శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Sep 08, 2020 , 13:04:56

అణుపరీక్షకి రంగం సిద్ధం చేసిన దక్షత కూడా పీవీదే: సీఎం కేసీఆర్‌

అణుపరీక్షకి రంగం సిద్ధం చేసిన దక్షత కూడా పీవీదే: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌:  మాజీ ప్రధాని పీవీ  నరసింహారావు   సంస్కరణలనే వృక్షాలు నాటితే ఈనాడు మనం వాటి ఫలాలు  అనుభవిస్తున్నామని, అందుకే ఆయన నూతన ఆర్థిక విధానాల విధాత, గ్లోబల్ ఇండియాకు రూపశిల్పి అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. పీవీ శతజయంతి ఉత్సవాలపై శాసనసభలో జరిగిన చర్చలో సీఎం కేసీఆర్‌  ప్రసంగించారు.   

భారత విదేశాంగ విధానంలో మేలి మలుపులు పీవీ దౌత్యనీతి ఫలితమే. అంతవరకూ సోవియట్ యూనియన్ తో మాత్రమే సంబంధాలు కలిగిన భారత్ ను ఒకేఒక అగ్రరాజ్యమైన అమెరికాకు మిత్రదేశంగా మార్చిన ఘనత పీవీదే. భారత్ కు వ్యతిరేకంగా, పాకిస్తాన్ కు అనుకూలంగా ఉండిన నాటి అమెరికా అధ్యక్షుడు క్లింటన్ ను సుముఖం చేసుకున్నది పీవీ వ్యూహమే. 'లుక్ ఈస్ట్ పాలసీ' ప్రవేశపెట్టి సింగపూర్, మలేషియా, ఇండోనేషియా వంటి “ఏషియన్ టైగర్స్” కి భారత్ ని చేరువ చేసి వ్యాపారాభివృద్ధికి దోహదం చేసింది పీవీ దూరదృష్టేనని వివరించారు. 


ఇప్పుడు ఆ విధానాన్నే 'యాక్ట్ ఈస్ట్ పాలసీ'గా కొనసాగిస్తున్నారు. చైనాతో సరిహద్దు సమస్యను పక్కనపెట్టి, వాణిజ్య సంబంధాలు పెంపొందించుకోవాలని ప్రతిపాదించి, బీజింగ్ వెళ్లి ఒప్పందం కుదుర్చుకుని వచ్చింది పీవీనే. దాదాపు మూడు దశాబ్దాలు భారత్-చైనా సరిహద్దు ప్రశాంతంగా ఉండటానికి పీవీ దౌత్యమే కారణం.  రెండో అణుపరీక్షకి రంగం సిద్ధం చేసిన దక్షత కూడా  పీవీదే.  ఉగ్రవాదుల పీచమణచడంలో సమర్థవంతుడైన పోలీసు అధికారిగా పేరుతెచ్చుకున్న కేపీఎస్ గిల్ కు సంపూర్ణ మద్దతు, వ్యూహాత్మకమైన తోడ్పాటు అందించడం ద్వారా పంజాబ్ లో శాంతిని పునరుద్ధరించారు. కె ఆర్ వేణుగోపాల్ వంటి సమర్థులైన అధికారుల సహకారంతో కాశ్మీర్ లో శాంతి నెలకొల్పగలిగారు. అని సీఎం పేర్కొన్నారు. 


logo