మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 14, 2020 , 02:21:56

పన్నుల పెంపు తప్పదు

పన్నుల పెంపు తప్పదు
  • జవాబుదారీతనం పెంచేందుకే కొత్త చట్టాలు
  • అమలు చేయగలిగేవే చెప్తాం.. ఓట్లకోసం భయపడేది లేదు
  • పల్లె, పట్టణప్రగతి కార్యక్రమాలతో ప్రజాప్రతినిధులపై పెరిగిన బాధ్యత
  • ప్రతి గ్రామంలో డంపింగ్‌యార్డ్‌, శ్మశానవాటిక, నర్సరీలు ఉన్న రాష్ట్రం దేశంలో మనదే
  • ‘పల్లెప్రగతి’ పై అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్‌
  • ప్రతి గిరిజన పంచాయతీకి రేషన్‌ అందేలా చర్యలకు ఆదేశం
  • చిన్న పంచాయతీలకు ఏటా రూ.5 లక్షలు
  • సీఎం కేసీఆర్‌ ప్రకటన వెంటనే జీవో విడుదల

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వ్యవస్థలను ఆర్థికంగా బలోపేతం చేసేలా విద్యుత్‌ చార్జీలు, మున్సిపల్‌, గ్రామ పంచాయతీ పన్నులు కొంతమేర పెంచక తప్పదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. పేదలపై ఎలాంటి భారం లేకుండా.. చెల్లించే స్థోమత ఉన్నవారి నుంచే వసూలు చేసేలా ఈ పెంపు ఉండబోతున్నదని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు ప్రజలు కట్టే పన్నులమీదే పని చేస్తాయని అన్నారు. ప్రజలకు వాస్తవాలు చెప్తామని.. వారికి ప్రభుత్వంపై నమ్మకం ఉన్నదని పేర్కొన్నారు. గతంలో సాధ్యంకాని హామీలిచ్చిన వాళ్లను ఎక్కడుంచాలో అక్కడ్నే ఉంచారని గుర్తుచేశారు. శుక్రవారం అసెంబ్లీలో పల్లెప్రగతిపై స్వల్ప వ్యవధి చర్చలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలు అంశాలపై సవివరంగా మాట్లాడారు. గత 70 ఏండ్లలో పల్లెలు ఎలాంటి దుస్థితికి చేరాయి.. వాటిని బాగుచేసేందుకు ఇప్పుడు ఎలాంటి కార్యాచరణతో రాష్ట్రప్రభుత్వం ముందుకెళుతున్నదో సీఎం కేసీఆర్‌ వివరించారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామని.. దానిని ఇస్తున్న సంస్థ బతకాలంటే కరంట్‌ చార్జీలు పెంచాలని, పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి కోసం పన్నుల రూపంలో కొంత భారం వేయాలని నిర్ణయించామని చెప్పారు. ఈ నిర్ణయాన్ని ముందే ధైర్యంగా చెప్తున్నామని, వసూలైన పన్నుల్లో ప్రతిపైసా ప్రజలకోసమే ఖర్చుచేస్తామని తెలిపారు. పన్ను లు పెంచకుండానే పనులు చేస్తామని ప్రజలను మభ్యపెట్టలేమని.. పేదలకు భారం కలుగకుండా పెంపు ఉంటుందని సీఎం చెప్పారు. ఉదాహరణకు విద్యుత్‌చార్జీలనే తీసుకుంటే ఎస్సీ, ఎస్టీలకు 101 యూనిట్ల విద్యుత్‌ ఉచితంగా ఇస్తున్నామని.. వారికి రూపాయి కూడా చార్జీ పెంచేదిలేదని చెప్పారు. పన్ను చెల్లించే సామర్థ్యం ఉన్నవారికి మాత్రం చార్జీలు పెంచుతామని పేర్కొన్నారు.


దృఢ సంకల్పంతోనే కొత్త పంచాయతీరాజ్‌చట్టం 

‘అధికారుల్లో జవాబుదారీతనం పోయింది. తనిఖీల్లేవు, ఆడిట్లు లేవు.. అడిగేవాడు లేకుండాపోయింది. తప్పుచేసిన సర్పంచ్‌ను కలెక్టర్‌ తీసేస్తే, మధ్యాహ్నం కల్లా ఎమ్మెల్యేను పట్టుకుని మంత్రి దగ్గరి నుంచి స్టే తెచ్చుకోవడం.. మళ్లీ అదే కలెక్టర్‌ ముందు కూర్చుని ఆ సర్పంచ్‌ వెకిలి నవ్వులు నవ్వే పరిస్థితి వచ్చింది. ఎక్కడో ఒకచోట దీనిని బ్రేక్‌చేయాలి. మంచిపేరో.. చెడ్డపేరో ఏదో ఒకటి రానీ.. కానీ ఆ సంకల్పం గట్టిగా తీసుకోకపోతే పరిస్థితి ఎక్క డ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంటది. అందుకే దృఢసంకల్పంతో నూతన చట్టాన్ని తెచ్చాం. నూరుశాతం అమలుచేసి తీరతాం’ అని సీఎం కేసీఆర్‌ స్పష్టంచేశారు.  


ఎమ్మెల్యేల జీతం కట్‌చేసైనా నిధులిస్తాం

గ్రామపంచాయతీలకు నిధుల కేటాయింపును బడ్జెట్‌లో స్పష్టంగా పేర్కొన్నామని కేసీఆర్‌ తెలిపారు. కేంద్రం రాబోయే ఆర్థిక సంవత్సరానికి 15వ ఆర్థికసంఘం నుంచి గ్రాంటుగా రూ.1,847 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించిందని, అందుకు సమానంగా రూ.1,847 కోట్లను రాష్ట్రం నుంచి చరిత్రలోనే మొదటిసారిగా పంచాయతీలకు ఇవ్వనున్నామని చెప్పారు. అవసరమైతే ఎమ్మెల్యేల జీతాలు కట్‌చేస్తాం కానీ.. పంచాయతీలకు నిధులు ప్రతినెలా విడుదల చేస్తామని తెలిపారు. ఆ డబ్బును పంపే బాధ్యతను సైతం తానే తీసుకుంటానని ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ దేశంలోనే తిలిసారిగా రాష్ట్రంలో మూడువేల గిరిజన పంచాయతీలను ఏర్పాటు చేసిందని చెప్పారు. అక్కడ ప్రజలందరికీ రేషన్‌ అందేలా చర్యలు తీసుకోవాలని సివిల్‌సైప్లెశాఖ మంత్రిని ఆదేశించారు. ఐదొందలు, అంతకంటే తక్కువ జనాభా ఉన్న గ్రామపంచాయతీలు 899 ఉన్నాయని వీటిని ప్రత్యేక పరిస్థితుల్లో ఏర్పాటుచేశామన్నారు. ఏడాదికి రూ.5 లక్షలలోపు గ్రాంటు మాత్రమే వచ్చే చిన్న గ్రామాలకు కూడా అవసరం మేరకు అదనపు నిధులు కేటాయిస్తూ శుక్రవారమే ఆర్డర్‌ జారీచేస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. తక్కువ జనాభా ఉన్నాసరే ప్రతి పంచాయతీకి ట్రాక్టర్‌ తప్పక ఉండాలని ఆదేశించినట్టు తెలిపారు. ములుగు జిల్లా డిమాండ్‌ వచ్చినప్పుడు ఛత్తీస్‌గఢ్‌ సీఎస్‌ సలహా తీసుకున్నామని.. గిరిజనప్రాంతా లు కలిపి జిల్లాగా ఉంటే అధికారయంత్రాంగం దృష్టి పెరిగి మేలు జరుగుతుందని సలహా వచ్చిందన్నారు. 


వందశాతం ట్యాక్స్‌లు వసూలు చేయాల్సిందే..

పన్నులు వసూలుచేయని సర్పంచ్‌లు, గ్రామకార్యదర్శి ఉద్యోగాలు తీసేలా చట్టం ఉన్నదని, దాన్ని వందశాతం అమలుచేస్తామని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ప్రాపర్టీట్యాక్స్‌ల విషయంలో ప్రజలకే అధికారమిస్తూ.. సెల్ఫ్‌సర్టిఫై చేసుకోవాలని చెప్పామని, అదేరీతిలో పంచాయతీల్లోనూ సెల్ఫ్‌ డిక్లరేషన్‌ విధానం పెడతామని చెప్పారు. కానీ తప్పుచేస్తే మాత్రం 25 రెట్లు జరిమానా, రెండేండ్ల జైలుశిక్ష విధిస్తామన్నారు. 60 ఏండ్లుగా ప్రేమగా చెప్తే గ్రామాలన్నీ పెంటకుప్పల్లా మారాయని, అందుకే పక్కాగా చట్టాల అమలుతో భయంతేవాలని నిర్ణయించామని చెప్పారు. సత్తుపల్లి నియోజకవర్గంలో వైకుంఠధామాలను దేవాలయాల మాదిరిగా అద్భుతంగా నిర్మించారని తెలిపిన సీఎం కేసీఆర్‌.. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, స్థానిక అధికారులు, ప్రజలకు అభినందనలు తెలిపారు.


అందరికీ బాధ్యత

గ్రామ, పట్టణ అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరిపై బాధ్యత పెట్టిందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. సర్పంచ్‌, కౌన్సిలర్‌, వార్డు సభ్యుడితోపాటు, ప్రజలపై, ప్రజాప్రతినిధులపైనా బాధ్యతనుంచిందన్నారు. కచ్చితంగా వార్డు, గ్రామంకోసం పనిచేయాలని, మొక్కలు పెంచాలని, పరిశుభ్రత పాటించేలా చూడాలని, నీళ్లు వస్తున్నయా, లేదా అన్న విషయాలపై రోజూవారీ మానిటరింగ్‌ ఉండేలా చట్టాలుతీసుకొచ్చామన్నారు. ఇటీవల నిర్వహించిన పల్లెప్రగతి లో గణనీయమైన ప్రగతిని సాధించామని వివరించారు. 


300 గ్రామాలకు సామూహిక శ్మశానవాటిక

1986లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మూడు రాష్ర్టాల్లో మూడు గ్రామాలను సందర్శించానని సీఎం కేసీఆర్‌ గుర్తుచేసుకొన్నారు. నిజామాబాద్‌ జిల్లా అంకాపూర్‌కు వెళ్లి వారితో రోజంతా ఉండి వ్యవసాయంపై సిద్దిపేట రైతులకు శిక్షణ ఇప్పించానని తెలిపారు. ఆ తర్వాత సినీగాయని లతామంగేష్కర్‌ గ్రామం బందార్కర్‌, అన్నాహజారే గ్రామం మాలేగావ్‌కు వెళ్లామని, ఆ తర్వాత మహారాష్ట్రలోని ఓ ప్రాంతంలో సుమారు 300 గ్రామాలకు ఒకేచోట సామూహిక శ్మశానవాటికలను నిర్మించారని, ఆ నిర్మాణాలు ఎంతో ఆకట్టుకొన్నాయని వెల్లడించారు. ఈ విధమైన మార్పు అన్ని రాష్ర్టాల్లోనూ రావాలన్నారు. చనిపోయినవాళ్లను సంస్కారంతో పంపించాలనే లక్ష్యంతో రాష్ట్రంలోని ప్రతిగ్రామంలో శ్మశానవాటికలు నిర్మిస్తున్నామని తెలిపారు. పరిశుభ్రతకు డంపింగ్‌ యార్డులు, మొక్కల పెంపకానికి నర్సరీలు ఏర్పాటుచేశామని, ట్రాక్టర్‌, ట్రాలీ, ట్యాంకర్లను కూడా ఇచ్చామన్నారు. జూనియర్‌ పంచాయతీ అధికారుల నుంచి డీపీవో, ఎంపీవో, జెడ్పీ సీఈవో వరకు పోస్టులన్నీ భర్తీ చేశామని వివరించారు. గ్రామాల్లో అత్యవసర పనులకోసం కూడా కలెక్టర్ల దగ్గర రూ.కోటి పెట్టినట్టు చెప్పారు. నాటిన మొక్కల్లో 86 శాతం బతికాయన్నారు. 


కరోనా అయినా గజ్జున వణకాలె

ఎక్కడెక్కడో ఏవేవో వ్యాధులు, అంటురోగాలు వస్తున్నాయని, కానీ తెలంగాణకు కరోనా అయినా ఎలాంటి అంటురోగమైనా రావాలంటే రోగాలే గజ్జున వణకాలె అని సీఎం కేసీఆర్‌ అన్నారు. గ్రామాలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుతున్నామని, ఏ రోగాలు దరికి రావని చెప్పారు. ప్రజాప్రతినిధులకు చేతులెత్తి నమస్కరిస్తున్నానని, పల్లె, పట్టణప్రగతిపై ప్రత్యేక దృషి పెట్టాలని విజ్ఞప్తిచేశారు. కలెక్టర్లు. డీపీవోలు గ్రామాల్లో పల్లె నిద్రలు చేయాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులున్నా తన దృష్టికి తీసుకురావాలని, అవసరమైతే ఎస్జీఎఫ్‌ నుంచి నిధులు అత్యవసరంగా మంజూరుచేస్తానని ప్రకటించారు. దీనికోసం రూ.3,500 కోట్లు ఉన్నాయని సీఎం చెప్పారు. 


ఏజెన్సీ ప్రాంతాలపై నిర్ణయం తీసుకొంటాం

నోటిఫై (ఏజెన్సీ) ప్రాంతాల్లో సాంకేతికమైన ఇబ్బందులతో ఎన్నికలు జరుగలేదని, ఆ ప్రాంతాల్లో పల్లె, పట్టణప్రగతి జరుగలేదని, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకొంటామని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. భద్రాచలంలో ఎన్నికలు లేవని, పల్లెప్రగతి జరుగలేదని ఎమ్మెల్యే పొదెం వీరయ్య చెప్పడంతో సీఎం కేసీఆర్‌ పలుఅంశాలను వెల్లడించారు. గవర్నర్‌ సిఫారసుతో మణుగూరు, మందమర్రి, ఆసిఫాబాద్‌, భద్రాచలం, సారపాకపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి పంపించామని చెప్పారు. అయినప్పటికీ.. ఈ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేకంగా లేదా ఐటీడీఏ నుంచి నిధులు ఇచ్చేందుకు త్వరలో నిర్ణయిస్తామన్నారు. 


పంచాయతీ నిధుల నుంచి జీతాలు ఇవ్వరాదు

కొన్ని ప్రాంతాల్లో పంచాయతీల నిధుల నుంచి మండల పరిషత్తులో పనిచేస్తున్న కంప్యూటర్‌ ఆపరేటర్లు, బోర్‌వెల్‌ ఇంచార్జిలకు  వేతనాలిస్తున్నారని.. సీఎల్పీ నేత భట్టి అనటంపై స్పందించిన సీఎం కేసీఆర్‌.. రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదని, ఒకవేళ ఉంటే దృష్టికి తీసుకురావాలన్నారు. పంచాయతీ నిధుల నుంచి జీతాలు ఇవ్వరాదని స్పష్టంచేశారు. చిరుద్యోగుల వేతనాలను పెంచిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని, ఎక్కడ పనిచేస్తున్నారో అక్కడినుంచే వేతనాలు తీసుకోవాలని చెప్పారు. నరేగా నుంచి గ్రామ పంచాయతీల్లో వివిధ పనుల కోసం రూ.4 వేల కోట్లు వినియోగించుకొనే అవకాశం ఉన్నదని సూచించారు.


చిన్న పంచాయతీకీ రూ.5 లక్షలు 

‘రాష్ట్రంలోని శివారు గ్రామాల్లోనూ అభివృద్ధి ఆగకూడదు. ప్రతిపల్లే పరిశుభ్రంగా ఉండాలని కొత్త గ్రామాలను ఏర్పాటుచేసుకున్నాం. కొన్ని గ్రామాల్లో ఐదొందల కంటే తక్కువ జనాభా ఉన్నది. ఆ గ్రామాలకు కూడా కనీసం రూ.5లక్షలకు తక్కువ కాకుండా ప్రతియేడు నిధులు రావాలి. ఆ విధంగా చర్యలు తీసుకోవాలి’ అంటూ సీఎం కేసీఆర్‌ శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. దాన్ని అమల్లోకి తీసుకువస్తూ పంచాయతీరాజ్‌శాఖ సాయంత్రానికే జీవో విడుదల చేసింది. 


దయాకర్‌రావు నంబర్‌వన్‌

ఈ మధ్య చేసిన ఇంటర్నల్‌ సర్వేల్లో పంచాయతీరాజ్‌ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నంబర్‌వన్‌గా ఉన్నారని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించారు. పనిచేస్తుంటే ప్రశంసలు వస్తుంటాయని, ఎర్రబెల్లి పనితీరు బాగున్నదని, తన శాఖ ఉద్యోగులతో మంచిగా పనిచేస్తున్నారని అభినందించారు. పల్లెప్రగతిలో చాలామందిని భాగస్వామ్యం చేయించారని, అందుకే ప్రగతి కార్యక్రమం సక్సెస్‌ అయిందని చెప్పారు. మంత్రి ఎర్రబెల్లిని, ఆయన శాఖ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్టు సీఎం చెప్పారు. 


మీ స్ఫూర్తికి వందనం..

వర్ధన్నపేట నియోజకవర్గంలోని దమ్మన్నపేటకు చెందిన కాంట్రాక్టర్‌ కామిడి నర్సింహారెడ్డి తన గ్రామాభివృద్ధి కోసం రూ.25 కోట్లు విరాళం ఇచ్చారని.. ఆయనను సభికులంతా అభినందించాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. హుస్నాబాద్‌ నియోజవర్గంలోని గట్ల నర్సింగాపూర్‌కు చెందిన భాస్కర్‌రావు రూ.3 కోట్లు, నల్లగొండ నియోజకవర్గంలో కంచర్ల కృష్ణారెడ్డి గ్రామాభివృద్ధికి రూ.కోటి విరాళాలు ఇచ్చారని, నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండలంలో దాతలు ఉచితంగా ట్రాక్టర్లు అందజేశారని, కాపులకనపర్తికి చెందిన ఉద్యోగులంతా వారి గ్రామంకోసం అర్నెళ్ల జీతాన్ని విరాళంగా ఇచ్చారన్నారు. గజ్వేల్‌ నియోజకవర్గం మల్కాపూర్‌, పరకాల నియోజకవర్గం గీసుకొండ మండలం మరియాపూర్‌, యాదాద్రి భువనగిరిలో పాఠశాలల స్వరూపాన్నే మార్చేసిన వైనం.. పెద్దపల్లి, సిద్దిపేట జిల్లాల్లో ఇంటింటికీ ఇంకుడు గుంతల ఏర్పాటు, జగిత్యాల జిల్లా హిమ్మత్‌రావుపేటలో కోతుల కోసం ఫుడ్‌కోర్టుతోపాటు పలు గ్రామాల్లో దాతలు విరాళాలు అందజేశారని చెప్పారు. ప్రజలు రోజుల తరబడి స్వచ్ఛందంగా శ్రమదానంలో పాల్గొనడం వారిలో వస్తు న్న సానుకూల ధోరణికి నిదర్శనమని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ‘ఈ దాతలందరికీ నేను చేతులెత్తి రాష్ట్ర ప్రజలందరీ పక్షాన దండం పెట్టి కృతజ్ఞతలు, ధన్యవాదా లు తెలియజేస్తున్నా.. మీరిచ్చే డబ్బు కంటే మీరిచ్చిన స్ఫూర్తి ఎంతో గొప్పది. అది మనందరినీ ముందుకు తీసుకెళ్తుంది’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు.


logo
>>>>>>