసం అవసరమైన స్థలాలను సేకరించాలని రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల కలెక్టర్లను కోరామని చెప్పారు. మొత్తంగా 150 నుంచి 200 ఎకరాల్లో ఖబ్రస్థాన్‌లను ఏర్పాటుచేస్తామని పేర్కొన్నారు. నారాయణపేటలో రోడ్ల వెడల్పు సందర్భంగా పీరీల చావడికి నష్టం వాటిల్లిందని, స్థలం కేటాయించి నిర్మించాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఉర్దూను రెండో అధికార భాషగా గుర్తిస్తున్నామని తెలిపారు. ఉర్దూ పరిరక్షణ, అభివృద్ధికోసం కార్యక్రమాలను చేపడతామన్నారు. అధికారభాషా సంఘంలో ఉర్దూ భాషకు సంబంధించిన వ్యక్తిని ఉపాధ్యక్షుడిగా నియమిస్తామని వెల్లడించారు. 

సీఎం నిర్ణయం హర్షణీయం: ఒవైసీ

సచివాలయంలో కూల్చివేసిన మసీదుల స్థానంలో కొత్తవి నిర్మించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించడం హర్షణీయమని ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. శనివారం దారుల్‌ సలాంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌ నగరం ఐక్యతకు నిదర్శనమని, అన్ని మతాల ప్రజలు కలిసి ఉంటారని పేర్కొన్నారు. అన్ని వర్గాల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్‌ కొత్త సెక్రటేరియట్‌లో ప్రార్థనా మందిరాలు నిర్మించాలని నిర్ణయించారని, వచ్చే నెల మొదటి వారంలో సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేసే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. సీఎంతో సమావేశంలో హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ, ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు సభ్యుడు మౌలానా ముఫ్తీ ఖలీల్‌ అహ్మద్‌ సాహబ్‌, ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు సెక్రటరీ మౌలానా ఖలీద్‌ సైఫుల్లా రహ్మాని, మజ్లిస్‌ ఉలేమా-ఇ- డెక్కన్‌ ప్రెసిడెంట్‌ మౌలానా సయ్యద్‌ కుబూల్‌ బాద్‌షా షట్టారి, మౌతమిమ్‌ దారుల్‌ ఉలూమ్‌ రహ్మానియా, జామియత్‌ ఉలేమా-ఇ- హింద్‌ ప్రెసిడెంట్‌ మౌలానా ముఫ్తీ గ్యాసుద్దీన్‌ రహ్మానీ, అమీర్‌ -ఈ-జామియా నిజాయా మౌలానా సయ్యద్‌ అక్బర్‌ నిజాముద్దీన్‌ హుస్సేనీ, అమీర్‌-ఇ-జమాత్‌ ఈ ఇస్లామియా మౌలానా హమీద్‌ మొహమ్మీద్‌ ఖాన్‌ సాహబ్‌, తామీర్‌-ఇ-మిల్లత్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మౌలానా జియాఉద్దీన్‌ నాయ్యర్‌, ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు మెంబర్‌, హైదరాబాద్‌ నాజిమ్‌ దారుల్‌ ఉలూమ్‌ మౌలానా రహీముద్దీన్‌ అన్నారీ తదితరులు పాల్గొన్నారు.



logo